తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టాన్ని ఎదుర్కొంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..పయనమెటు అన్న ప్రశ్నలకు తెరదించారు. కాంగ్రెస్ లో చేరిన ఆయన ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. రెండు సార్లు ఓడిపోయిన తర్వాత తుమ్మల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే మారింది. ఇప్పుడాయన హస్తం పార్టీ టికెట్ పై ఎక్కడ నుంచి పోటీ చేస్తారోనన్న టెన్షన్ మాత్రమే కొందరు అనుచరుల్లో మిగిలింది.
కాంగ్రెస్ పార్టీ తుమ్మలకు ఎర్రతివాచీ పరిచిన తర్వాత ఆయన కోసం రెండు నియోజకవర్గాలను రెడీ చేశారని చెబుతున్నారు. రెండూ ఆయనకు ఇష్టమైన నియోజకవర్గాలైనప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం పూర్తి సానుకూలంగా లేవని కూడా అనుమానాలు కలుగుతున్నాయి. రెండు చోట్ల ప్రత్యర్థులు బలంగా ఉన్న నేపథ్యంలో తుమ్మలకు నిద్రలేని రాత్రులు ఖాయమని ప్రచారం జరుగుతోంది..
టీడీపీలో ఒక వెలుగు వెలిగి బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కొత్త రూటు వెదుకుతున్నారు. టీడీపీని నిత్యం దూరం పెట్టే కాంగ్రెస్ పార్టీలో ఆయన సీటు ఖాయం చేసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లాంటి నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ సాదరంగా ఆహ్వానించడం తుమ్మలకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు టికెటి అశించి భంగపడ్డ తుమ్మల కాంగ్రెస్ లో అదే స్థానం నుంచి పోటీ చేస్తారో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అశ్వారావుపేట నియోజకవర్గంపై కూడా ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఆ రెండింటిలో ఎక్కడ నుంచైనా పోటీ చేసేందుకు సిద్దమేనని తుమ్మల.. కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు సమాచారం.
పాలేరు, అశ్వారావుపేట రెండు చోట్ల తుమ్మలకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు అనేక జనానికి అనేక రకాల సహాయాలు అందించినప్పటికీ , ఆయన కమ్మ సామాజిక వర్గ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ గెలుపు నడిచొచ్చె కొడుకులాంటిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మల్సె మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరు కూడా నియోజకవర్గం ప్రజలకు బాగా దగ్గరగా ఉంటారని జనమే అంగీకరిస్తున్నారు. పైగా ఎవరికి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వచ్చి పలుకరించడం, ఆర్థిక సాయం చేయడంలో ఆయ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముందుంటారు. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. మరో పక్క తుమ్మల అనుచరులు కొంతమంది ఇప్పుడు ఆయనకు మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. అశ్వారావుపేటలో తుమ్మల అనుచరులు మెచ్చా వైపు మొగ్గు చూపడంలో మాజీ మంత్రి కొంత అసహనానికి లోనవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టైమ్ కి వచ్చి తనను కలవాల్సిన వాళ్లు రాలేదని తెలుసుకుని ఏదో జరుగుతోందని తుమ్మల ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లోనూ తమ్మల స్వగ్రాం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోనూ ఎంతో మంది కాంగ్రెస్ ప్రముఖులు ఆయన్ను వచ్చి కలుస్తున్నారు. తుమ్మల ముఖ్య అనుచరులు కొంతమంది మాత్రం సారీ చెప్పకుండానే దూరంగా ఉండిపోయారు. అల్లిపల్లిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వచ్చిన వారు మాత్రమే తుమ్మల వెంట నడుస్తుండగా.. నాలుగు దశాబ్దాలుగా ఆయన వెంట ఉన్న కొందరు కీలక వ్యక్తులు ఎందుకు రావడం లేదో తుమ్మలకే అర్థం కావడం లేదట. దానితో 2018 నాటి ఓటమి పునరావృతమవుతుందా అని తుమ్మల బ్యాచ్ టెన్షన్ పడుతోంది. తన అనుచరుల కంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవాల్సి వస్తోందని తుమ్మల కొందరు ఆంతరంగికులకు చెబుతున్నారట…