కాంగ్రెస్ పార్టీ గత నెల వరకూ తెలంగాణాపై ఆశలు పెట్టుకోలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో విజయం ఖాయమని.. తెలంగాణలో మాత్రం టైట్ ఫైట్ ఉందని అనుకుంది. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రం సాధారణ మెజార్టీ కంటే ఐదు సీట్లు కాస్త ఎక్కువ సాధించింది. ఇది ఒక్కటే ఊరట. రేవంత్ రెడ్డి లాంటి నేత ఉండటంతో ఇక్కడ విజయం సాధ్యమయింది. లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే… మరో నాలుగు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
మధ్యప్రదేశ్ లో విజయం ఖాయమనిచాలా సర్వేలు చెప్పాయి. కానీ బీజేపీకి ఏకపక్ష మెజార్టీ వచ్చింది. మూడింట రెండు వంతుల మెజార్టీ వచ్చింది. ఇక రాజస్థాన్ లో హోరాహోరీ పోరు ఉంటుందనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక చత్తీస్ ఘడ్ లో విజయం ఖాయమని.. అందరూ అంచనా వేశారు. కనీసం ఒక్క సీటు అయినా ఎక్కువ వస్తుందని మైయాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కానీ అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. అంటే కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడిన స్థానాల్లో బీజేపీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. తెలంగాణలో బీజేపీ పెద్దగా పోటీ పడలేదు. అయినా కాస్త మెరుగైన ఫలితాల్నే సాధించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి హిందీ బెల్ట్ ప్రాంతంలో ఊహించని దెబ్బలు తగిలాయి. అక్కడ బీజేపీ రాజకీయాల్ని అంచనా వేసి కౌంటర్ ఇవ్వడంలో మరోసారి ఫెయిలయ్యారు. ఇది పార్లమెంట్ ఎన్నికల్లోనూ గట్టి ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.. కాంగ్రెస్ డీలాపడటం బీజేపీకి బూస్ట్ లాంటిదే.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడింది. ఒక్క రాష్ట్రంతోనే సరి పెట్టుకుంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లలో కాంగ్రెస్ కు కనిపించినట్లుగా… . హిందీ రాష్ట్రాల్లో కనిపించలేదు. ఆలాంటి నాయకత్వాన్ని అటు రాహుల్ కానీ ఇటు ఆయా రాష్ట్రాల నేతలు కానీ ప్రజలకు చూపించలేకపోయారు. రాహుల్ గాంధీ జోడో యాత్రల్ని ప్రజలు నమ్మలేదు. కులగణన పేరుతో కుల రాజకీయాన్నీ సహించలేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు దాదాపు 24 విపక్ష పార్టీలు కలిసి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశాయి. వీటిలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరింత డీలా పడినట్లయింది. తాజా ఫలితాలతో బీజేపీకి హిందీబెల్ట్ లో తన పట్టు తగ్గలేదని బ ీజేపీ నిరూపించుకుంది. గత రెండు సార్లు హిందీబెల్ట్ లో 90 శాతానికిపైగా ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలు… బీసీ జనగణనలు అన్నీ తేలిపోతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఈ ఫలితాలు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి. సెమీస్ లో ఓడిపోయారు. అంటే.. మరోసారి ఢిల్లీలో అధికారానికి దూరం కావాల్సిందే
తాజా ఫలితాలతో హిందీబెల్ట్ లో కూడా కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఉందని అర్థమవుతోంది. గత రెండు సార్లు హిందీబెల్ట్ లో 90 శాతానికిపైగా ఫలితాలను బీజేపీ నేతలు సాధించారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అంత కంటే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణతో పాటు కర్ణాటక సహా గతంలో బీజేపీ సాధించిన సీట్లు మరింత పెరగనున్నాయి. యూపీలోనూ పరిస్థితి మారుతోంది. అక్కడ కాంగ్రెస్ అసలు రేసులో లేదు. ఎస్పీ బీఎస్పీ బలహీనం అవుతున్నాయి. ఎలా చూసినా ఈ సారి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
పదేళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం తర్వాత 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కిందట బీజేపీ వేవ్‌తో ఒక్కసారిగా నీరసపడిపోయింది. వరుసగా అన్ని చోట్లా అధికారం కోల్పోతూ వచ్చింది. నిన్నటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక మాత్రమే. ఇప్పుడు చత్తీస్ ఘడ్ , రాజస్థాన్ పోయాయి. తెలంగాణ మాత్ర ంకలిసింది. మిగతా అన్ని చోట్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీ హవానే కొనసాగుతోంది. . ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ పోటీ చేసినా చావోరేవో అని పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ముందు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్కు కలసి వచ్చేవేమీ కనిపించడం లేదు.
కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద సవాల్ … ఇండియా కూటమిని నిలుపుకోవడం.. కనీసం మూడు రాష్ట్రాల్లో గెలిచి ఉంటే… కాంగ్రెస్ కూటమి కి ఎదురు ఉండేది కాదు. కానీఇప్పుడు ఆ కూటమి కూడా బీజేపీ దెబ్బకు కకావికలం అవడం ఖాయంగా కనిపిస్తోంది.కేంద్రంలో రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈసారి ఆ దూకుడుకి కళ్లెం వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అందుకే NDAకి దీటుగా I.N.D.I.A పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. విపక్ష కూటమికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్న అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కన్వీనర్‌గా ఉంటారన్న వార్తలు అప్పట్లో బాగానే వచ్చాయి. కానీ…ఆ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పారు నితీశ్. నితీశ్ తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలకంగా వ్యవహరించారు. విపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నం తాను చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ విపక్ష కూటమిని లీడ్ చేయగలుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల స్ట్రాటెజీలు వేరు అని అంత సులువుగా కొట్టిపారేయలేం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా లోక్‌సభ ఎన్నికలపై ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌ని ఇరకాటంలోకి నెట్టింది. కాంగ్రెస్ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే కూటమిలో చీలికలు మొదలవుతాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీ సక్సెస్ కాదని, కాంగ్రెస్ వైఫల్యమే అని తేల్చి చెబుతున్నాయి కూటమి పార్టీలు.
బీజేపీని కాంగ్రెస్ ఢీకొట్టలేదని, ఆ భ్రమ నుంచి ఆ పార్టీ బయటకు రావాలని కొందరు విపక్ష నేతలు నేరుగానే చెబుతున్నారు. కూటమి వ్యూహాలను మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు. అసలు కూటమిలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డట్టూ సమాచారం. ఇందులో నిజమెంత అన్నది మాత్రం స్పష్టత లేదు. ముఖ్యంగా సీట్‌ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. మిగతా పార్టీలు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది. లేదా పూర్తిగా కూటమే కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ప్రతి పార్టీ తమ ఓటు బేస్‌ని వదులుకునేందుకు ఇష్టపడదు. ఆప్, టీఎమ్‌సీ సహా మరి కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువే. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో సీట్ షేరింగ్ విషయంలో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ విభేదాలు ఫైనల్‌గా బీజేపీకే ప్లస్ అవుతాయి. వాళ్లలో వాళ్లకే సఖ్యత లేదని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తోంది.
నాయకత్వ లోపమూ విపక్ష కూటమిని ఇబ్బందుల్లో పెడుతోంది. కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా ఈ విషయంలో సఖ్యత కుదరకపోవచ్చు కూడా. తమ ఓటు బ్యాంకునీ కాపాడుకోవడంలో నానా అవస్థలు పడుతోంది ఈ పార్టీ. ఇలాంటి సమయంలో సరైన నాయకత్వం లేకపోతే మరింత చతికిలబడి పోవడం ఖాయం. కానీ బీజేపీకి ఈ సమస్యలేదు. బలమైన నాయకత్వమే ఆ పార్టీని ముందుకు నడిపిస్తోంది. కూటమిలో చీలికలు వస్తాయని జోస్యం చెబుతున్నారు బీజేపీ నేతలు. అసలే సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా వరకూ మారిపోయేది. కానీ…తెలంగాణలో గెలిచామన్న సంతోషం తప్ప మరేమీ మిగల్లేదు. ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ ఓటమి బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. సీట్ల సంఖ్యని మరింత పెంచే అవకాశాలూ ఉన్నాయి. కాంగ్రెస్ భవిష్యత్‌ని నిర్ణయించనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి జోష్ ఇస్తాయనుకుంటే ఉన్న జోరునీ తగ్గించాయి. కాంగ్రెస్ కు సంక్షోభాలు కొత్త కాదులే కానీ… అదే పనిగా సంక్షోభాలు ఎదురవుతూంటే.. గెలవాల్సిన చోట్ల కూడా ఓడిపోతూంటే… మాత్రం ఆలోచించాల్సిందే. కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఎలా వస్తుందో .. వస్తుందో రాదో అంచనా వేయడం కష్టంగా మారింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…