తెలంగాణలో బీజేపీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. పార్టీ అధిష్టానం అనుకుంటున్నది ఒకటైతే.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలం నానాటికి పడిపోతోంది. కేడర్ కు దిశానిర్దేశం లేక దిక్కులు చూస్తున్న తరుణంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అన్న చర్చ మొదలైంది. సంఖ్యాపరంగా గత ఎన్నికల్లో సాధించిన నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే గగనమన్నట్లుగా పరిస్థితి తయారైంది…
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి. పార్టీకి కంచుకోటగా భావించే హైదరాబాద్, రంగారెడ్డిలో ఒక రాజా సింగ్ తప్పితే ఎవరూ గెలవలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లో మాత్రమే పార్టీ పటిష్టపడినట్లుగా కనిపిస్తోంది. కట్ చేసి చూస్తే లోక్ సభ ఎన్నికల నాటికి సీన్ సితార అవుతున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంత కాలం వాపును చూసి బలుపు అనుకుని బతుకుతున్న ఆ పార్టీకి ఇప్పుడు కూడా తత్వం బోధపడినట్లుగా లేదు. రాష్ట్ర నేతలు అరిచేతిలో స్వర్గం చూపిస్తుంటే..కళ్లు బయర్లు కమ్మిన కేంద్ర నాయకత్వం..అదే నిజమన్నట్లుగా వారి మాటలనే విశ్వసిస్తోంది. ఎక్కే గడప.. దిగే గడప అన్నట్లుగా కేంద్ర నాయకులు టూర్లు వేసి పోవడమే తప్ప..వారికి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులను వారికి వివరించే వాళ్లే లేరు. బీఆర్ఎస్ దెబ్బతింటే తాము ఆ ప్లేస్ లో ఉంటామని పగటి కలలు కనడం మినహా..రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దూసుకుపోతోందని, అందనంత ఎత్తుకు ఎదిగిపోతోందని వాళ్లు గ్రహించలేకపోతున్నాయి. ఈ లోపు పుణ్యకాలం గడిచిపోయిందని చెప్పక తప్పదు. ఏ పార్టీకైనా సంస్థాగత నిర్మాణమూ, ప్రాంతీయంగా సరైన నిర్ణయాలు అవసరం. బీజేపీకి ఇప్పుడు అవి రెండు కొరవడ్డాయని చెప్పుకోవాల్సిందే. నేతల మెహర్బానీ తప్పితే కేడర్ ను పట్టించుకున్న వాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ నిర్ణాణంపై దృష్టి పెట్టకుండా వారానికి ఒక సారి ఢిల్లీ నుంచి ఇంఛార్జ్ లు వచ్చి మాట్లాడిపోతే సరిపోతుందా. ఇటీవల జరిగిన టిఫిన్ పే చర్చా, గావ్ చలో లాంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైన ఫీడ్ బ్యాక్ లేకపోయినా పార్టీ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర నాయకులుగా చెప్పుకుంటున్న వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటే కేంద్ర నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడం లేదు. త్వరలో కొత్తవారికి, పాత వారికి మధ్య సంఘర్షణ తప్పదన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది….
తెలంగాణలో కనిష్టంగా పది లోక్ సభా స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పరిస్థితులను గమనిస్తే కనీసం సగం వస్తాయని కూడా ధైర్యంగా చెప్పలేరు. అందులోనూ పార్టీ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న సికింద్రాబాద్ , మల్కాజ్ గిరి స్థానాలపై కూడా ఇప్పుడు అనుమానాలున్నాయి. టీ.బీజేపీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా గడ్డుకాలం తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. పైగా ఏపీ పరిణామాలు కూడా తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి….
కిషన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కేంద్ర మంత్రి అయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య టీబీజేపీ అధ్యక్షుడయ్యారు. కేంద్ర మంత్రి కదా..అందుకే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో పోటీ చేయబోతున్న ఆయన విజయావకాశాలపై నీలినీడలు అలుముకున్నాయి…నియోజకవర్గానికి ఆయన చేసినదీ శూన్యమన్న టాక్ నడుస్తోంది.నియోజకవర్గంలో ఇదివరకు బీజేపీ పట్ల ఉన్న సానుకూలత ఇప్పుడు లేదని తేల్చారు. రాష్ట్ర పరిణామాలతో పాటు పక్కనున్న ఏపీ పరిణామాలు ఇప్పుడు సికింద్రాబాద్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడ బీజేపీ వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. దానితో ముస్లింలు, ఎస్సీ సామాజికవర్గాల వారు జగన్ వైపుకు వెళ్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీకి శాపం కావచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్ లో 20 లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటే అందులో 27 శాతం ముస్లింలున్నారు. ఎనిమిది శాతం ఎస్సీలున్నారు. అంటే ఐదు లక్షలకు పైగా ముస్లింలు, దాదాపు లక్షా 75 వేల మంది దళిత సామాజికవర్గాల వారున్నారు. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయమని చెబుతున్న తరుణంలో బీజేపీకి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.ఆయా వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా మల్కాజ్ గిరి లాంటిదేనని చెప్పక తప్పదు. అక్కడ సెటిలర్లు, కార్మికవర్గాలు, ముస్లిం, దళిత ఓటర్లు గణనీయంగానే ఉన్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఈ సారి తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఆయన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. మల్కాజ్ గిరిలో 32 నుంచి 33 లక్షల ఓటర్లుంటారు. ముస్లింలు, దళితులు తలా తొమ్మిది శాతం ఓటర్లుంటారు. అంటే దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లన్నమాట.. మల్కాజ్ గిరిలో ఓటర్ టర్నవుట్ యాభై శాతం ఉంటే గొప్ప. ఇప్పుడు ముస్లింలు, దళితులు బీజేపీపై గుర్రుగా ఉన్నారన్న వార్తల నడుమ వారి ఓటింగ్ కీలకమవుతోంది. పైగా రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీ అయిన తర్వాతే రాజకీయాల్లో పుంజుకుని సీఎం పీఠం ఎక్కారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభావం మల్కాజ్ గిరిపై ఎక్కువగానే ఉంటోంది.కార్మిక సంఘాల్లో కొంతవరకు బీఆర్ఎస్ పట్ల ఇంకా అభిమానం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేస్తుందన్న విశ్లేషణలు కూడా తెరమీదకు వస్తున్నాయి. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ మాత్రమే కాకుండా ఇతర చోట్ల కూడా బీజేపీకి కష్టకాలం తప్పదనిపిస్తోంది. పార్టీలో ఐక్యత లోపించింది. మూడు నాలుగు పార్టీలు మారి మొదటి సారి కామారెడ్డిలో ఎమ్మెల్యే అయిన వెంకట రమణారెడ్డి కూడా తనకు సీఎం పదవికావాలంటున్నారు. అలాంటి బహిరంగ ప్రకటనలు క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. జిల్లాల్లో గ్రూపు తగాదాలు పార్టీని కుంగదీస్తున్నాయి. జనంలో పార్టీని పలుచన చేస్తున్నాయి….
కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమేనని చెప్పాలి. పైగా ఇప్పుడు కాంగ్రెస్ బలపడిన నేపథ్యంలో వార్ వన్ సైడ్ గా మారే వీలు కూడా ఉంది. 17 లోక్ సభా స్థానాల్లో 14 గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది.ఇక మరి బీజేపీ రేంజ్ ఏమిటో.. పెరిమాళ్ కే ఎరుక..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…