అక్కడ ఓట్ల జాతర జరుగుతోంది. ఓటర్లకు పసిడి పండుతోంది. జనం మీద నోట్ల వర్షం కురుస్తోంది. ఖద్దరు చొక్కాకు లక్షలు పలుకుతోంది. ప్రత్యర్థి పార్టీల్లోని ప్రజా ప్రతినిధుల ధర పాతిక లక్షలు పలుకుతోంది. సొంత పార్టీలోని అసమ్మతి నేతలు కొనసాగాలంటే అరకోటి ఇవ్వాల్సి వస్తోంది. మొత్తంగా ఆ నియోజకవర్గంలో కరెన్సీకి విలువ లేకుండా పోతోంది. అక్కడ ఓట్ల జాతర కంటే నోట్ల జాతర జరుగుతోందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండి…ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న చెన్నూరు అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, ప్రలోభాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బరిలో నిలిచారు. ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న వివేక్..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి రాజకీయాల్లో తత్తరపాటు ప్రదర్శిస్తున్నారు. సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి తొలిసారి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించగానే మళ్ళీ హస్తం గూటికి వెళ్ళారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో..కొన్నాళ్ళ తర్వాత తిరిగి గులాబీ గూటికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కమలం పార్టీలో చేరారు. ఇటీవలే హఠాత్తుగా మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని చెన్నూరు టిక్కెట్ సాధించుకున్నారు వివేక్ వెంకటస్వామి.వివేక్ బరిలో దిగగానే చెన్నూరు ఎన్నికల రూపు ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు బాల్క సుమన్..మరోవైపు వివేక్ విజయం కోసం తీవ్రాతితీవ్రంగా పోరాడుతున్నారు. ఆరు నూరైనా విజయం సాధించాలని ఇద్దరూ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. మొత్తంగా ప్రచారం ఒక జాతరలా మారిపోయింది. భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అట్టహసంగా సభలు నిర్వహిస్తున్నారు. ర్యాలీల్లో బతుకమ్మలు, ఒగ్గు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భారీగా నిర్వహిస్తున్నారు.
బతుకమ్మతో వచ్చిన వారికి పదిహేను వందలు, ర్యాలీకి వచ్చిన వాళ్లకు వెయ్యి రుపాయల చొప్పున చెల్లిస్తున్నారు. అదనంగా బిర్యానీ పెడుతున్నారు. రెండు పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీలు పడి ఖర్చు చేస్తున్నారు.నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తల పార్టీల మార్పిళ్ళు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పార్టీలు మారుతున్న వారికి భారీగా చెల్లింపులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వంద మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే నాయకునికి ఐదు లక్షలు, స్థానిక ప్రజాప్రతినిధికి ఇరవై లక్షలు, మండల స్థాయి నాయకునికైతే కోటి రుపాయలు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రత్యర్థి పార్టీలు భారీ ఆఫర్లు ఇవ్వడంతో కొందరు ప్రజాప్రతినిదులు, నాయకులు రాత్రికి రాత్రే కండువాలు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ర్యాలీలు నిర్వహించడమే కాదు.. నాయకులను చేర్చుకోవడమే కాదు..ఓటర్ల కోసం భారీగా నోట్ల వర్షం కురిపించడానికి సైతం అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఎదుటిపక్షంవారు ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ అభ్యర్థులు బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సుమన్ ల్యాండ్, శ్యాండ్ కబ్జాలతో వేల కోట్లు సంపాదించారని..అక్రమార్జనతో ఓటుకు వేల రూపాయలు చెల్లిస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఆరోపిస్తున్నారు.
సుమన్ ఎన్ని వేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండని ప్రజలకు పిలుపునిస్తున్నారు వివేక్. వివేక్ ఆరోపణలకు సుమన్ కూడా ధీటుగా బదులిస్తున్నారు. వివేక్ కుటుంబం అక్రమంగా వేల కోట్లు సంపాదించిదని… ఓట్ల కోసం బంగారంతో చేసిన లక్ష్మీ బొమ్మలు పంచుతారని..అవి తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరుతున్నారు.మొత్తానికి చెన్నూరు నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు ఓ ప్రత్యేక కళను తీసుకొచ్చాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మరి ఓటర్లు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…