కేసీఆర్ కు కుమారస్వామి జై ..!

By KTV Telugu On 14 November, 2023
image

KTV TELUGU :-

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు నిజంగానే మారుతున్నట్లున్నాయి. బయట పార్టీలు సైతం తెలంగాణలో ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నట్లుగా  అనిపిస్తోంది. ఆ దిశగానే కర్ణాటక నేత ఒక బీఆర్ఎస్ కు అనుకూల స్టేట్ మెంట్ ఇచ్చారు.నాలుగు మంచి మాటలు మాట్లాడారు. దానితో ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు ఉబ్బితబ్బిబవుతున్నాయి.. అసలేం జరిగింది…

తెలంగాణలో బీజేపీ పోటీ చేస్తోంది. తామే అధికారానికి రావాలనుకుంటోంది. అందుకోసం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనను కూడా కలపుకుపోతోంది. బీజేపీ మిత్రపక్షాలు, శ్రేయోభిలాషులు ఎవరున్నా సరే కమలం పార్టీకే జై కొట్టాలి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతోంది.ఎన్డీయేలో చేరతామని ప్రకటించిన కర్ణాటక జేడీఎస్ నేత బీఆర్ఎస్ ను ప్రశంస్తున్నారు. అంతకంటే గొప్ప పార్టీ మరోకటి లేదని ఆకాశానికెత్తేస్తున్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ దిశగా కుమారస్వామి బెంగళూరులో చేసిన ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కుమారస్వామి తొలుత కాంగ్రెస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తప్పిదాలను తీవ్ర స్తాయిలో విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని చెప్పారు. ఎన్నికల ముందు ఐదు హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిందని. వాటిని అమలు చేయలేక పూర్తిగా చతికిల పడిందని ఆరోపించారు. తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని కుమారస్వామి కోరారు.

కుమారస్వామి బీఆర్ఎస్ ను తెగపొగిడేశారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రైతులకు పదివేల చొప్పున ఇస్తున్నారని, ఇప్పుడు దానిని 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని దానిని  నమ్మలేమని ఆయన అంటున్నారు. తెలంగాణలో   73,000 కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారన్న సంగతి కాంగ్రెస్ ఖాతాలో వేశారన్నారు. గతంలో కర్ణాటకలో ఎకరానికి 4000 మాత్రమే ఇచ్చేవారని. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలు కూడా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తోందని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్నది కేవలం రెండు గంటల కరెంటు మాత్రమేనని   కుమారస్వామి ధ్వజమెత్తారు. కుమారస్వామి అలా ఎందుకు మాట్లాడారంటే ఇప్పుడాయన  మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. నిజానికి బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా కుమారస్వామి ప్రగతి భవన్ కు వచ్చారు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తానంటే మద్దతు ఉంటుందని ప్రకటించారు. అప్పట్లో కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నప్పుడు కుమారస్వామికి కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కానీ తీరా ఎన్నికల విషయానికి వచ్చేసరికి కెసిఆర్ యూ టర్న్ తీసుకున్నారు. అప్పట్లో భారత రాష్ట్ర సమితి ఢిల్లీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా కుమారస్వామి వెళ్లలేదు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు..ఎన్డీఏ చేరుతున్నామని ప్రకటించారు. ఆయనతో చర్చలు జరిపిన యడ్యూరప్ప.. బీజేపీ అధిష్టానాన్ని కూడా అందుకు ఒప్పించారు.

ఎన్డీయే కూటమిలో చేరాలనుకున్న కుమారస్వామి.. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడాలి. ఆ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పాలి. ఇప్పుడు మాత్రం బీజేపీని వదిలేసి ఆయన బీఆర్ఎస్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదీ ఆశ్చర్యకరమైన పరిణామమని విశ్లేషణలు  వినిపిస్తుండగా, ఏదో జరిగి ఉంటుందని అందుకే  ఆయన అలా మాట్లాడుతున్నారని మరికొందరు అంటున్నారు. అంతకు మించి మరో వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ ఎలాగూ బీఆర్ఎస్ కు బీ టీమ్ కాబట్టి.. ఆయన డైరెక్టుగానే రంగంలోకి దిగారని రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. ఏది  నిజమో మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి