కౌన్ బనేగా సిఎం

By KTV Telugu On 1 August, 2023
image

KTV Telugu ;-

తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇస్తే ఎలా ఉంటుంది? అన్న చర్చ జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో 2014లో జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడ బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను పిసిసి అధ్యక్షుని చేసి తాము బీసీల పక్షపాతిమని సంకేతాలు ఇచ్చింది. అయితే అది వర్కవుట్ కాలేదు. ఇక అదే ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులను ముఖ్యమంత్రిని చేయలేదు.

భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించలేదు కానీ..తమ అంతర్గత సమావేశంలో మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించాలన్న ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ జరిగింది. దీన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకు వెళ్లారు కూడా. ఇంత వరకు జాతీయ నాయకత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే దీనికి ముందే బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న అపప్రధను మాత్రం బిజెపి మూటకట్టుకోవలసి వచ్చింది.

ఒక వేళ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చిందని అనుకుందాం. అపుడు బీసీలకు చెందిన నేతలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారన్న గ్యారంటీ ఎక్కడుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే ది రెడ్డి సామాజిక వర్గమే. కాంగ్రెస్ పార్టీతో అంతగా పెనవేసుకుపోయింది రెడ్డి అనుబంధం. కాంగ్రెస్ లో వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి గౌడ్,పొన్నాల లక్ష్మయ్య వంటి బీసీ నేతలు చాలా మంది ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వీరిలో ఏ ఒక్కరిని ముఖ్యమంత్రిని చేద్దామన్నా పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు మద్దతు ఇస్తారా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ పండితులు.

వచ్చే ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితే అధికారంలోకి వచ్చినా బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవంటున్నారు. బి.ఆర్.ఎస్. హ్యాట్రిక్ విజయం కొడితే కచ్చితంగా కేసీయారే మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. 2024లో లోక్ సభ ఎన్నికల బరిలో దిగి కేసీయార్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని అనుకుంటే మాత్రం ఆ ఎన్నికలకు ముందు తన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీయార్ ను ముఖ్యమంత్రిని చేసి తాను లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి తప్ప బీసీలనో ఎస్సీలనో ముఖ్యమంత్రిని చేస్తారని కనీసం ఊహించలేం అంటున్నారు సామాజిక వేత్తలు.

రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీ, ఎస్సీ కార్డులను తెరపైకి తెస్తాయే తప్ప ఎన్నికల ఫలితాలు వెలువడి అవి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ కార్డులను మళ్లీ అటకెక్కించేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలో బీసీ వర్గానికి చెందిన ఆర్ . కృష్ణయ్యను తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. ఎన్నికల్లో టిడిపి గెలిస్తే కృష్ణయ్యనే ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఎలాగూ అధికారంలోకి రాలేదు. కృష్ణయ్యను కనీసం శాసన సభా పక్ష నాయకుని కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు.

2014 ఎన్నికల్లో ఇలాగే దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని భరోసా ఇచ్చిన కేసీయార్ పార్టీ అధికారంలోకి రాగానే కూల్ గా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. దళితులను ముఖ్యమంత్రిని చేయడమే కాదు దళిత పేదలకు మూడు ఎకరాలు చొప్పున ఇస్తామన్నారు కేసీయార్. ఆ హామీని కూడా అమలు చేయలేదు. హుజూరా బాద్ ఉప ఎన్నికల సమయంలో మాత్రం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో తనను మించిన దళిత బంధు ఇంకెవరు ఉన్నారు? అని ఆయన నిలదీస్తున్నారు. రేపు బిజెపి గెలిచినా కూడా బీసీ, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..