కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం సాధించిన కమలనాథులు…తెలంగాణలో మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కమలం పార్టీ. ఈసారి తెలంగాణలో అధికారంపై గంపెడాశలు పెట్టుకుంది. ఉప ఎన్నికలు, GHMC ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పార్టీలో ఊపొచ్చింది. కాని క్రమంగా నీరుగారిపోయింది. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ స్టోరీ.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చూసిన కమలం పార్టీకి.. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో జోష్ పెరిగింది. అయితే తెలంగాణలో పార్టీ కేడర్‌లో దూకుడు పెంచిన బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి…కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో కొంత కలవరం రేగింది. దానికి తోడు అసంతృప్తి నేతలు తరుచూ భేటీ కావడం..పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగడం క్యాడర్ ను మరింత డైలమాలో పడేశారు. పార్టీ అగ్రనేతల పర్యటనలతో పార్టీలో మళ్లీ జోష్ వస్తుందని బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
2018 శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీలో సీనియర్లుగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కిషన్‌రెడ్డి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచి బీజేపీ తెలంగాణలో మళ్లీ ఆశలు పెంచుకుంది. ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా పరాజయం పాలైన బండి సంజయ్..కరీంనగర్ ఎంపీగా గెలిచి ఆ తర్వాత పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లకు పైగా పనిచేసి పాదయాత్రలు, బహిరంగసభలతో పార్టీని పరుగులు పెట్టించారు. కమలం క్యాడర్ లో అధికారంపై ఆశలు పెంచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు. ఆ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికలో రాజగోపాల్ ఓడిపోయినప్పటినుంచీ బీజేపీకి రాష్ట్రంలో డౌన్‌ఫాల్ మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో తెలంగాణ క్యాడర్ మరింత డీలా పడింది. అంతలోనే రాష్ట్ర నాయకత్వం నుంచి బండి సంజయ్ ను తప్పించి..కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రధాని పర్యటన బిజెపిలో జోష్ పెంచిందనే చెప్పాలి. కీలకమైన రెండు హామీలతో బిజెపికి కొత్త ఊపు నిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనివ్వడమే కాకుండా ఆగమేఘాల మీద దాన్ని కేబినెట్ లో పెట్టి ఆమోదించారు.
అలాగే విభజన హామీలో భాగమైన గిరిజన యూనివర్శిటీకీ మోక్షం కలిగించారు. ఇవి కాక ఎన్నికల ముందు బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ లకు షాకిచ్చేలా మేనిఫెస్టో రూపొందించి విడుదల చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.
బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చే ఎన్నికలలో తెలంగాణపై భారీ అంచనాలు పెట్టుకుంది. తెలంగాణలో పాగా వేయాలని ఫోకస్ పెట్టినా.. ఇక్కడ పరిస్థితులు మాత్రం కమలనాథులకు అనుకూలించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పట్టు సాధించలేకపోవడం…నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. హస్తిన నేతలే నేరుగా రంగంలో దిగి తెలంగాణలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 6 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక జాతీయ నేతలు కూడా వరుసగా పర్యటిస్తుండటం వల్ల తెలంగాణ కమలం నేతలు, కేడర్‌లో జోష్ పెరుగుతుందేమో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…