ఢిల్లీ లిక్కర్ స్కాంలో వాట్ నెక్ట్స్? కర్ణాటక ఫలితమే తేల్చనుందా

By KTV Telugu On 11 May, 2023
image

 

దేశ రాజకీయాలను ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందని భావిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కాస్త పాజ్ వచ్చింది. కల్వకుంట్ల కవిత కాలికి గాయం కావడంతో దాదాపుగా నెల రోజులుకుపైగా బయట కనిపించలేదు. తాజాగా ఆమె గాయం నుంచి కోలుకుని కొండగట్టుకు వెళ్లి హనుమాన్ చాలీసా పాటించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. సాధారణంగా కవిత బయట కనిపిస్తే అందరికీ గుర్తు వచ్చేది ఢిల్లీ లిక్కర్ స్కామే. ఎందుకంటే ఈ నెల రోజుల్లోనే హవాలా కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కవితకు డబ్బులు ఇచ్చినట్లుగా వాట్సాప్ చాట్స్ బయట పెట్టారు. అలాగే ఈడీ కూడా కవిత ఎంత డబ్బులు ఢిల్లీ లిక్కర్ స్కాం చేసి సంపాదించారో వాడితో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో కూడా కోర్టుకు అభియోగపత్రంలో తెలిపింది. ఈ రెండూ అత్యంత కీలకమైన సాక్ష్యాలు అనుకోవచ్చు. మరి ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు తర్వాత ఏం చేయబోతున్నాయి. ఈ కేసులో రాజకీయ ప్రమేయాన్ని ఏ మాత్రం కొట్టి పారేయలేం. అధికారంలో ఉన్న పార్టీల సూచనలు, సలహాల మేరకే దర్యాప్తు జరుగతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి వారి వ్యూహం ఎలా ఉంది. కర్ణాటక ఫలితాలను బట్టి ముందుకు వెళ్తారా. బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే ఏం జరుగుతుంది. రాకపోతే ఏం జరుగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంతో అసలు కవితకేం సంబంధం అని ఆమె తరపు లాయర్లు వాదిస్తున్నారు. కానీ ఈడీ కవిత ఆర్థిక లావాదేవీలను మొత్తం కోర్టు ముందు పెట్టారు. లిక్కర్​ వ్యాపారంలో వచ్చిన లాభాలతో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ద్వారా హైదరాబాద్​లో ఆమె భూములను కొన్నారని డాక్యుమెంట్లు కూడా చూపించింది. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మార్కెట్​ రేట్​ కన్నా తక్కువ ధరకు ఆ భూములను కవిత దక్కించుకున్నారని ఈడీ పేర్కొంది. ముడుపుల చెల్లింపుల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. కవిత భర్త అనిల్ పేరు కూడా తొలిసారి చార్జిషీట్‌లో లో ప్రస్తావించింది. అనిల్ భాగస్వామిగా ఉన్న ఎన్​గ్రోత్​ క్యాపిటల్​ సంస్థకు భూముల కొనుగోళ్లలో ప్రమేయం ఉందని వెల్లడించింది. 2021 ఏప్రిల్ లో కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై ఢిల్లీలోని ఒబెరాయ్ మైడెన్స్ హోటల్ లో ఆప్ నేత విజయ్ నాయర్ తో సమావేశమయ్యారని, చెల్లించాల్సిన ముడపులు, వాటిని రికవరీ చేయాల్సిన తీరుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారని వివరించింది. ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కామ్​ సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లు ఆధారాలను కోర్టుకు ఈడీ అధికారులు అందజేశారు. లిక్కర్ స్కామ్​లో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత రోల్ ను 247 పేజీల థర్డ్ సప్లమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేశారు. హవాలా రూపంలో డబ్బు మళ్లింపులో అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి కీలకంగా వ్యవహరించారని బినామీ బ్యాచ్‌ను బుచ్చిబాబు రోల్​ పోషించారని చార్జ్​షీట్లలో ఈడీ వివరించింది. డబ్బులు ఎలా రూటింగ్ జరిగాయో కూడా వివరించింది. అదే సమయంలో సుఖేష్ చంద్రశేఖర్ కూడా కొన్ని వాట్సాప్ చాట్‌లను బయట పెట్టారు. ఇదంతా ఇంటర్ లింక్ గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై ఆధారాలను ప్రజల ముందు పెట్టడం అనుకోవచ్చు.

సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్‌లను బయట పెట్టినప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత తనపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చేస్తూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై మాత్రం స్పందించలేదు. అయితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ ప్రత్యేక సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు సుప్రీంకోర్టు ట్యాగ్‌ చేసింది. కవిత తన పిటిషన్‌లో మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారణకు వచ్చేలా చేయడానికి ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అందర్నీ ఈడీ, సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు కేసులు పెట్టారు. నెలల తరబడి నిందితులు జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా పదవి కూడా పోగొట్టుకున్నారు. ఎన్నో సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయింది. గత నవంబర్ లో అరెస్ట్ చేసిన ఇద్దరికి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత అరబిందో శరత్ చంద్రారెడ్డికి ఆయన భార్య అనారోగ్యం కారణంగా బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో మాగుంట రాఘవకు బెయిల్ తిరస్కరించారు. కానీ కవితను మాత్రం అరెస్ట్ చేయలేదు. గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి నాలుగు సార్లు ప్రశ్నించారు. ఆమె కు చెందిన పది ఫోన్లను తీసుకున్నారు. తర్వాత మళ్లీ పిలుస్తామని నోటీసులు ఇచ్చారు కానీ పిలువలేదు. అందర్నీ అరెస్ట్ చేసి కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ లోపు నెల రోజులపాటు కాలికి గాయం కారణంగా కవిత బయటకు రాలేదు. ఇప్పుడు ఆమె మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

కారణం ఏదైనా కేసీఆర్ బీజేపీపై దాడిని తగ్గించారు. అందర్నీ కలుపుకుని బీజేపీని ఓడిస్తానని పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఎవర్నీ కలవడం లేదు. ఆయనా బయటకు రావడం లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టడం లేదు. తాత్కలిక ఆఫీసు ప్రారంభోత్సవం కోసం కలిసి వచ్చే నేతల్ని పిలిచినా ఇప్పుడు మాత్రం పెద్దగా ఎవర్నీ పిలవ లేదు. ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. బీజేపీని రెచ్చగొట్టడం ఇష్టం లేకనే ఆయన జాతీయ రాజకీయాలపై సైలెంట్ అయ్యారని ఇదంతా కవితను కాపాడుకునే వ్యూహమేనన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు నిజాయితీగా ఉన్నాయని అనుకోలేం. రాజకీయ పరిణామాలను బట్టి వారి చర్యలు ఉంటున్నాయి. బీజేపీకి ఎలా అవసరం అయితే అలా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఫలితాలను బట్టి ఈడీ దూకుడుగా ఉంటుందా లేకపోతే కేసీఆర్ పంపుతున్న రాజీ సిగ్నల్స్ ను అందుకోవాలా అన్నది బీజేపీ డిసైడ్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. అయితే ఇక్కడ బీజేపీ కేసీఆర్ తో ఏ మాత్రం రాజీ పడినట్లుగా కనిపించినా అది తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఎందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తదుపరి పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని అనుకోవచ్చు.