కాంగ్రెస్ కూడా కాదంటే కామ్రేడ్ల పరిస్థితి ఏంటి?

By KTV Telugu On 31 August, 2023
image

KTV TELUGU :-

తెలంగాణాలో ఎన్నికల వాతావరణం వేడెక్కే కొద్ది కొత్త కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. కొత్త కొత్త పొత్తులు పొడుస్తాయంటూ ప్రచారాలూ జరుగుతున్నాయి. బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకోవాలని తహ తహ లాడి చివరి వరకు అది సాధ్యం కాకపోవడంతో నిరాశలో మునిగిపోయిన కమ్యూనిస్టులు కొంత గ్యాప్ ఇచ్చి కాంగ్రెస్ తో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రేతలు భేటీ అయినట్లు ప్రచారం జరిగింది.

బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ తమని మునుగోడు ఉప ఎన్నికల్లో వాడుకుని మోసం చేశారని అపుడు పొత్తులు ఉంటాయని చెప్పి ఇపుడు ఏకపక్షంగా అభ్యర్ధుల జాబితా ప్రకటించారని కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కమ్యూనిస్టు పార్టీల నేతలను పిలిపించుకున్న చర్చించారని ప్రచారం జరిగింది. ఈ భేటీలోనే కామ్రేడ్లు నాలుగు అసెంబ్లీ సీట్లు రెండు ఎమ్మెల్సీ సీట్లు అడిగినట్లు చెబుతున్నారు. కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్ నియోజక వర్గాలను కమ్యూనిస్టు పార్టీలు అడిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ భేటీలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కానీ లేరని అంటున్నారు. ఇదే ఇపుడు కాంగ్రెస్ లో పెద్ద రచ్చగా మారింది. కీలక నేతలిద్దరూ లేకుండా ఠాక్రే ఎలా డీల్స్ కుదుర్చుకుంటారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.

ఠాక్రే వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలు హై కమాండ్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. మరి హై కమాండ్ ఠాక్రేకు ఏమైనా క్లాస్ తీసుకుందా లేదా అన్నది తెలీదు కానీ హఠాత్తుగా ఠాక్రే మీడియా ప్రతినిథులతో మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలతో డీల్ కుదిరినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీలతో భేటీ జరగనుందని ఆ భేటీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత భట్టి విక్రమార్కల సమక్షంలోనే జరుగుతుందని వివరణ ఇచ్చుకునే ధోరణిలో అన్నారు

సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు సహజంగానే ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీట్లు అడుగుతాయి. ప్రస్తుతం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందనేది టి కాంగ్రెస్ నేతల వాదన. రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని వారికి సీట్లు కేటాయిస్తే ఆ నియోజక వర్గాల్లోని కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసినట్లు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన రోజునే వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో మొత్తం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించి తీరతానని ప్రతిజ్ఞ చేశారు.

ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే కానీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుచుకునే పరిస్థితిలో కమ్యూనిస్టు పార్టీలు లేవు. అందుకే కామ్రేడ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు .కేవలం కొన్ని సీట్లకోసం ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని పెట్టుకని కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలుగా మిగిలిపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందంటున్నారు వామపక్ష మేథావులు. ఓట్లు సీట్ల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల్లో ఉంటేనే కమ్యూనిస్టు పార్టీలకు పూర్వవైభవం వస్తుందని వారంటున్నారు.

ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు కమ్యూనిస్టులతోనే కాదుఎవరితోనూ పొత్తులు అవసరమే లేదని పట్టుబడితే మాత్రం ఎన్నికల్లో సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే బి.ఆర్.ఎస్. తో పొత్తు కోసం ప్రయత్నాలు చేసి భంగపడి ఉన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కూడా డీల్ ఓకే కాకపోతే ప్లాన్ సీని ఆశ్రయించాలి. చేస్తే రెండు కమ్యూనిస్టు పార్టీలూ కలిసి జట్టుకట్టి బరిలో దిగడం..లేదంటే ప్రొఫెసర్ కోదండరాం పార్టీని కూడా కలుపుకుని ఓట్లు చీలిపోకుండా చూసుకోవడం చేయాలి. అయితే కామ్రేడ్లు ఏం ఆలోచిస్తున్నారన్నది ముఖ్యం అంటున్నారు రాజకీయ పండితులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి