నగరం గొంతెండుతోంది.. నీళ్లోయ్ నీళ్లు-WATER-CRISIS-IN-HYDERABAD

By KTV Telugu On 28 February, 2024
image

KTV TELUGU :-

వేగంగా  విస్తరిస్తున్న  హైదరాబాద్ మహానగరానికి ఇప్పుడు గొంతెండుతోంది. చుక్క నీరు లేక నగరవాసులు అల్లాడిపోతున్నారు. రోజుల తరబడి నీళ్లు  రాక.. 24 గంటలూ నీటి కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. వాటర్ ట్యాంకర్ల వాళ్లు డబ్బులు దండుకోవడం మినహా సామాన్య జనానికి ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వం ఇస్తున్న హామీలు నెరవేర్చగలిగితే కొంతమేరైనా ఉపశమనం  కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు సమస్య ఏమిటి. ప్రభుత్వం  చేయాలనుకుంటున్నదేమిటి…..

మణికొండ నుంచి ఎల్బీ నగర్, హయత్ నగర్ వరకు  హైదరాబాద్ పౌరులు ఎదుర్కొంటున్న సమస్య ఒక్కటే.ఒక బిందె నీళ్లు ఉంటే ఇవ్వాలని వాళ్లు ప్రాధేయపడుతున్నారు.  మణికొండలోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజులు  నీళ్లు రావడం లేదు. . వాటర్  ట్యాంకర్ల కోసం కళ్లలో వత్తులు వేసుకుని  వాళ్లు ఎదురు చూస్తున్నారు.  మణికొండలోని పయనీర్ ఎస్టేట్, ఈవీవీ కాలనీ, పాషా కాలనీ, శివాలయం రోడ్డు, అల్కాపురి టౌన్‌షిప్, పుప్పాలగూడలోని ఫ్రెండ్స్ కాలనీ సహా పలు కాలనీల వాసులు రోజుల తరబడి  నీటి కోసం అవస్థలు పడుతున్నారు. అక్కడ వారికి పైపుల ద్వారా వచ్చే నీళ్లు రావడం లేదు. దీనితో  ఉపశమనం కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించవలసి వస్తోంది.ఇప్పుడు వాటర్  ట్యాంకర్లు కూడా ఎండమావులైపోయాయి. ఒకప్పుడు 500 రూపాయలు చెల్లిస్తే గంటలో వచ్చే  వాటర్ ట్యాంకర్ ఇప్పుడు రెండు వేల వరకు చెల్లించేందుకు సిద్ధమైనా రెండు రోజులు ఆగాలన్న సమాధానం వినిపిస్తోంది.  గత వారం రోజుల్లో  సరఫరా హెచ్చుతగ్గులకే ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల   వాళ్లు రేట్లు పెంచేశారని కాలనీల వాసులు వాపోతున్నారు.

సాధారణంగా  మార్చి 15 తర్వాత సిటీలో నీటి ఎద్దటి ప్రారంభమై జూన్ ,జూలైలో వర్షాలు  పడే వరకు కొనసాగుతుంది. ఈ సారి విచిత్రంగా ఫిబ్రవరి మూడో వారం నుంచే జనానికి చురుకుముడుతోంది. మెట్రో వాటర్  అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని  చెప్పుకోవాల్సి ఉంటుంది..

మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌ పంచాయతీలను విలీనం చేసి మణికొండ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు.అక్కడ  బహుళ అంతస్తుల భవనాలు భారీగా పుట్టుకొచ్చాయి. వాళ్లకు తగినంతగా నీటి  సరఫరా లేదు. రిజర్వాయర్లు నిండుకున్నాయన్న వార్తలు వస్తున్నాయి. నీటి ట్యాంకర్లపై ఆధారపడాలంటే బుక్ చేసుకున్న నాలుగైదు రోజులకు సరఫరా జరుగుతోంది. ఈ సారి వర్షాలు సరిగ్గా లేకపోవడం, చలికాలం త్వరగా ముగియడంతో  జనవరి చివర్లోనే కాస్తఎండలు మొదలై, ఫిబ్రవరి మధ్య కాలానికి అవి  బాగా పెరిగాయి, దానితో నీటి వినియోగం పెరగడం, సరఫరా తగ్గడం చకచకాజరిగిపోయాయి. గతానుభవాలను చూస్తే  పది ఫ్లాట్స్ ఉన్న అపార్టమెంటులో నీటి కోసం నెలకు యాభై వేల రూపాయలు ఖర్చు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ సారి జూలై వరకు అదే పరిస్థితి  రావచ్చన్న  భయం నెలకొంది. పంచవటి కాలనీ  లాంటి చోట ఏడాదిగా నీటి సమస్యలున్నాయి. హైదరాబాద్ నీటి సమస్యలపై  సమగ్ర విచారణ చేయాలని కోరే వాళ్లూ ఉన్నారు. ఎందుకంటే సమస్య  మణికొండతో అంతం కావడం లేదు. సిటీ మొత్తంలో ఇదే పొజిషన్ కొనసాగుతోంది.  శివార్లలో కూడా ఆ దుస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఫిబ్రవరిలోనే నీటి సమస్యలు అధికారులు ఇచ్చే వివరణ మరో విధంగా ఉంది. హైదరాబాద్ కు నీళ్లు వచ్చే సింగూరులో రెండు వరుస బంద్‌లు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ కారణంగా తొలిదశ ఆగిపోయింది. , డయా సింగూర్ లైన్‌లో లీకేజీ కారణంగా అత్యవసర షట్‌డౌన్ అవసరమైంది.  దాన్ని  పునరుద్దరించే పనిలో ఉన్నామని అధికారులు అంటున్నారు..

నీటి సరఫరా సరిగ్గా లేకపోవడమన్నది నిరంతర సమస్య. ఏడాదికేడాది పెరుగుతుందే  తప్ప తగ్గడం లేదు. పైగా నగర జనాభా రోజురోజుకు బాగా పెరిగిపోతున్నది. వాళ్ల నీటి అవసరాలు తీర్చడం అంత సులభం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని  చేపట్టిన  తక్షణమే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో తాగు నీటి సమస్యపై దృష్టి పెట్టారు.  విశ్రమించకుండానే తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు…

హైదరాబాద్ నగరానికి రోజుకు 270 మిలియన్ గ్యాలెన్ల నీరు  సరఫరా చేసే వారు. అలాగైతేనే జనానికి సరిపడా తాగు నీరు అందుతుంది. ఇప్పుడది చాలా  వరకు పడిపోయింది. ప్రస్తుతం ఏడాదికి 37 టీఎంసీల తాగు నీరు కావాలి.నగరాభివృద్ధి ఇదే స్థాయిలో జరిగితే 2072 నాటికి 71 టీఎంసీల నీరు కావాల్సి ఉంటుంది. ఇదీ దీర్ఘకాలిక  ప్రణాళికగా పరిగణించాలి. అయితే  ఇప్పటికిప్పుడు తలెత్తిన నీటి ఎద్దడి నుంచి నగరవాసులను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ నుంచి అదనపు నీటిని వాడేందుకు అనుమతి ఇవ్వాలని  అధికారులు, సీఎంను కోరారు. సమగ్ర సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ నీటి సమస్యలు ఉన్నాయో  తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ పరిస్థితి హైదరాబాద్ నగరానికే కాకుండా మారుమూల గ్రామాలకు సైతం ఉన్నందునే నిర్దిష్టమైన కార్యాచరణ అవసరమన్నారు. నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటి జలాలు తీసుకోవాలంటే కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు…కేఆర్ఎంబీకి లేఖ రాయాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవ‌స‌ర‌మో స‌మ‌గ్రంగా స‌మీక్షించి వెంట‌నే కేఆర్‏ఎంబీకి లేఖ రాయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. అయితే ఈ మీటింగు తర్వాత ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకూడాదని రేవంత్ ప్రభుత్వం డిసైడైంది. మరి ఇప్పుడేం చేస్తారో చూడాలి. ఇక  గ‌తంలో ఏప్రిల్ నెలాఖ‌రు, మే నెల‌లో వ‌చ్చిన వ‌ర్షాల‌తో జూరాల‌కు నీరు రావ‌డంతో ఇబ్బంది రాలేద‌ని, లేకుంటే నారాయ‌ణ‌పూర్ జ‌లాశ‌యం నీరు విడుద‌ల కోరుతూ క‌ర్ణాట‌క‌ను అభ్య‌ర్థించాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. గ‌తంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించ‌గా మూడేళ్ల క్రితం తీసుకున్నామ‌ని తెలిపారు. అయితే దానిని చివ‌రి అవ‌కాశంగా తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. నగరానికి  నీరందించే  కృష్ణా, గోదావరి రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ రాలేదని అందువల్ల ఎత్తిపోయడం సులభమే అవుతుందని హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సుంకేశుల ఇంటేక్  ప్లాంట్ దగ్గర పంపులు పెట్టి నీటిని ఎత్తిపోస్తున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఇక బోర్  వెల్స్ ని పునరుద్ధరించే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేటు ట్యాంకర్లు కాకుండా కాలనీలకు ప్రభుత్వం సరఫరా చేసే ట్యాంకర్ల సంఖ్యను కూడా పెంచాలని సూచించారు.

సిటీ నీటి సమస్య అనగానే తొట్టతొలిగా గుర్తుకు వచ్చేదీ ప్రైవేటు  టాంకర్ల అరాచకమే. వాళ్లు ఇష్టానుసారం నీటిని 24 గంటలు నిరంతరాయంగా తోడెయ్యడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదమూ ఉంది. వారిని కట్టడి చేయాలంటే పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా పెంచాలి. అందుకు అధికారులు చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి