ఫార్మా కంపెనీలకు రాజధానిగా ఎదుగుతూ అంతర్జాతీయ విమానాశ్రాయినికి అల్లంత దూరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న మహేశ్వరం నియోజక వర్గంలో ఈ సారి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది? రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై పలు సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన కె.ఎల్.ఆర్. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. గతానికి ఇప్పటికీ సంబంధమే లేదంటున్నారాయన. ఈ సారి తన విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోటీ కాంగ్రెస్-బి.ఆర్.ఎస్. ల మధ్యనే ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు.
మహేశ్వరం నియోజకవర్గం…హైదరాబాద్ నగరం శివారులో…అవుటర్ రింగ్ రోడ్‌కు ఇరు వైపులా..అటు రంగారెడ్డి జిల్లాలోను..ఇటు జీహెచ్ఎంసీలోను విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలో GHMC పరిధిలో రెండు డివిజన్లు, బడంగ్ పేట, జల్ పల్లి, తుక్కుగుడ మున్సిపాలిటీలు, మహేశ్వరం, కందుకూరు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడ్డ ఓటర్లే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఓటరు నాడి పట్టడం రాజకీయ పార్టీలకు అంతా ఈజీ కాదు.
ఆర్థిక వనరులు పుష్టిగా ఉన్న సంపన్న కుటుంబాలతో పాటు.. పస్తులుండి పూట గడిపే వారు ఇక్కడ ఉన్నారు. బాలాపూర్ గణనాథుడు లడ్డూ వేలం పాట ఇక్కడ చాలా ఫేమస్. మహేశ్వరం నియోజకవర్గ గెలుపు ఓటములను మైనారిటీలే డిసైడ్ చేస్తుంటారు.చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధికెక్కిన సబితా ఇంద్రారెడ్డి ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితారెడ్డి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో సబితారెడ్డి చోటు దక్కించుకున్నారు.
2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి వోడిపోయిన తీగల కృష్ణారెడ్డి.. ఈ సారి టికెట్ దక్కకపోయినా గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత బిఆర్ఎస్ కండువా కప్పుకొని.. 2018లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి… అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. బిఆర్ఎస్ అధిష్టానం మంత్రి సబితారెడ్డికి టికెట్ కేటాయించింది. నిత్యం ప్రజల మధ్య ఉండటం, సబితారెడ్డికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.
సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరిన తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బడంగ్ పేట మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి అధికార బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ భరోసాతో కండువా కప్పుకున్నారు. తీరా పారిజాత నర్సింహ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. సబితారెడ్డి కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు. గతంలో ఇంద్రారెడ్డి పై, సబితారెడ్డి పై చేవెళ్ల లో పలుసార్లు పోటీ చేసి వొడిపోయిన లక్ష్మారెడ్డి.. 2009లో మేడ్చల్ ఎమ్మెల్యే గా గెలిచారు. ఈ సారి తాండూర్ అసెంబ్లీ నుంచి పోటీకి ఆసక్తి చూపిన KLR కు.. చివరకు మహేశ్వరం అసెంబ్లీ స్థానం కేటాయించారు.
గత ఎన్నికల్లో బిజేపీ నుంచి పోటీ చేసిన శ్రీరాములు యాదవ్.. తిరిగి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంత ఊరు తిమ్మాపూర్.. ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. కిషన్ రెడ్డి సొంత ఇలాకాలో ఏ మేరకు ప్రభావం చూపుతారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మహేశ్వరం బీజేపీ టికెట్ దక్కకపోవడంతో దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలో గ్రూప్ తగాదాలు కలిసొస్తాయని గులాబీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి గత రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలోకి మారడం ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతుందా ? బ్రేక్ పడుతుందా ? చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…