మజ్లిస్ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తానని అంటోంది. మజ్లిస్ పార్టీ గ్యారంటీగా గెలవగలిగే అసెంబ్లీ నియోజక వర్గాలు ఏడుకుమించవంటున్నారు రాజకీయ పండితులు. అయితే మజ్లిస్ వ్యూహకర్తల వాదన మరోలా ఉంది. తాము ఇంతకాలం హైదరాబాద్ పైనే దృష్టి సారించడం వల్ల గ్రామీణ ప్రాంతాలవైపు విస్తరించేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేయలేదని వారంటున్నారు. ఈ సారి మాత్రం కచ్చితంగా మజ్లిస్ పార్టీని గ్రామీణ తెలంగాణాలోనూ విస్తరిస్తామంటున్నారు మజ్లిస్ నేతలు.
అయితే ఈ ఆరోపణలు దురహంకారంతోనూ దుర్మార్గంతోనూ కూడుకున్నవని మజ్లిస్ నేతలు అంటున్నారు. మజ్లిస్ పార్టీ కొన్నేళ్ల క్రితం ఎక్కడుందో ఇప్పుడూ అక్కడే ఉండాలని అది విస్తరించకూడదని భావించే రాజకీయ పార్టీలే తమపై బురద జల్లుతున్నారని మజ్లిస్ వ్యూహకర్తలు ఆరోపిస్తున్నారు. తెలంగాణాలో మజ్లిస్ పార్టీ వీలైనంత ఎక్కువగా ముస్లిం ఓట్లను తమ ఖాతాలో వేసుకోగలిగితే మాత్రం అది కచ్చితంగా కాంగ్రెస్ కు కష్టాలు మిగులుస్తుందని వారు అంటున్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు మజ్లిస్ గండి కొడితే లబ్ధి పొందేది ఎవరు. బి.ఆర్.ఎస్. పార్టీయా లేక బిజెపినా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.
బిజెపి వ్యూహకర్తలయితే మజ్లిస్ ఫ్యాక్టర్ అందరికన్నా తమకే మేలు చేస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచే ఓటు బ్యాంకుకు గండికొడితే అది తమ విజయాన్ని మరింత తేలిక చేస్తుందని బి.ఆర్.ఎస్. నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అన్నిసార్లూ మనం అనుకున్న వ్యూహాలు వర్కవుట్ కాకపోవచ్చునంటున్నారు నిపుణులు. ఒక్కోసారి మన అంచనాలు తల్లకిందులు కావడం కూడా ఆటలో భాగమే అంటున్నారు వారు. బి.ఆర్.ఎస్. బిజెపిలలో ఎవరు అధికారాన్ని చేపడతారని లెక్కలు బేరీజులు వేసుకుంటోన్న వాళ్లు కాంగ్రెస్ ను పూర్తిగా విస్మరించకూడదంటున్నారు.
బి.ఆర్.ఎస్. ఎనిమిదేళ్ల పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మరీ ఎక్కువగా ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకీ అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు. అలా కాకుండా బి.ఆర్.ఎస్. పై వ్యతిరేకత నామ మాత్రం అయితే మజ్లిస్ చీల్చే ఓట్లు బి.ఆర్.ఎస్. కు వరంగా పరిణమిస్తాయని వారు లెక్కలు వేస్తున్నారు.