తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకటనల విషయంలో చేతికి ఎముక ఉండదన్నట్లుగా హామీలు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన ఎవర్నీ నిరాశపరచరు. రూ. కోట్లకు కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. నిన్నటికి నిన్న కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరో రూ.7 కోట్లు ప్రకటించారు. తర్వాత జరిగిన సభలో బాన్సువాడ నియోజకవర్గానికి రూ. యాభై కోట్లు ప్రకటించారు. దీంతో అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఇలాంటి ప్రకటనలు ఆయన దత్తత గ్రామాల దగ్గర నుంచి మొన్న మునుగోడు వరకూ ఎన్నో చూశామని కానీ నిజంగా నిధులు ఇచ్చిన సందర్భాలే లేవని పెదవి విరిచే వారే ఎక్కువ. అందుకే కేసీఆర్ చేసే ఇలాంటి రూ. కోట్ల ప్రకటనలపై ఎవరికీ నమ్మకం లేకుండా పోతుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లే రోడ్డును విస్తరింప చేసుకోవడానికి అదో ప్లాన్ అని విపక్షాలు విమర్శలు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకుని తమకు ఇక మహర్దశ పుతుందని నమ్మారు. కొన్నాళ్ల క్రితం అధికారిక పర్యటన నిమిత్తం వరంగల్ వెళ్లి వస్తూ హఠాత్తగా వాసాల మర్రి గ్రామంలో ఆగారు. సర్పంచ్‌ను పిలిచి మాట్లాడి వంద కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. చాలా రోజులతర్వాత మళ్లీ వాసాల మర్రికి కేసీఆర్ వెళ్లారు. అందరికీ భోజనాలు పెట్టారు. ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చారు. దత్తత తీసుకున్న 10 నెలల తర్వాత 2021 ఆగస్టులో అందరికీ కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 17 నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ. 20 లక్షలతో కొత్తగా నిర్మించాలని భావించిన వాసాలమర్రి పంచాయతీ బిల్డింగ్ కూడా ఆగిపోయింది. కొంత మందికి దళిత బంధు ఇచ్చారు. మిగతా వారు ఎదురు చూస్తున్నారు. అక్కడ జనం సీఎం సారు చెప్పిన డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తాయని తేలిన తర్వాత హాలియాలో బహిరంగసభ పెట్టారు. ఆ సభలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 800కిపైగా పంచాయతీలు ఉన్నాయని లెక్క చెప్పిన సీఎం ప్రతి గ్రామపంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తర్వాత మండల కేంద్రాలకు రూ. 30 లక్షలు నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.10 కోట్లు మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 5 కోట్లు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం రూ.186 కోట్లు ప్రకటించారు. రూ. 2,500 కోట్లతో లిఫ్ట్ స్కీం మంజూరు చేస్తున్నామని లిఫ్ట్‌లు పూర్తి చేసి అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సవాల్ చేశారు. వీటిలో ఒక్క రూపాయి ఆ జిల్లాకు ఇచ్చి ఉన్నా బీఆర్ఎస్ నేతలు పబ్లిసిటీ హోరెత్తించి ఉండేవారు. కానీ పంచాయతీ నిధులే చెప్పకుండా తీసుకున్నారని సర్పంచ్‌లు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి.
ఉత్తమ్ రెడ్డి కంచుకోట అయిన హుజూర్ నగర్ లో గెలిచిన తర్వాత అక్కడ బహిరంగసభ పెట్టిన కేసీఆర్ రోడ్ల దగ్గర్నుంచి కోర్టు వరకూ అన్ని వరాలను ప్రకటించేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీకి సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ. 20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో మండల కేంద్రానికి రూ. 30 లక్షలు హుజూర్‌నగర్‌లో రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కేసీఆర్ ఇలా ప్రతీ ఊరికి నగదు సాయం ప్రకటించారు. అయితే వీటిలో ఎన్ని విడుదల చేస్తున్నారో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
కేసీఆర్ సొంత గ్రామం చింతమడకను బంగారు తునక చేస్తానని చాలా ఏళ్ల క్రితం ప్రకటించారు. చింతమడకలో ప్రతి ఇంటికి రూ.10 లక్షల చొప్పున సాయం అందేలా పథకం రూపొందిస్తామని. దాని కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తానని ఆ గ్రామంలో పర్యటించినప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరి నాటు యంత్రాలకు బాగా గిరాకీ ఉంటుందన్నారు. ట్రాక్టర్లు కోళ్ల ఫారాలు వ్యవసాయ పరికరాలు ఏవైనా కొనుక్కోండని సలహా ఇచ్చారు. చింతమడక గ్రామానికి 1500 నుంచి 2 వేల ఇళ్లు మంజూరు చేసి ఆరు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలని కార్తీక మాసంలో గృహప్రవేశాలు ఉంటాయని ప్రకటించేశారు. చింతమడక గ్రామానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. ఇప్పటికిప్పుడు చింతమడక అభివృద్ధి కోసం కలెక్టర్ నిధికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు కానీ చెప్పింది కొండంత జరిగింది గోరంత అని ఆ గ్రామస్తులే అనుకోవాల్సిన పరిస్థితి ఉందన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.
కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని రూ. వంద కోట్లు ప్రకటించి సీఎం కేసీఆర్ వాటిపై సమీక్షించడానికి కొండగట్టు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని సమీక్ష చేశారు. ఈ సమావేశంలో హఠాత్తుగా మరో ఐదు వందల కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది. ఇస్తారా ఇస్తే ఎప్పుడిస్తారు అన్నది వేచి చూస్తూ ఉండాలి. ఇలాంటి ప్రకటనలు కేసీఆర్ ఏ జిల్లాలో బహిరంగసభలు పెట్టినా ప్రకటిస్తూ ఉంటారు. కానీ అవన్నీ అందుతున్నాయని దానికి తగ్గట్లుగా అభివృద్ధి పనులు చేశామని ఒక్క సారి కూడా చెప్పలేదు. కేసీఆర్ మాటలతో మాయ చేస్తారు. అప్పటికప్పుడు ఆయన మాటలు వినీ అందరూ సంతోషపడతారు. అవి నిజంఅయితే మాత్రం అద్భుతమే అనుకోవాలి. కానీ అలా అయ్యేది చాలా తక్కువ అనేదే ఎక్కువ మంది కంప్లైంట్.