ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఏ ఇద్దరు కలిసినా చర్చ జరుగుతోంది. నిజానికి ఆయా రాష్ట్రాల్లో ఫలితాలే కాదు.. ఆ ఫలితాల దేశ రాజకీయాల్ని కూడా మార్చబోతున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరాటంలో ఈ ఎన్నికలు ఎవరి బలం ఎంతో తేల్చనున్నాయి. హిందీ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య పోరు సాగుతోంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ సగం మార్పు వచ్చినా బీజేపీ పనైపోతుంది. అందుకే… ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎక్కువ మంది దృష్టి ఉంది.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఆరు మాసాల ముందు జరుగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 న వెలువడనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద చాలా ఎక్కవగా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఎవరి ఖాతాలో చేరబోతున్నాయనేది కీలకం. మెజారిటీ విజయాలు సాధించుకోగలవారికి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విశేష బలం చేకూరుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ప్రధాన ఎదురెదురు పక్షాలుగా బిజెపి, కాంగ్రెస్ వున్నాయి. ఈ రెండింటిలో ఏ పార్టీది ఇక్కడ పైచేయి అవుతుందో ఆ పార్టీకి ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ ఉంటుంది.
కర్నాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత బీజేపీ విషయంలో నెగెటివ్ ప్రచారం ఊపందుకుంది. మోదీ సర్వం తానే అయి ప్రచారం చేసినప్పటిక కర్ణాటకలో ఫలితాల రాలేదు. మోదీ మేనియా ఏమీ లేదన్న విశ్లేషణలు ఈ కారణంగానే వచ్చాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలు హిందీ మాట్లాడే రాష్ట్రాల ప్రజల మొగ్గును సూచించే అవకాశాలున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలున్నాయి. అక్కడ ఎన్నికలు నవంబర్ 23న జరుగుతాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెలుచుకొన్నది. అంటే మెజారిటీకి దరిదాపుల్లో వచ్చింది. 39.8 శాతం ఓట్లను గెలుచుకొన్నది. బిజెపి 70 సీట్లను కైవసం చేసుకొన్నది. బహుజన సమాజ్ పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తిరిగి తన పార్టీని గెలిపించుకొనే ప్రయత్నంలో అప్రమత్తంగా పని చేస్తూ వచ్చారు. పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అయితే బిజెపి కూడా కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు గట్టి కృషి చేస్తున్నది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కాంగ్రెస్ ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో కీలకంగా మారనుంది.
230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసన సభకు పోలింగ్ నవంబర్ 17న జరుగుతుంది. ఇక్కడ కూడా పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్యనే. బిజెపి ఈ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ళుగా అధికారంలో వున్నది. ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు వార్తలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను గెలుచుకొన్నది. 41.5 శాతం ఓట్లు సాధించుకొన్నది. బిజెపి 109 స్థానాలు, 41.6 % ఓట్లు పొందింది. సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్‌ది పైచేయి అయినందున బిజెపి ప్రతిపక్షంలో కూచొని వుంటే అది ప్రజాస్వామికం అనిపించుకొనేది. కాని కర్ణాటక తరహా ఆపరేషన్ నిర్వహించింది. కాంగ్రెస్‌లో అసమ్మతి నాయకుడైన జ్యోతిరాదిత్య సింధియాను బయటకు రప్పించడం ద్వారా మెజారిటీని కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఈసారి బిజెపి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగినందుకు ఆయనను రాజకీయంగా బలి తీసుకొంటున్నారని బోధపడుతున్నది. 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 7న, 17న రెండు విడతల్లో జరగనున్నాయి. వామపక్ష తీవ్రవాదం సమస్య వల్ల ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరిపించడానికి నిర్ణయించారు. 15 ఏళ్ళ బిజెపి పాలన తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలు గెలుచుకొని దిగ్విజయంగా అధికారంలోకి వచ్చింది. బిజెపి కేవలం 18 సీట్లే గెలుచుకొన్నది. ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రభుత్వం తీసుకొన్న అనేక పేదల అనుకూల చర్యలు తనను తిరిగి అధికారానికి తీసుకు వస్తాయని కాంగ్రెస్ ధీమాగా వుంది.
నవంబర్ 30న పోలింగ్ జరగనున్న తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు గట్టి కృషి చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు బిఆర్‌ఎస్‌కు పునర్విజయాన్ని సాధించిపెడతాయని, ఆ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించగలదనే ఆ ఆ పార్టీ నమ్మకంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంతకూ పెరగుపడుతోందని సర్వేలు చెబుతున్నాయి. 40 శాసన సభా స్థానాలున్న మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనున్నది. గత ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టిన మిజో నేషనల్ ఫ్రంట్ మయన్మార్ శరణార్థుల వివరాలు సేకరించే విషయంలో బిజెపితో విభేదించింది. దీంతో అక్కడ బీజేపీకి ఎలాంటి ఆశలు లేవు.
కర్ణాటకలో గెలుపు.. కాంగ్రెస్ కు కిక్ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బూస్ట్ ఇచ్చింది. మరి ఐదు రాష్ట్రాల్లో గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీ వేవ్ వస్తుందా ?
అసెంబ్లీల ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందా లేదా అన్నదానిపై అనేక రకాల విశ్లేషణలు ఉండవచ్చు. కానీ ఆ ప్రభావం అనేది పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఉంటుందని గతానుభవాలు నిరూపించాయి. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం… ఆ తర్వాత జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందని… ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు నిరూపించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్కడి ప్రజలు.. అక్కడి ప్రభుత్వంపై ఇచ్చిన తీర్పు. కానీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది. దానికి కారణం ప్రధాని మోదీ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. తానే సీఎం అభ్యర్థి అన్నట్లుగా గల్లీ గల్లీ తిరిగారు. కర్ణాటక ఎన్నికల కోసం బెంగళూరు అంతా రోడ్ షో చేశారు. కానీ ఆయన పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోయింది. అంటే.. .ఓటర్లు మోదీపై వ్యతిరేకతంగా ఉన్నారని అనుకోవాలి.
వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ కటౌట్.. ఆయా రాష్ట్రాల్లోని నేతలు కాదు. మోదీనే. అక్కడ పెత్తనం చెలాయిస్తున్న నేతలకు బీజేపీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నరేంద్రమోదీనే పర్యటిస్తున్నారు. ఆయనను చూసే ఓట్లేయమమంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఫలితాల ప్రభావం ఖచ్చితంగా జాతీయ రాజకీయాలపై ఉంటుందని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తాము రేసులో ఉన్నామని వాదిస్తోంది. తెలంగాణలోనూ తమదే పీఠం అంటోంది. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలోనూ అదే చెబుతోంది. ఒక వేళ ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే.. మోదీకి తిరుగులేని విజయం దక్కినట్లే. ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఆయన హవా ఉంటుందన్న విశ్లేషణలు వస్తాయి. కానీ ఓడిపోతే మాత్రం… మోదీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అది .. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఊహించనంతగా పెరుగుతుంది. 2014లో ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలపై ప్రజల్లో .. ఎంత వ్యతిరేకత వచ్చిదో అలాంటి వేవ్ వస్తుంది. అదే జరిగితే బీజేపీ తన నెత్తిన తాను చేయి పెట్టుకోవడమే కాదు.. రాహుల్ గాంధీ నెత్తిన పాలు పోసినట్లవుతుంది. ఎందుకంటే బీజేపీ కోల్పోయే ప్రతి ఓటు కాంగ్రెస్ కు మేలు చేస్తుంది.
దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఓ నిరంతర పాలకుడ్ని కోరుకోవడం చాలా కష్టం. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీపై.. ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. గత పదేళ్లలో ప్రజల ఆదాయాలతో పోలిస్తే.. వారి ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి నిర్ణయాలు ప్రజల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేశాయి. అయితే ఆ అసంతృప్తిని బయట పెట్టుకోవడానికి ప్రజలకు ఓ కారణం కావాలి. అలాంటి కారణాన్ని బీజేపీ చేజేతులా ఇచ్చే పరిస్థితి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ద్వారా వస్తుందన్న అబిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.
ప్రజాభిప్రాయాన్ని ఓ దావలనంగా చెప్పవచ్చు. ఒక్క చోట మార్పు నినాదం ప్రారంభమైతే.. దేశం మొత్తం నినదించడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది అధికార పార్టీలే. ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టించేస్తారు. చరిత్ర చెప్పింది అదే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…