లీడర్‌ని తేల్చుకోలేరా ?

By KTV Telugu On 8 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ బీజేపీ ఎల్పీ నేత ఎవరు ? . గెలిచింది ఎనిమిది మంది. వారిలో తమ నేత ఎవరో తేల్చుకోలేకపోతున్నారు బీజేపీ నేతలు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. స్వయంగా  అమిత్ షా  లీడర్ ను నియమించడానికి వచ్చినా.. ఆ పని చేయలేక వెళ్లిపోయారు.  కొత్త  ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రెండో సారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. కానీ బీజేఎల్పీ లీడర్‌ను నియమిస్తారా లేదా అన్న దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.

తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఏర్పడి  రెండు నెలలు కావొస్తోంది. బీజేపీ ఇంతవరకు ఫ్లోర్ లీడర్ ఎవరన్నది ప్రకటించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు రెండు నెలలు పూర్తయింది.  అసెంబ్లీలో పార్టీ తరఫున గళం వినిపించేందుకు ఫ్లోర్ లీడర్ అవసరం. అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్లను ప్రకటించినా.. బీజేపీ మాత్రం ఎవరో చెప్పలేదు.   ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. వీరిలో నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి, గోషామహల్ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది.   గత అసెంబ్లీ సెషన్ లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున ఎక్కువ సేపు మాట్లాడారు. దీంతో ఆయనకు బీజేఎల్పీ లీడర్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరిగింది.  కానీ బీసీ అంశం కొత్తగా తెరపైకి వచ్చింది.

గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రమే బీసీలు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ సామాజికవర్గానికి చెందిన వారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు.ఆ సమయంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. బీజేపీ నేతలు మిగతా పార్టీలకు సవాలు విసిరారు. దమ్ముంటే బీసీని సీఎం చేస్తామని ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించడంతో ఫ్లోర్ లీడర్ ఎవరన్న చర్చ మొదలైంది.   ఇప్పుడు శాసనసభాపక్ష నేతను కూడా చేయకపోతే దానికి విలువ ఉండదనుకుంటున్నారు.

రాజకీయ అనుభవం ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సామాజిక వర్గానికే కట్టబెట్టినట్లవుతుందనే చర్చ ఉంది. పైగా ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.

బీసీకి ఇవ్వాలని భావిస్తే పాయల్ శంకర్, రాజాసింగ్ రేసులో ఉంటారు. వారిలో రాజాసింగ్ కు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా.. తెలుగు భాష మీద పట్టులేకపోవడం, అసెంబ్లీ రూల్స్ పై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, స్థానిక అంశాలపై గణాంకాలతో సుదీర్ఘంగా ప్రసంగించలేరనేవి ప్రతిబంధకాలుగా మారనున్నాయి. పైగా ఆయన వివాదాస్పద వ్యక్తి. ఎక్స్‌ట్రీమ్ హిందూత్వ ఇమేజ్ ను బీజేపీ కూడా భరించలేకపోతోంది. తప్పని సరి పరిస్థితుల్లో సస్పెన్షన్ ఎత్తి వేసి టిక్కెట్ ఇచ్చారు కానీ అంత కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదు.  దీనికి తోడు రాజధానిలో మూడో పవర్  పాయింట్ వస్తుందనే గుబులు కమలం పెద్దలకు పట్టుకుందని సమాచారం దీంతో ఆయనకు చెక్ పెడతారనే ప్రచారం ఉంది. ఆదిలాబాద్ కు చెందిన పాయల్ శంకర్ కు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు. అయితే పార్టీ  కోసం అంకిత భావంతో పనిచేశారనే చర్చ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది.

కానీ పార్టీలో ఎ వర్గం కాని క్యాడర్ నుంచి మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న పేరు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి నుంచి ఆయన జెయింట్ కిల్లర్ గా ఎదిగారు.   ప్రస్తుత సీఎం, మాజీ సీఎంలను ఓడించారు.  ఆయన బీజేపీ విధానాల్ని.. మోడీ పై అభిమానాన్ని ఓ రేంజ్ లో ప్రదర్శిస్తారు. ఆయన అయితే ఐకాన్ గా ఉంటారన్న చర్చ ఉంది. ఆయన వైపే అమిత్  షా మొగ్గు చూపుతున్నారని .. కానీ లోకల్ నాయకులు ఆయన ఎక్కడ పోటీ అవుతారోనని వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి