కోల్ బెల్ట్ ఓటు ఎవరి వైపు ?

By KTV Telugu On 20 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 స్థానాల్లో గెలవాలి.  ఈ అరవై స్థానాల్లో 12 సింగరేణి కోల్ బెల్ట్ పరిధిలోనే ఉంటాయి.  మొత్తం 12 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని సింగరేణి కార్మికులే తేల్చనున్నారు. మరి  ఈ సారి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. బీఆర్ఎస్ పై  నమ్మకంతో ఉన్నారా ? ఈ సారి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారా ? సింగరేణి కేంద్రంగా జరిగే రాజకీయాల ప్రభావం ఓటింగ్ పై ఎలా ఉండనుంది ?

తెలంగాణలో ప్రధాన ఆదాయ వనరు, దేశానికి వెలుగులు పంచడంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోల్‌బెల్ట్‌ ప్రాంతం ఎన్నికల్లో కీలకం కానుంది. తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంపై ఆధారపడి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారు, కుటుంబ సభ్యులు సుమారు 6 లక్షల మంది వరకు ఉంటారు. వీరు ఈ ప్రాంతం నుంచి పోటీచేసే ప్రతి అభ్యర్థి గెలుపునూ ప్రభావితం చేయనున్నారు. ఈ కారణంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, చేయాల్సిన అభివృద్ధిపై కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలోని ప్రభుత్వ సంస్థయైన ‘సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌’లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ వాటాదారులే. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత లోయ ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు గనులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని కోల్‌బెల్ట్‌ ఏరియాగా పిలుస్తారు. తెలంగాణలోని ఆరు జిల్లాలు.. కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్ బెల్ట్‌లోనే ఉన్నాయి.

పార్లమెంట్‌ పరిధిలో ఆదిలాబాద్‌, పెద్ద పల్లి, వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో సింగరేణి ఓటర్ల ప్రభావం ఉంటుంది. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది కార్మికులుండగా, 20 వేల మంది వరకు కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. 60 వేల మందికిపైగా రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారు. గతంలో 2 లక్షలకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య రానురాను తగ్గుతూ 42 వేలకు చేరుకుంది. ఈ కారణంగానే  సింగరేణి మనుగడ ప్రమాదంలో పడుతోందని కార్మిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ గెలుచుకున్నాయి.  మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి.  ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు.  రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీచేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలిచారు.  రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి భూపాలపల్లి నుంచి గెలిచిన  గండ్ర వెంకటరమణారెడ్డి , కొత్తగూడెం నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వర రావు  , ఇల్లందు నుంచి గెలిచిన బానోత్ హరిప్రియ , సత్తుపల్లి నుంచి టీడీపీ  తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య బీఆర్ఎస్‌లో చేరారు.

అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి.  సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పెన్షనర్ల కుటుంబాల ఓట్లూ ఇక్కడి నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అందుకే అన్ని పార్టీలూ వారి సమస్యలపై మాట్లాడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాకే సింగరేణి కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్తుండగా సింగరేణి సంస్థను కాపాడింది, వారికి మేలు చేసింది కేంద్రమేనని బీజేపీ నేతలు అంటున్నారు. కోల్ బెల్ట్ ప్రాధాన్యం గుర్తించిన కాంగ్రెస్ రాహుల్ తో ప్రచారాన్ని అక్కడ్నుంచే ప్రారంభించారు. తొలి సారే కార్మికులతో సమావేశమై రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చారు.ప్రభుత్వాలు బయటకు చెప్పినంత గొప్పగా సింగరేణి కార్మికుల జీవితాలు లేవనేది అందరికీ తెలిసిన విషయం. ఈ సారి వారు ఎవరి వైపు మొగ్గుతారనేది కీలకం

సింగరేణిలో  కార్మికులకు అధిక పని గంటలు, యాంత్రీకరణతో  ఉద్యోగావకాశాలు తగ్గడం ప్రధాన సమస్యగా మారింది.  కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ నియామక ప్రక్రియతో శ్రమ దోపిడీ జరుగుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిటైర్డ్‌ కార్మికులు, ఉద్యోగుల్లో పింఛను విషయంలో చాలా అసంతృప్తి ఉంది. సుదీర్ఘ కాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయి. కోల్‌మైన్స్‌ ప్రావి డెంట్‌ ఫండ్‌  లో సమస్యలున్నాయి.

తాము అధికారంలోకి వచ్చాకే సింగరేణి కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించామని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటోంది.  కాంగ్రెస్, బీజేపీలు మరింత భిన్నమైన హామీలు ఇస్తున్నాయి.  తాము అధికారంలోకి వస్తే కార్మికుల చిరకాల డిమాండ్‌ అయిన ఆదాయ పన్ను మినహాయింపు కూడా సాధ్యం చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇన్‌కం ట్యాక్స్‌ రూపంలో కార్మికుల నుంచి భారీ మొత్తంలో కేంద్రం దోచుకుంటోందని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.  ఒక్క రోజు సర్వీస్‌ మిగిలి ఉన్నవారికి సంబంధించి కూడా కారుణ్య నియామకాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేయించి లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పదేండ్ల కాలంలో ఒక్క గని కూడా ప్రారంభం కాలేదు. డిపెండెంట్‌ ఉద్యోగాల భర్తీ తేలలేదు. సొంతింటి పథకం కోసం ఎదురు చూస్తున్నారు.  రెండేండ్లకోసారి నిర్వహించాల్సిన గుర్తింపు ఎన్నికలు ఆండ్లయినా నిర్వహించలేదు. దీంతో కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ ప్రభావం ఖచ్చితంగా ప్రధాన పార్టీలపై పడనుంది.

ప్రయివేటు కంపెనీలకు కోల్‌ మైనింగ్‌ అవకాశం కల్పించేలా ఈ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ మనుగుడకు ప్రమాదమేర్పడుతోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని 101 బొగ్గు గనులను వేలానికి పెట్టగా వాటిలో తెలంగాణలోని నాలుగు గనులు ఉన్నాయి. సింగరేణి ప్రాంత గనులు వేలం వేయకుండా సింగరేణికే ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వేలంలోని 14 శాతం డబ్బును ముందస్తుగా కేంద్రానికి చెల్లించే స్తోమత సింగరేణికి లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదన. కొత్తగా బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కకపోతే ఉన్న బొగ్గు నిక్షేపాలు 15 ఏండ్లలో ఖాళీ అయిపోయి..  సింగరేణి భవిష్యత్ కు భరోసా ఇచ్చి కార్మికల సంక్షేమానికి నికార్సుగా ప్రయత్నిస్తున్నామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. కానీ కార్మికులు ఎవర్ని నమ్ముతారన్నది కీలకం. బొగ్గు బాయిల్లోనే చితికిపోయే కార్మికులు.. తమ పిల్లలకు అయినా మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.కానీ అది హామీలకే పరిమితమవుతోంది.  ఈ సారి వారి ఆశల్ని తీరుస్తామని ఆ పార్టీ నమ్మిస్తుందో వారికే పట్టం కడతారు. వారే అధికారంలోకి వస్తారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి