కత్తులు దూస్తున్నారు

By KTV Telugu On 14 August, 2023
image

KTV Telugu ;-

నిజ జీవితంలోనే కాదు…రాజకీయాల్లోనూ ఎవరితో తమకి ముప్పు ఉంటుందో ..ఎవరంటే భయం ఉంటుందో.. వారిపైనే విమర్శలు సంధిస్తూ ఉంటారు.
ఒకరినొకరు తిట్టుకుంటున్నారంటే దానర్ధం ఒకరిపై ఒకరికి అసహ్యం అని కాదు. భయమే అని అర్దం చేసుకోవాలంటున్నారు రాజకీయ శాస్త్రవేత్తలు. ఇపుడు తెలంగాణాలో ఇదే జరుగుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతోన్న తెలంగాణా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్-భారత రాష్ట్ర సమితి నేతల మధ్య పచ్చగడ్డే కాదు మంచు గడ్డ వేసినా భగ్గుమని మండుతోంది. ఒకరిని చూస్తే మరొకరికి మండుకొచ్చేస్తోంది. దాంతో ఒకరినొకరు తమకి వచ్చిన తిట్లన్నీ తిట్టుకుని సంతృప్తి పడుతున్నారు. ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు. ఒకరిని చూసి మరొకరు పళ్లు పట పటా కొరికేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం బి.ఆర్.ఎస్. అధినేత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కు పిండం పెట్టాలన్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దీనిపై తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో పాలక పక్ష నేతలు రేవంత్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో తెలంగాణా ప్రజలే తేలుస్తారని బి.ఆర్.ఎస్. మంత్రులు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి కనీస సంస్కారం కూడా లేకపోయిందని దుయ్యబట్టారు. తాజాగా రేవంత్ రెడ్డి ఒక దొంగ..చీటర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాజకీయాల్లో విలువలు పడిపోయాయని మేథావులు పెదాలు విరుస్తున్నారు.

పాలక పక్షం పనితీరు బాగా లేకపోతే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విమర్శలు చేయచ్చు. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోమని సూచనలు చేయచ్చు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఇదేం పద్ధతి అని నిలదీయవచ్చు. ఎంత చెప్పినా ప్రజలను వేధిస్తోంటే ఆందోళనలతో ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి ప్రయత్నాలు చేయచ్చు. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేయొచ్చు. అంతే కానీ నోరు ఉంది కదా అని ఎడా పెడా తిట్టేసుకోవడం మాత్రం దారుణం అంటున్నారు రాజకీయ పండితులు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేతలను పట్టుకుని ఏకవచన ప్రయోగం చేయడం..నీ అంతు చూస్తా.. నీ పిండం పెడతా అనడం అత్యంత కుసంస్కారమే అంటున్నారు విశ్లేషకులు.

అసలింతకీ రేవంత్ రెడ్డి-కేసీయార్ ల మధ్య గొడవేంటి? ఇద్దరి మధ్య ఆస్తితగాదాలు లేవు. ఒకరినొకరు మోసం చేసుకున్న ఘటనలు లేవు. ఇద్దరి మధ్య పాత కక్షలు కూడా లేవు. అయినా ఘోరమైన భాషను ఎందుకు వాడుతున్నారు? తెల్లారి లేస్తే చాలు ఒకరిపై ఒకరు బురద ఎందుకు జల్లుకుంటున్నారు. వీరికి అటూ ఇటూ రెండు పార్టీల నేతలు ఎందుకు కోరస్ పలుకుతున్నారు. దీని వెనక ఉన్న మతలబు ఏంటి? కొద్ది వారాల క్రితం బిజెపి-బి.ఆర్.ఎస్. నేతలు సరిగ్గా ఇపుడు కాంగ్రెస్-బిఆర్ఎస్ లు తిట్టుకున్నట్లే తిట్టుకునేవి. ఇపుడు బిజెపి బయటకు పోయింది. కాంగ్రెస్ వచ్చి చేరింది. బి.ఆర్.ఎస్. కామన్ గా అలానే ఉండిపోయింది.

ఇలా పార్టీల మధ్య తిట్ల దండకాలు ఊపందుకోడానికి అసలు కారణం ఎన్నికల రాజకీయాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడో సారి అధికారంలోకి రావాలని బి.ఆర్.ఎస్. పట్టుదలగా ఉంది. తెలంగాణా ఇచ్చిన పార్టీగా ఈ సారి అయినా తెలంగాణాలో బోణీ కొట్టాలని కాంగ్రెస్ తహ తహ లాడుతోంది. తమకీ అధికారానికీ మధ్య బి.ఆర్.ఎస్ ఒక్కటే అడ్డని కాంగ్రెస్ భావిస్తోంది. అటు బి.ఆర్.ఎస్. కూడా ఇలాగే అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీయే అడ్డులేకపోతే హ్యాట్రిక్ విజయానికి ఢోకా ఉండదని గులాబీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

కాంగ్రెస్ నేతలు బి.ఆర్.ఎస్. ను తిట్టినంత మాత్రాన ఎన్నికల్లో గెలిచిపోతారా? కాంగ్రెస్ పై నిప్పులు చెరిగినంత మాత్రాన బి.ఆర్.ఎస్. కు అధికారం ఒళ్లోకి వచ్చి పడుతుందా? ఎవరికి అధికారం రావాలన్నా ఎవరి ప్రభుత్వం రావాలన్నా తేల్చాల్సింది ..కటాక్షించాల్సింది ప్రజలే. ఆ ప్రజలకు సంకేతాలు అందించడం కోసమే పార్టీల నేతలు ఇలా తిట్టుకుంటూ ఉంటాయంటున్నారు పండితులు. రాజకీయాల్లో ఇది సహజమే అంటున్నారు వారు. కర్నాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ పవర్ రేసులో దూసుకుపోతోంది కాబట్టి బి.ఆర్.ఎస్. కు కంగారుగా ఉందంటున్నారు. అందుకే కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారని వారు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి