కేజ్రీవాల్ విడుదలకు ఎన్ని రోజులు పడుతుంది..? – When Kejriwal Release

By KTV Telugu On 22 March, 2024
image

KTV TELUGU :-

ఓ  తంతు ముగిసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు  అరెస్టు చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన తర్వాత  వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి  వెళ్లిన అధికారులు  కాసేపు ఆయన్ను ప్రశ్నించి అరెస్టును ప్రకటించారు. ఈడీ కార్యాలయానికి తరలించడం, కోర్టులో హాజరు పరచడం మరో తంతు. కేజ్రీవాల్ కు వెంటనే బెయిల్ వస్తుందా. అలా జరిగేందుకు ఎన్ని రోజులు పడుతుందన్నది ఇప్పుడు  అందరి  మదిలో మెదులుతున్న ప్రశ్న .

గత వారం కల్వకుంట్ల కవిత అరెస్టుతో కేజ్రీవాల్ విషయంలో కూడా ఈడీ చాలా వేగంగా కదులుతుందని అర్థమైంది. కవితతో పాటు సౌత్ గ్రూపులోని కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో  కీలక భూమిక వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ గ్రూపులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముడుపులు  పుచ్చుకుని లిక్కర్ పాలసీని సౌత్ గ్రూపుకు అనుకూలంగా మార్చారు.  కవిత నుంచి ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు అందినట్లు కూడా ఈడీ, సీబీఐ  గుర్తించాయి. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను, కేజ్రీవాల్ ను  ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.అప్పుడు మరిన్ని కీలకాంశాలు వెల్లడవుతాయని ఎదురు చూస్తున్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలం మేరకు ఈడీ తమపై కేసులు పెడుతోందని ఆప్ ఆరోపిస్తోంది. అయితే అవి నిరాధారమైన ఆరోపణలని  కూడా తేలిపోయింది. ఎందుకంటే పూర్తి  సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే దర్యాప్తు సంస్థ సమన్ల జారీ చేసింది. విచారణకు రాకపోవడంతో అరెస్టులకు తెరతీసింది. మొత్తం తొమ్మిది సార్లు కేజ్రీవాల్ … ఈడీ సమన్లకు స్పందించలేదు.

జైలు నుంచి  కేజ్రీవాల్ ఢిల్లీ పాలన సాగిస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అది ఎంతవరకు సాధ్యమనేది కీలకాంశమే అవుతుంది. అయితే అంతకు మించి మరో వ్యవహారమూ ఉంది. చాలా  మందికి బెయిల్ వచ్చినా ఇంతవరకు మనీష్ సిసోడియాకు రాలేదు. ఆయన జైల్లోనే ఉన్నారు.మరి కేజ్రివాల్, కవిత పరిస్థితేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న…

ఈడీ వరుస ఛార్జ్ షీట్లలో అనేక అంశాలను ప్రస్తావించింది. ఫేస్ టైమ్ సంప్రదింపుల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా వాటిలో పొందు పరిచింది. ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇంఛార్జ్ అయిన విజయ్ నాయర్.. లంచాల  పంపిణీలో సౌత్ గ్రూపుకు, ఢిల్లీ బ్యాచ్ కు మధ్యవర్తిగా వ్యవహరించారు. క్విడ్ ప్రోకో లావాదేవీలకు వీలు కలిగే విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. కవితకు, సౌత్ గ్రూపుకు ప్రయోజనం కలిగించే విధంగా  లిక్కర్ పాలసీని రూపొందిస్తే  100 కోట్ల చెల్లించేందుకు అంగీకరించినట్లు అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన  వాగ్మూలం కేజ్రీవాల్ ను,కవితను ఫిక్స్ చేసేసింది.మనీష్ సిసోడియా ఇంతకాలం జైలులో ఉండటానికి కూడా కారణం అదే కావచ్చు. కేసులో అప్రూవర్లుగా మారిపోతున్న వారికి వెంటనే బెయిల్ వస్తోంది. అనారోగ్య కారణాలతో కొందరు బెయిల్ పొందగలుగుతున్నారు. సిసోడియా గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయినప్పటి నుంచి అనేక పర్యాయాలు బెయిల్ పిటిషన్లు వేశారు. వరుసగా కోర్టులు వాటిని కొట్టేస్తూ  వచ్చాయి. ఇప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు. అప్రూవర్ గా మారేందుకు కూడా అంగీకరించకపోవడంతో ఆయనకు   బెయిల్ రావడం  లేదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, కవితల అరెస్టు జరిగింది. సిసోడియా  కేసును ప్రామాణికంగా తీసుకుంటే.. కేజ్రీవాల్, కవితకు బెయిల్ రావడం ఇప్పట్లో కుదరదని, కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు…

దర్యాప్తు సంస్థల ముంచుకు వస్తున్నాయి. వరుస  ఛార్జ్ షీట్లు వేస్తున్నాయి. ఈడీ  స్పీడు మీదున్న నేపథ్యంలో వరుస అరెస్టులు  జరుగుతున్నాయి. ఇంకా సీబీఐ కేసుకు సంబంధించి వేగం పుంజుకోలేదు. అంటే మరో దఫా అరెస్టుల ప్రక్రియ ఉండొచ్చు. కేజ్రీవాల్ కు కష్టకాలం తప్పదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి