విజయశాంతికి జయసుధతో చెక్ !

By KTV Telugu On 31 July, 2023
image

KTV Telugu ; –

విజయశాంతి ఓవరాక్షన్ ను కంట్రోల్ చేసేందుకు బీజేపీ కొత్త అస్త్రాన్ని బయటకు తీసింది. ఆ దిశగానే పావులు కదుపుతూ సహజ నటి జయసుధకు తలుపులు బార్లా తీసింది. త్వరలోనే జయసుధ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. విజయశాంతి ఆరోపణలు సంధించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డినే ఇప్పుడు జయసుధ చేరికలో కీలక భూమిక పోషిస్తున్నారని సమాచారం. ఆ దిశగా ఎన్నికల వేళ బీజేపీలో చేరికల ఊపు కనిపిస్తోంది..

ఒక గీతను చిన్నదిగా చూపారంటే దాని పక్క మరో పెద్ద గీత పెట్టాలి. ఒక సెలబ్రిటీని దెబ్బకొట్టాలంటే మరో సెలబ్రిటీని రంగంలోకి దించాలి. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు అదే గేమ్ ఆడుతున్నారు. విమర్శల ట్వీట్లతో పార్టీని ఇబ్బంది పెడుతున్న విజయశాంతిని దారికి తెచ్చేందుకు వారు జయసుధకు వెల్కం చెబుతున్నారు. పైగా విజయశాంతి కంటే జయసుధ క్రమశిక్షణ ఉన్న నాయకురాలిగా కూడా పేరుంది. ఎన్నికల వేళ ఒక కేండెట్ దొరినట్లవుతుందని, ఆమె సేవలను ప్రచారానికి కూడా ఉపయోగించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే త్వరలోనే జయసుధ బీజేపీలో చేరే అధికారిక కార్యక్రమం ఉండొచ్చు…

విజయశాంతి అవసరానికి మించి పొలిటికల్ యాక్షన్ చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తన రేంజ్ ఏమిటో తెలుసుకోకుండా, తనకిచ్చే ప్రాతినిధ్యం ఏమిటో అర్థం చేసుకోకుండా ఆమె ఎగిరెగిరి పడతారని కూడా చెబుతారు. రాంగ్ టైమ్ లో పార్టీలు మారి రాజకీయంగా దెబ్బతిన్నా..ఇంకా ఆమెకు పరిస్థితులు ఆర్థం కావడం లేదని బీజేపీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విజయశాంతి చేసిన ఒక ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి ఉన్న చోట ఎక్కువసేపు కూర్చోలేకపోయానని ట్వీట్ చేస్తూ ఆమె పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అధిష్టానం ఏరికోరి పార్టీలో చేర్చుకున్న కిరణ్ పట్ల ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ డిసిప్లీన్ కు వ్యతిరేకమన్న చర్చ జరిగింది. రెండు రోజులు తిరక్కముందే ఆమె మరో ట్వీట్ చేశారు.మణిపూర్ ఘర్షణలపై ఆమె చేసిన ట్వీట్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేదిగా ఉందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. రెండో సారి పిలిచి చేర్చుకుంటే ఇదేమి ఖర్మరా నాయనా అని తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని కొంత మంది నేతలు విశ్లేషించుకున్నారు. దానితో రూటు మార్చి .. జయసుధను పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదిపినట్లు వార్తలు వస్తున్నాయి..

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరారు. తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. అప్పట్నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చేరికలతో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ముందుగా ఎన్నికలు ఉండటంతో తన అనుభవాన్నంతా ముందుగా అక్కడ వినియోగిస్తున్నారు. ఆ దిశగా సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన సినీ నటి జయసుధతో చర్చలు జరిపి ఆమెను కమలం పార్టీలో చేర్పించే ఏర్పాట్లు వేగం పెంచారు. ఆయన చొరవ మేరకు జయసుధ వెళ్లి టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీలో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. తర్వాత ఓడిపోయారు. ఇక సైలెంట్ అయిపోయారు. వ్యక్తిగత సమస్యలతో కొన్నాళ్లుగా సినిమాలకూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత కాలం క్రితం వైసీపీలో చేరిన ఆమె.. అక్కడ కూడా ఇమడలేకపోయారు. ఇప్పుడు మాత్రం బీజేపీ ఆమెకు గట్టి భరోసానే ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

విజయశాంతి లాంటి వాళ్లను దెబ్బకొట్టి దారికి తీసుకురావాలంటే జయసుధలా సైలెంట్ గా నరుక్కుని వచ్చే వాళ్లే కరెక్టని బీజేపీ విశ్వసిస్తోంది. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా ఓవరాక్షన్ చేసే వాళ్లని పక్కన పెడితేనే పార్టీకి మంచిదన్న ఫీలింగులో ఉన్నట్లు సమాచారం. పైగా బీజేపీలో చేరికలు కూడా ఊపందుకున్నాయి.
తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో పాటు మరికొంత మంది జిల్లా స్థాయి నేతలు బీజేపీలో చేరుతున్నారు ఈ ప్రక్రియలో కిరణ్ రెడ్డి ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి నేతను విమర్శిస్తే ఏమవుతుందో కూడా విజయశాంతికి తెలిసొచ్చే టైమొచ్చింది. ఏదేమైనా జయసుధ పంట పండిందనే చెప్పాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..