తుమ్మలకు షాకిచ్చిన తమ్మినేని…అవాక్కయిన టీఆర్‌ఎస్‌

By KTV Telugu On 17 November, 2022
image

అలూ లేదు చూలు లేదు అన్నట్లుంది తెలంగాణలో సీపీఎం చేస్తున్న పని. వచ్చె ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం మాదే అని ఇప్పుడే కర్చీఫ్‌ వేసేసింది. పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంటున్నారు. గత ఎన్నికల్లో పాలెరులో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వచ్చె ఎన్నికల్లో మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తమ్మినేని చేసిన ప్రకటనతో తుమ్మల ఉలిక్కిపడ్డారు. ఆయన ఆశలకు వామపక్షాలు గండి కొట్టేలా ఉన్నాయి. తమ్మినేని ప్రకటన టీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా మింగుడు పడడం లేదు. మునుగోడు ఎన్నికలో వామపక్షాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. ఆ మద్దతు మునుగోడు వరకే అని తమ్మినేని కూడా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కామ్రెడ్లు టీఆర్‌ఎస్‌తో పొత్తులు పెట్టుకుంటారా ? సీట్లను పంచుకుంటారా అనేది తెలియదు. ఒకవేళ పొత్తులు ఉంటే కమ్యూనిస్టులకు కేసీఆర్‌ ఎన్నీ సీట్లు ఇస్తారో తెలియదు. ఇచ్చిన సీట్లలో పాలేరు ఉంటుందో ఉండదో తెలియదు. కానీ తమ్మినేని అప్పుడే ఒక అడుగు ముందుకేసి ఏయే సీట్లలో తాము పోటీచేస్తామో అనౌన్స్‌ చేసేశారు.

ముఖ్యంగా పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందని తేల్చి చెబుతున్నారు. ఈ మాటతో తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నట్టే. 2018లో తెలంగాణ వ్యాప్తంగా తెరాస హవా ఉన్న సమయంలో కూడా పాలేరు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఓడిపోయారు. ఇటీవల తుమ్మల పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని తుమ్మల స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని వచ్చే ఎన్నికలో తన విజయానికి అందరూ సహకరించాలని కార్యకర్తలతో చెప్పారు. ఇప్పుడు తమ్మినేని చేసిన ప్రకటనతో తుమ్మల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే తమ్మలకు కేసీఆర్‌తో మంచి దోస్తానా ఉంది. మరోవైపు కేసీఆర్ ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే కమ్యూనిస్టుల సపోర్టు చాలా అవసరం. మరి ఈ నేపథ్యంలో
తనతో కొత్తగా జతకట్టిన కామ్రెడ్లకు పాలేరును వదులుకుంటారా లేకపోతే పాతమిత్రుడికి అండగా నిల్చుంటారా అనేది ముందుముందు తెలుస్తుంది.