ఎన్నికల్లో తమ ప్రత్యర్ధి ఎవరన్న దానిపైనే అభ్యర్ధులు దృష్టి సారిస్తారు. తమపై పోటీ చేసే అభ్యర్ధిని బట్టి దానికి అనుగుణంగా వ్యూహాలు రచించుకుంటారు. రాజకీయ పార్టీలు ఈ విషయంలో రక రకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి.తమ ప్రత్యర్ధి తమపై పోటీ చేయడానికే భయపడుతున్నాడన్న ప్రచారం చేయాలని చూస్తారు. అదే సమయంలో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ ధీమాని చూసి ప్రత్యర్ధుల సైకాలజీ మారిపోతుందన్నది వారి ఆలోచనగా చెబుతూ ఉంటారు. తెలంగాణా ఎన్నికల్లోనూ ఇటువంటి ఘట్టాలు దర్శనమిస్తున్నాయి. ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారో సామాన్య ప్రజలకు అర్ధం కాకుండా పార్టీలు అయోమయం సృష్టిస్తున్నాయి.
ఉమ్మడి నిజామా బాద్ జిల్లా కామారెడ్డి నియోజక వర్గం అనగానే గుర్తుకు వచ్చే పేరు మహమ్మద్ షబ్బీర్ అలీ.కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వ్వవహరించిన షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి రెండు సార్లు విజయం సాధించారు. మొదటి సారి 1989 లో గెలిచిన షబ్బీర్ అలీ ఆ తర్వాత 1994 ఎన్నికల్లో షబ్బీర్ అలీ ఓడిపోయారు. తిరిగి వై.ఎస్.ఆర్. ప్రభంజనంలో 2004లో విజయం సాధించిన షబ్బీర్ ఆ తర్వాత మళ్లీ ఏ ఎన్నికలోనూ గెలవలేదు. 2009 నుంచి 2018 ఎన్నికల వరకు ఈ నియోజక వర్గం నుంచి గంప గోవర్ధన్ గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో షబ్బీర్ అలీ కామారెడ్డి నుండి బరిలో దిగబోతున్నారు.
అయితే పార్టీలో చాలా సీనియర్ అయిన షబ్బీర్ అలీ పేరు కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది. దాంతో రక రకాల వదంతులు షికార్లు చేస్తున్నాయి.కామారెడ్డి నుండి పోటీ చేయడానికి షబ్బీర్ అలీ ఆసక్తి చూపకపోవడం వల్లనే మొదటి జాబితాలో ఆయన పేరు లేదన్న ప్రచారం జరుగుతోంది. ఆసక్తి లేకపోవడానికి కారణం కామారెడ్డి నుండి ఈ సారి బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ బరిలో ఉండాలని నిర్ణయించుకోవడమే అని కూడా పుకార్లు పుట్టాయి. కేసీయార్ ను ఎదుర్కోలేకనే షబ్బీర్ అలీ కామారెడ్డి నుండి పోటీ చేయకూడదని అనుకున్నారని..ఆయన దానికి బదులుగా ఎల్లారెడ్డి లేదా నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.
ఇంత వరకు మౌనంగా ఉన్న షబ్బీర్ అలీ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను కామారెడ్డి నుండే పోటీ చేస్తున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీ హిల్స్ నియోజక వర్గాల్లో ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేయబోతున్నట్లు బి.ఆర్.ఎస్. నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీయార్ ను తాను సాదరంగా కామారెడ్డికి ఆహ్వానిస్తున్నానని ..ఎవరి బలం ఏంటో తేల్చుకుందాం ఇద్దరూ పోటీ చేద్దాం అని ఆయన సవాల్ విసిరారు. కామారెడ్డి ప్రజలు ఎవరిని నమ్ముతారే ఎన్నికలే తేలుస్తుఆయని షబ్బీర్ ఛాలెంజ్ చేశారు. తాను పుట్టింది కామారెడ్డిలోనే అన్న షబ్బీర్ తాను చనిపోయే వరకు కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని అన్నారు. పోటీ చేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానన్నారు.
ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అసలు కేసీయార్ కామారెడ్డి నుండి ఎందుకు పోటీ చేయబోతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది. కేసీయార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వెల్ నియోజక వర్గంలో ఈ సారి కేసీయార్ పై బిజెపి నేత ఈటల రాజేందర్ పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈటల రాజేందర్ పోటీ చేస్తే తన విజయావకాశాలపై ప్రభావం పడుతుందన్న భయంతోనే కేసీయార్ మరో నియోజక వర్గాన్ని వెతుక్కునే పనిలో పడ్డారని..అప్పుడే కామారెడ్డిని ఎంచుకున్నారని బిజెపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈటల రాజేందర్ కు భయపడి కామారెడ్డి పారిపోతోన్న కేసీయార్ … తనకు భయపడి షబ్బీర్ అలీ మరో నియోజక వర్గానికి పారిపోతున్నారని ప్రచారం చేయిస్తున్నట్లుందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
గజ్వెల్ లో కేసీయార్ కు ఈటల గండం.. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి కేసీయార్ గండం ఉన్నట్లు వారి ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇవి ఎన్నికల వ్యూహంలో భాగమేని వారు అంటున్నారు. ప్రత్యర్ధి శిబిరాల్లో కలకలం సృష్టించడం తాము బలంగా ఉన్నట్లు బిల్డప్పులు ఇచ్చుకోవడం యుద్ధ వ్యూహాల్లో కీలకమే అంటున్నారు వారు. విషయం ఏంటంటే ఇక్కడ గజ్వెల్ లో తన విజయం అంత ఈజీ కాదని కేసీయార్ కు.. కామారెడ్డిలో తనకేమైనా తేడా జరుగుతుందని షబ్బీర్అలీకి లోలోన ఆందోళన ఉండే ఉండచ్చని వారు అంటున్నారు. అంతే కాదు అటు ఈటల రాజేందర్ కూడా గజ్వెల్ లో తన ప్రభావం చూపలేకపోతే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనని కంగారు పడుతున్నారని అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…