43 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇకపై ప్రభుత్వోద్యోగులని గొప్పగా ప్రకటించినా దాని వెనుక ఏదో మతలబు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ దీర్ఘకాలిక వ్యూహం జనానికి అర్థం కాదని కాదు. కాకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో సరైన జీతాలు రాక నానా తంటాలు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఏదో కొంత ప్రయోజనం జరగడం మాత్రం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలన్నది కేసీఆర్ ప్లాన్. బీఆర్ఎస్ పై ఎంతో కాలంగా ఆగ్రహం చెంది ఉన్న టీఎస్ఆర్టీసీ కార్మికులను బుజ్జగించడం ఆయన మదిలో ఉన్న తొలి అంశం. ఎన్నికల వేల దాదాపు యాభై వేల కుటుంబాలను దూరం చేసుకుంటే కలిగే నష్టమేంటో ఆయనకు బాగానే తెలుసు. మరో పక్క స్థిరాస్తిగా ఆర్టీసీకున్న . అందుకే ఆయన కార్మికులకు మంచి చేసినట్లు కనిపించినా..అందులో గొప్ప దూరాలోచనే ఉందని చెప్పక తప్పదు.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాల్లో ఎన్నికల వాసన తెలుస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలోకి విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. క్యాబినెట్ సమావేశం ఐదుగంటల పాటు జరగగా.. అందులో రెండున్నర గంటలపాటు ఆర్టీసీ అంశంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ సిబ్బంది అంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు.వీరికోసం ప్రభుత్వంలో ప్రజా రావాణా శాఖను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి.. ఆ శాఖ నుంచే వీరికి జీతభత్యాలు చెల్లించడంతో పాటు ఇతర అంశాలను పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయిపడిన సీసీఎస్ నిధులు 1150 కోట్లు, ఎస్‌ఆర్‌బీఎస్ కింద 500కోట్లు, ఎస్‌బీటీ 500 కోట్లు, 2013 పీఆర్‌సీ బకాయి నిధులు సుమారు 500 కోట్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీపై మంత్రివర్గంలో చర్చ సందర్భంగా ఈ విషయాలపైనా పరిశీలన జరిగిందని సమాచారం. అయితే ఇవన్నీ కాకుండా.. ఒక్కసారిగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హమీల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆర్టీసీ ఉద్యోగులు చూసీ చూసీ కేసీఆర్ రెండో సారి గెలిచిన తర్వాత 2019 అక్టోబర్‌లో సమ్మెకు దిగారు. కానీ కేసీఆర్ అప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించారంటే ఆర్టీసీ ఉద్యోగులంతా సెల్ఫ్ డిస్మిస్ చేసేసుకున్నారని ప్రకటించేశారు. సమ్మె చేసిన ఉద్యోగులతో ఇక సంస్థకు సంబంధం లేదని ప్రకటించారు. కొత్త వారిని నియమించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రకమైన మనోవేదనతో ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. చివరికి కేసీఆర్ క్షమించి వదిలేశారు. దానితో కార్మికులు మరో సారి సమ్మె అనే ఆలోచన చేయలేదు. జీతాలు కూడా ఇచ్చినప్పుడే తీసుకుంటున్నారు. వారిలో అంతర్లీనంగా ఉన్న కోపం ఎన్నికల నాటికి వ్యతిరేక ఓటుగా మారుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. మరో పక్క ఆర్టీసీకి ఒకప్పటి లెక్క ప్రకారం అరవై వేల కోట్లు ఆస్తులుండేవి. ఇప్పుడవి లక్ష కోట్లకు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు.ఆర్టీసీని విలీనం చేస్తే ఆ ఆస్తులను పార్టులు పార్టులుగా అమ్మకానికి పెట్టే వీలుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోలు, 11 రీజియన్లు, 24 డివిజన్లు, రెండు జోనల్ వర్క్‌షాప్‌లు, ఒక బస్ బాడీ యూనిట్, రెండు టైర్ రిట్రేడింగ్ షాపులు, ప్రింటింగ్ ప్రెస్, హకీంపేట ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ, స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్, 364 బస్ స్టేషన్లు, ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఒక్కో జిల్లాలో వంద ఎకరాలకుపైనే ల్యాండ్స్ ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 194 ఎకరాల భూమి ఉంది. వీటన్నింటినీ క్రమంగా అన్యాక్రాంతం చేసే కుట్ర ఉందని కేసీఆర్ తీరుపై కొందరికి అనుమానంగా ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకే సమయానికి జీతాలు రావడం లేదు. హైదరాబాద్ తప్ప.. మిగతా జిల్లాల్లో ఉద్యోగుల పరిస్థితి జీతాల కోసం ఎదురు చూడటమే. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం లో కలిసినా ఎదురుచూపులు తప్పవు. కేవలం ఆర్టీసీ కార్మికులను కూల్ చేసేందుకు విలీన ప్రక్రియకు తెరతీశారని చెప్పాలి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో శతమతమవుతున్నారు. వీఆర్ఎస్ ఇస్తే వెళ్లిపోయి వేరే పని చేసుకుంటామని చెప్పే వాళ్లూ ఉన్నారు. అయితే వారు తమ సమస్యలను పరిష్కరించుకోవడం అంతంత మాత్రమే అవుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..