తెలంగాణ ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్మానించారు. ములాఖత్ సందర్భంగా తనను కలిసిన తెలంగాణ లీడర్ కాసాని జ్ఞానేశ్వర్ వద్ద చంద్రబాబు ఈ సంగతి కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో శక్తి,యుక్తులన్నీ ఏపీలో వినియోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ శాఖను సమాయత్తం చేయాలని జ్ఞానేశ్వర్ కు ఆయన సూచించారు. ముందు నుంచే ఇలాంటి వార్తలను వింటున్న జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు నోట అదే మాట రావడంతో కొంత అసహనం అనిపించినా జైల్లో ఉన్న పెద్దాయన పరిస్థితి బాగోలేదని తెలిసి మౌనం వహించారు.జ్ఞానేశ్వర్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో ఆయన నిర్ణయించుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం వెనుక కారణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది..
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేమని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పారు. తెలంగాణలో సెటిలర్ల ఓట్లు ఏకమొత్తంగా టీడీపీకి పడే అవకాశం ఉందని జ్ఞానేశ్వర్ వాదించినప్పటికీ చంద్రబాబు అందుకు ఒప్పకోలేదు. సెటిలర్ల ఓట్లు పార్టీల మధ్య చీలిపోయాయని, అవి పోలరైజేషన్ కు పనికొస్తాయే తప్ప గెలిపించే ఛాన్స్ లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సారికి పోటీ వద్దనుకున్నారట. పైగా తెలంగాణలో పోటీ చేయడమంటై ఏపీ నేతలను తీసుకొచ్చి తెలంగాణలో తిప్పాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ లీడర్స్ ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమాల్లో పాల్గొంటున్నారు. వారిని తెలంగాణ ప్రచారానికి తీసుకొస్తే ఏపీలో ఉద్యమాలు కుంటి నడక నడిచే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే టైమ్ లో పార్టీకి సీట్లు రాకపోతే తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలో రేపు ఏపీలో ఓడిపోతారని వైసీపీ నేతలు బాకా ఊది చెప్పే వీలుంది. ఆ పరిస్థితి కాకుండా ఉండాలంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకున్నారు.
టీడీపీ విరమించుకున్నందు వల్ల ఎవరికి లాభమనేది పెద్ద ప్రశ్న. పరోక్షంగా కాంగ్రెస్ కు ప్రయోజనం కలుగుతుందని కొందరు.. లేదు లేదు.. బీజేపీ విజయావకాశాలు పెరుగుతాయని ఇంకొందరు లెక్కలు చెబుతున్నారు. నిజానికి ఏపీ పరిణామాలను బట్టి చూస్తే బీజేపీపై అనుమానాలు కలుగుతున్నాయి. దానితో తెలంగాణలోని టీడీపీ అభిమానులు కమలం వైపు మొగ్గు చూపే ఛాన్స్ తక్కువే. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందున ఈ సారి కూడా పరోక్షంగా హస్తం పార్టీకే ప్రయోజనం కలుగుతుందని విశ్వసిస్తున్నారు. బీజేపీ అయితే చాలా మంది టీడీపీ నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటోంది. ఏది నిజమో వారం పది రోజుల్లో తెలిపోతుంది. నేతల కదలికలు అర్థమైతాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…