తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఓటమి ఖాయమైతే ఎవరు గెలుస్తారు. బీజేపీని విజయలక్ష్మి వరించేంత సీన్ ఉందా.. బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు. అకస్మాత్తుగా రైల్వే ప్రాజెక్టులు ప్రకటించడం వెనుక ఎన్నికల వ్యూహమే ఉందా. పుంజుకున్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ అడ్డుకోగలదా. అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగానే పుంజుకుందా లేక అంతా మీడియా హైప్ మాత్రమేనా… శూన్యం నుంచి అందలం అంత సులభమా…
బీజేపీ పాజిటివ్ దృక్పధం ఉన్న పార్టీ . అసలేమీ లేని రోజుల్లో కూడా హిందూ రాష్ట్ర్ పేరుతో బలం పుంజుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ సంస్థ అది. కేవలం ఇద్దరు ఎంపీలతో రాజకీయ మనుగడ సాగించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని… ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ధోరణి పాటిస్తోంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతో వచ్చే ఎన్నికల్లో సెంచురీ కొట్టాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసి కూడా నిరాశ చెందకూడదనుకుంది. ప్రయత్నం పార్టీల లక్షణం కదా. ప్రయత్నిస్తే గెలుస్తామన్న విశ్వాసంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది.. ఆ దిశగా తెలంగాణ ప్రజలకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది.
2018 ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి చావుదెబ్బేనని చెప్పాలి. కిషన్ రెడ్డి కూడా ఓడిపోయిన ఆ ఎన్నికల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. తర్వాత ముగ్గురు ఎంపీలు గెలవడం, జీహెచ్ఎంసీలో సత్తా చాటడం, ఉప ఎన్నికల పుణ్యమాని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడం చకచకా జరిగిపోయాయి. పార్టీకి టర్న్ అరౌండ్ సాధ్యమని తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని వరుస పరిణామాలు నిరూపించాయి. బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలు కూడా ఫలించాయి. హైదరాబాద్ పార్టీ అనుకున్న బీజేపీని తెలంగాణ మొత్తం విస్తరించిన ఘనత కూడా బండి సంజయ్ కే దక్కింది. సంజయ్ దూకుడు రాజకీయాలు, కేసీఆర్ పట్ల ఆయన వైఖరి బీజేపీకి కలిసొచ్చింది.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదవీ కాలం పూర్తి కావడం పార్టీకి కూడా శాపంగానే చెప్పుకోవాలి. వేర్వేరు కారణాలతో పార్టీ అధిష్టానం ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అయిష్టంగానే రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు.అయితే మునుపటి వేగం, మునుపటి దూకుడు కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి నేతలు పార్టీని తలోదిక్కున లాగుతున్నారు. డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కార్యకర్తల్లో మునుపటి జోష్ లేదన్న అనుమానాల నడుమ నాయకత్వ మార్పు వికటించిందన్న థియరీ తెరపైకి వచ్చింది…
మార్పు మంచికే కావచ్చు. మార్పు లేని జీవితం వ్యర్థం కావచ్చు. బీజేపీ కూడా అలాగే ఆలోచించి ఉండొచ్చు. అందుకే మళ్లీ కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించి ఉండొచ్చు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కొంత ఉదాసీనంగా కనిపించినా… ఇప్పుడిప్పుడే రూటు మార్చారు. తెలంగాణకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్నదేమిటో పూసగుచ్చినట్లు వివరించేందుకు కంకణం కట్టుకున్నారు. కేంద్రం ఇస్తున్నదేమిటి, రాష్ట్రం చేస్తున్నదేమిటి బేరీజు వేసి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణలో 80 వేల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. 33 జిల్లాలకు, లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు రైల్వే కనెక్టివిటీ కల్పించడమే బీజేపీ లక్ష్యమని ఆయన వెల్లడించారు. భద్రాచలం, రామప్ప, మేడారానికి రైళ్లు వస్తాయన్నారు. ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరు సహా అనేక ప్రాజెక్టులు కేంద్ర ఆమోదం పొందాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై శీతకన్నేసిందని, అన్ని ప్రాజెక్టులను గుజరాత్ కు తరలిస్తున్నారన్న ఆరోపణల నడుమ దక్షిణాది రాష్ట్రంపై కూడా తమకు మక్కువ ఉందని నిరూపించేందుకు బీజేపీ ఓ పాచిక వేసిందనే చెప్పాలి.
తెలంగాణలో గెలవాలన్న బీజేపీ ప్రయత్నం కొండకు దారం కట్టి లాగినట్లుగా కనిపించొచ్చు. కాకపోతే బీజేపీ తనకున్న ఆశావాదంతో విజయం కోసం ఆ పని చేస్తూనే ఉంది. ఒకప్పుడు ఈశాన్యంలో బీజేపీ లేనేలేదు. ఇప్పుడు దాదాపు అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఆ పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. తెలంగాణలో చాపకింద నీరులా పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతోందని ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలను వేసుకుని పార్టీని పటిష్టం చేసే చర్యలు కొంతమేర ఫలించాయి. ఇటీవల నిర్వహించిన టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో ఈ విషయం వెల్లడైంది.భావసారూప్య సంస్తలు, హిందూవాద సంస్థలు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూనే ఉన్నాయి. ప్రధాని మోదీ, ఎన్డీయే ఎంపీలతో నిర్వహించిన వరుస భేటీల్లో తెలంగాణ ఓటింగ్ సరళి కూడా చర్చకు వచ్చి ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీలో ఎవ్వరూ చేరడం లేదనేదే పెద్ద ప్రశ్న. పార్టీ పురోగమనానికి అది పీటముడిలా అనిపించొచ్చు. ఆ విషయంలో కాంగ్రెస్ ముందంజలో ఉందని కూడా కొందరు విశ్లేషించే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఎప్పుడూ బయటపడుతూనే ఉంటాయి,. గాంధీ భవన్ తగులబెట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఉత్తమ్ అంటే రేవంత్ కు పడదు. రేవంత్ అంటే కోమటిరెడ్డికి నచ్చదు. జగ్గా రెడ్డి అంటే ఎవరికీ ఇష్టం లేదు. ఇక భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, రేణుకా చౌదరి, అంజన్ యాదవ్ అందరూ మోనార్కులే. బీజేపీలో ఆ పరిస్థితి లేదు. పార్టీ నిర్ణయానికి, క్రమశిక్షణకు కట్టుబడే నేతలంతా పనిచేస్తారు. కార్యకర్తలు కూడా ఎక్కడా గీత దాటరు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రంలో థర్డ్ ప్లేస్ లో ఉందని ప్రతీ బీజేపీ కార్యకర్తకు తెలుసు. ఆ పరిస్తితి నుంచి ముందుకు జరిగి మిగతా ఇద్దరికీ టఫ్ ఫైట్ ఇస్తే గెలుపుకు ఒక ఛాన్స్ ఉందని కూడా బీజేపీ నేతలు గ్రహించారు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ లాగ ఎన్నికల అవకతవకలకు పాల్పడాల్సిన పనిలేదు. కాంగ్రెస్ నేతల్లా వీధిన పడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫెయిర్ గేమ్ ఆడుతూనే బీజేపికి గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గణాంకాలు వేరు.. ఎన్నికల నాటికి జన నాడి వేరు… అంతే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…