ఇదిగో పులి అంటే అదిగో తోక అని మనవాళ్లు చాలా సందర్భంల్లో అంటారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఆమడ దూరం ప్రయాణిస్తుందని చెబుతారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుందనుకోవాలి. ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో రాష్ట్రంలో మరో అంశం తెరపైకి వచ్చింది. కొందరు దీన్ని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరిగిపోతోందంటూ చెవులు కొరుక్కునేసి, పుంఖానుపుంఖాలుగా రాసేసి, వందల కొద్ది వీడియోలు కూడా విడుదల చేసేస్తున్నారు…
ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజులకే కేసీఆర్ తమ ఫామ్ హౌస్ లో కాలు జారి పడిపోయారు. ఆయనకు తుంటి విరగడంతో యశోదా ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. ఇదీ ఒరిజినల్ న్యూస్. దీనికి మించి మరో న్యూస్ ఒకటి ఉంది. కేసీఆర్ ఎందుకు అర్థరాత్రి దాటాక కింద పడిపోయారో వివరిస్తూ చాలా కోణాల్లో కథలు ప్రచారమయ్యాయి. అందులో ఎక్కువగా ప్రచారమవుతున్న అంశం కుటుంబ కలహమని చెబుతున్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలోనే కేటీఆర్, హరీష్ రావు వాగ్వాదానికి దిగారన్నది ఒక న్యూస్ .కేటీఆర్ ఇలానే అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ మరింత నష్టపోతుంది అని, కెటిఆర్ తన పద్దతి మార్చుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని హరీష్ రావు తేల్చిచెప్పినట్లు కథనాలు వండి వార్చుతున్నారు. తనతో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడటం తప్పితే ఆప్షన్ లేదని హరీష్ కుండబద్దలు కొట్టారట. కేవలం చంద్రబాబు అరెస్ట్ మీద చేసిన వ్యాఖ్యల వల్ల చాలా నష్టపోయిన సంగతి హరీష్ రావు గుర్తు చేశారట. మేడిగడ్డ కుంగటం వల్లనే, ప్రభుత్వానికి అవినీతి మరక వచ్చిందని కూడా తేల్చారట. అయితే హరీష్ రావు వెంట ఉన్న 21 మంది ఎమ్మెల్యేల లిస్టు తనదగ్గర ఉందని బ్లాక్ మెయిల్ చేస్తే భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ కూడా సమాధానమిచ్చారట. పైగా మద్యం మత్తులో హరీష్ రావుపై కేటీఆర్ దూసుకెళ్లడంతో తోపులాట జరిగిందట. ఆపడానికి ప్రయత్నించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుపై కూడా కేటీఆర్ దాడి చేశారట. వివాదం పెద్దది అవుతుందని గ్రహించిన కేసీఆర్ దాన్ని ఆపేందుకు ప్రయత్నంచే క్రమంలో తోపులాట కారణంగా కిందపడిపోవడంతో తుంటి విరిగిందని సోషల్ మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. పైగా కేటీఆర్ కు దెబ్బతగిలినా కూడా పట్టించుకోకుండా కేటీఆర్ అక్కడ నుంచి వెళ్లిపోయారని కూడా ప్రచారమవుతోంది.
దాడికి సంబంధించి కథలు అల్లిన వారికి ఒక విషయం తెలియదనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యల ప్రభావం ఎన్నికలపై ఉంటే సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవాలి. వాస్తవానికి అలా జరగలేదు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో పరాజయం పాలైన బీఆర్ఎస్ .. హైదరాబాద్, రంగారెడ్డిలో మాత్రం ఘనవిజయం సాధించింది. ఆ రెండు జిల్లాలో కాంగ్రెస్ కు ఒక సీటు కూడా రాలేదు. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా కథనాలు పెడుతున్న వారు ఈ లాజిక్ మిస్సయినట్లుగా ఉన్నారు. పైగా హరీష్ రావు స్వయంగా కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నట్లు కూడా రాసుకొస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చి, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపకుండా ఉంటే పార్టీ మారతానని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తో హరీష్ రావు బేరమాడినట్లుగా కూడా మరో ప్రచారం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అవినీతిపై సహేతుకమైన విచారణ జరుపుతామని ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించారు. ఆ విషయంలో కాంగ్రెస్ నేతలంతా గట్టిగానే పట్టుబడుతున్నారు. అలాంటప్పుడు హరీష్ రావు ఆ దిశగా ఎలా డిమాండ్ చేస్తారో వదంతులు ప్రచారం చేసిన వారికే తెలియాలి…
ఒకటి మాత్రం నిజం. వదంతులు జనంలోకి బాగానే వెళ్లిపోయింది. చాలా మంది దాన్ని విశ్వస్తున్నారు కూడా. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించాలి. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి ఉండే ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. తోపులాట మాత్రం ఒట్టిమాటేనని తేల్చేస్తున్నారు. ఇప్పటికే ఓటమితో నైతికంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ శ్రేణులను మరింతగా కృంగదీసేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఏదైమైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి మాత్రం ఈ వదంతులు చేరి ఉండకపోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…