కాంగ్రెస్, బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఎవరు?

By KTV Telugu On 27 January, 2023
image

తెలంగాణ పార్టీల్లో కోవర్టు రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్ సీనియర్లంతా తమను కోవర్టులుగా ముద్రవేశారని రేవంత్‌రెడ్డిపై ఎగురుతూ తిరుగుబాటు చేశారు. అది పార్టీలో పెను ప్రకంపనలే సృష్టించింది. రాష్ట్ర ఇంచార్జ్‌ను మార్చి మరొకరి బాధ్యతలు అప్పగించే వరకు వెళ్లింది. కొత్తగా వచ్చిన ఇంఛార్జ్‌ అందరినీ కలుపుకొని పోయేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతవరకు అందరూ ఏకతాటిపైకి వస్తారో తెలియదు గానీ అసంతృప్తి మాత్రం ఇంకా చల్లారలేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న ఈటల రాజేందర్ నోట కోవర్టు మాట వచ్చింది. అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులున్నారంటూ తూటా వదిలారు. వారే పార్టీలో జరిగే విషయాలను కేసీఆర్‌కు లీకులిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ప్రతిపక్షాల్లో కేసీఆర్ ఇన్‌ఫార్మర్లు ఉన్నారని వారు బీఆర్ఎస్‌కు సాయం చేస్తూ ఉన్న పార్టీల్లో గొడవలు సృష్టిస్తారంటూ ఈటల బాంబ్ పేల్చారు. అయితే వారి పేర్లు మాత్రం బయటపెట్టలేదు. కాంగ్రెస్, బీజేపీలో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ కథనాలను ప్రచారం చేయిస్తారని చివరికి ఈ పార్టీలకంటే కేసీఆరే మేలని ప్రజలు అనుకునేలా వారు ప్రచారం చేస్తారని ఈటల తెలిపారు. 2018లో తనతో పాటు 20మందిని ఓడగొట్టేందుకు కేసీఆర్ స్కెచ్ వేశాడంటూ ఈటల మరో సంచలన కామెంట్ చేశారు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులే టీ కప్పులు అందించారని కొందరు పోలీసు అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా మారారని ఈటల వ్యాఖ్యానించారు. బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల పలువురిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నా ఎవరూ చేరడం లేదు. అయితే బీజేపీలోని కొందరు పార్టీ విషయాలను కేసీఆర్‌కు చేరవేస్తున్నారనే అనుమానంతో ఈటల ఉన్నారట.

ఈటల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పిందే ఈటల చెబుతున్నారనే కామెంట్ చేశారు. బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులున్నారనే విషయం ఈటలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. రేవంత్‌ కూడా తమ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఎప్పట్నుంచో భావిస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టగానే కోవర్టులను ఏరిపారేస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే రేవంత్‌ తమను కోవర్టులుగా ముద్రవేస్తున్నారంటూ సీనియర్లు చేసిన రచ్చ ఎంత దూరం వెళ్లిందో చెప్పక్కర్లేదు. సునీల్ కనుగోలు ఆఫీసులో రేవంత్ తమపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని అసంతృప్త నేతలు అసమ్మతి గళం వినిపించారు. దాంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. సీనియర్ నేతలు వర్సెస్ వలస నేతలుగా మారిపోయారు. ఆ గొడవ ఇంకా సద్దుమణగలేదు.

అయితే రేవంత్ ఆ ప్రస్తావన తీసుకురానప్పటికీ కోవర్టుల గురించి తాము ముందు నుంచి చెబుతున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఆ రెండు పార్టీలను టార్గెట్ చేశారు. ఈటల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటివారు బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ విష ప్రయోగంలో ఈటల కూడా పాత్రధారి అవుతున్నాడని ఈటల బీజేపీలో ఈమడలేకపోతున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందరే కేసీఆర్ కోవర్టు అని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఆరోపిస్తోంది. కేసీఆర్‌పై పోరాటం చేస్తానని చెబుతున్న ఈటల చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉంటూ బీఆర్ఎస్‌ నేతలపై ఫోకస్ చేయకుండా కాంగ్రెస్‌ వాళ్లను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అది ఎంతవరకు నిజమో గానీ తెలంగాణలో కోవర్టు పాలిటిక్స్‌ కొందరికి నిద్రలేకుండా చేస్తుందనేది మాత్రం అర్థమవుతోంది.