సైలెంట్ ఓటింగ్ పైనే కేసీఆర్ టెన్షన్

By KTV Telugu On 7 August, 2023
image

KTV  Telugu ;-

ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందరికంటే ఎక్కువ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా. బీఆర్ఎస్ విధానాలు, ప్రజాప్రతినిధుల తీరుతో అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంత ప్రజలు ఆగ్రహం చెందుతున్నారా. అందుకే ఆయన ఇటీవలి కాలంలో కొన్ని నిర్ణయాలు ప్రకటించి జనాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా. అయినా జరిగేదీ శూన్యమని, కేసీఆర్ పట్ల వ్యతిరేకత అంత సులభంగా తగ్గేది కాదన్న చర్చ జరుగుతోందా…

ఇతర పార్టీలు రేపు ఆలోచించేది. కేసీఆర్ మదిలో ఇవాళే మెదులుతుందని చెబుతారు. ప్రత్యర్థుల కంటే ముందు వ్యూహాలు రచించి వారిని బోల్తా కొట్టించగలరని లెక్కలేస్తుంటారు. అందుకే వరుసగా రెండు సార్లు గెలిచి మూడో సారి కూడా విజయం సాధించాలన్న తపనతో ఆయన పనిచేస్తున్నారు. మరి ఈ సారి మాత్రం అంత సులభం కాదని సర్వేలు చెబుతున్నాయి. ఆయనతో పాటుగా ఎమ్మెల్యేల పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత ఉందన్న వార్తలు వస్తున్నాయి.

మాస్టర్ పోలిటీషియన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఏడాది ఆఖరుకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు చావో రేవో అన్నట్లుగా తయారు కాబోతున్నాయి. పైగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నాయకుడిగా ఆయన ఈ ఎన్నికలకు వెళ్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అత్యంత ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఉన్న సీఎంగా కేసీఆర్ పేరు నమోదైందని కొంతకాలం క్రితం ఒక సర్వే చెప్పింది. ఐఎఎన్ఎస్ – సీ ఓటర్ సర్వే ప్రకారం కేసీఆర్ పట్ల తెలంగాణలో 30 శాతం పైగా ప్రజా వ్యతిరేకత ఉంది. ఏ ముఖ్యమంత్రికి ఇంతటి వ్యతిరేకత లేదని సీ ఓటర్ జరిపిన సర్వేలో తేలిందని తెలియడంతో కేసీఆర్ స్వతహాగానే టెన్షన్ కు లోనయ్యారు. అప్పటి నుంచి ప్రతీ నెల ఆయన సర్వేలు చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. గత నెలలో జరిపిన సర్వేలో కూడా అంత ఆశాజనకమైన ఫలితాలు రాలేదని తెలస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు చెబితేనే జనం అంతెత్తున ఎగిరి పడుతున్నారని అంతర్గతంగా జరిపిన ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బాగా దూరం జరిగారని తేలడంతో కేసీఆర్ కాస్త ఇబ్బందిగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రేటింగ్ పూర్తిగా పడిపోయిందని సిట్టింగులను కొనసాగించాలా వద్దా అన్నది కేసీఆర్ తేల్చుకోలేకపోతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లీడర్లు, ప్రజల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతిన్నదని ఎమ్మెల్యేలు, వారి అనుచరుల అరాచకాలు, కబ్జాలే ఇందుకు కారణమని తేల్చారు.

స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యర్థి పార్టీల వారు సమస్యలను ఏకరవు పెడుతున్నా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని కేసీఆర్ తో స్వయంగా టచ్ లో ఉన్న సర్వే సంస్థలు తేల్చాయి. ఇప్పటికే పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలు తక్షణమే నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో ఉంటే కంటే గల్లీల్లో తిరిగితే ఓట్లు రాలతాయని ఆయన సందేశం పంపడంతో ఏదో జరుగుతోందని ఎమ్మెల్యేలు టెన్షన్ పడిపోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలంగాణలోని మారు మూలకు కూడా చేరాయని సర్వే సంస్థలు నిర్థారించాయట. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీతో తమ బతుకులు బస్టాండ్ అయ్యాయని తెలంగాణ యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రియల్ ఎస్టేట్ ని విస్తరించి కబ్జాలు, ఇసుక దోపిడీలకు పాల్పడుతున్నారని జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్న అసంతృప్తి గ్రామీణ మహిళల్లో నెలకొంది. దాని వల్ల కుటుంబాల్లో పేదిరకం విపరీతంగా పెరిగి తిండి గడవడం కష్టమవుతోంది. వ్యవసాయాధారిత ఉపాధి దెబ్బతినడంతో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదని జనం వాపోతున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల యువకులు మహిళలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతు ఎన్నికల నాటికి తమ తడాఖా చూపిస్తామని చెబుతున్నట్లుగా కేసీఆర్ చేసిన సర్వేలో తేలింది.

కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సైలెంట్ ఓటింగ్ పెరిగిపోతోందని ముఖ్యమంత్రి స్వయంగా ఒకరిద్దరు నేతల వద్ద ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. కనీసం ఐదు నుంచి ఆరు శాతం వరకు ఆ సెగ్మెంట్ దెబ్బకొట్టే అవకాశం ఉందని అట్లాగే జరిగితే 119 అసెంబ్లీ స్థానాల్లో 60 కూడా రావడం కష్టమేనని పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. ఆ సైలెంట్ ఓటింగ్ తమకు ఇబ్బందికరంగా మారకుండా ఉండేందుకు అటు పట్టణ ప్రాంతాలు, ఇటు గ్రామీణ ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకునే చర్యలను కేసీఆర్ ప్రకటించారు. అందులో మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమైతే, రెండోది రైతు రుణమాఫీగా చెప్పుకోవాలి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మె చేసినప్పుడు ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు వారికి బాగా కోపం తెప్పించింది. వారెంతో ఆగ్రహం చెంది ఉన్న నేపథ్యంలోనే కోపాగ్నిని చల్లార్చేందుకు విలీన ప్రతిపాదన తీసుకొచ్చారని చెబుతున్నారు. దీని వల్ల 48 వేల మంది పట్టణ, గ్రామీణ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తమకు సానుకూలంగా మారతాయన్నది కేసీఆర్ విశ్వాసం. జరిగిందేదో జరిగిపోయింది మంచే చేశారు కదాని … సంతోషించి తనకు అనుకూలంగా మారతారని ఆయన నమ్మతున్నారు.

కేసీఆర్ కేబినెట్లో తీసుకన్న మరో నిర్ణయం రైతు రుణ మాఫీ. అది జాప్యం కావడానికి కారణాలను కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తోసేసారు.కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం జాప్యం జరిగిందన్నారు. రైతులకు అందిచాల్సిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని కేసీఆర్ తెలిపారు. ఇంకా 36 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయాల్సి ఉందని, దాన్ని విడతల వారిగా సెప్టెంబరు రెండో వారం వరకు పూర్తి చేస్తామని చెబుతూ ఆ ప్రక్రియను ఆగస్టు 3 నుంచి ప్రారంభించారు.

అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యులు సెప్టెంబరు ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ లోపు జనంలోని వ్యతిరేకతను పోగొట్టుకుని ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అందులోనూ 61 శాతం గ్రామీణ జనాభా ఉన్న తెలంగాణలో వారు ఆగ్రహం చెందితే తనకు పుట్టగతులుండవని కేసీఆర్ కు తెలుసు. తాను జరిపించిన సర్వేల్లో కూడా అదే తేలడంతో కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారని అనుకోవాలి

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..