తెలంగాణలో బీజేపీకి అంత సీన్ ఉందా. వాళ్లు చెప్పుకుంటున్నట్లుగా 13 నుంచి 14 లోక్ సభా స్థానాలు వస్తాయా. అరువు తెచ్చుకున్న నేతలతో బీజేపీ సాధించబోయేదేమిటి… మోదీ కరిష్మాతో కొట్టుకురావాలన్న ప్రయత్నం ఫలిస్తుందా. ఇచ్చిన హామిలు నెరవేర్చలేని పరిస్తితుల్లో బీజేపీ తెలంగాణ ప్రజ విశ్వసిస్తుందా…
లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు తారా స్థాయికి చేరింది.అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ప్రచారంలో బీజేపీ అందరితో పోటీ పడుతోంది. ముక్కోణ పోటీలో వలసల కారణంగా బీఆర్ఎస్ కాస్త వెనుకబడిపోయినా.. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగానే కనిపిస్తోంది. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంటే..బీజేపీ ఆయనతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. ఐనా సరే కమలం పార్టీలో ఏదో తెలియని అనుమానం, ఏదో కనిపించని వెలితి వారిని వెంటాడుతోంది. బీబీ పాటిల్, ఆరూరి రమేష్ లాంటి వలస నేతలను నమ్ముకుని కమిటెట్ కేడర్ ను పక్కనపెట్టారన్న ఫీలింగ్ కనిపిస్తోంది. ఇప్పటి దాకా పార్టీకి రాష్ట్రంలో నలుగురు ఎంపీలున్నారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లాంటి ఎంపీల దూడుకుతో పార్టీ జోష్ లోనే ఉందని చెప్పక తప్పదు. కాకపోతే ఈసారి కొత్తగా టికెట్లు పొందినవారి విజయావకాశాలపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు తాజాగా రాజకీయాల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకున్న ఆరెస్సెస్ బ్యాగ్ గ్రౌండ్ లో వినోద్ ఒక్కరే నెగ్గుకురాగలరన్న నమ్మకం కలుగుతోంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో రామాలయ అంశం సీనియర్ సిటిజెన్స్ పై పనిచేస్తే వినోద్ రావు గెలిచినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. కాకపోతే పార్టీలో ఉన్న అంతర్గత ఆధిపత్యపోరు కొన్ని కీలక నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.. అది సికింద్రాబాద్ అయినా కావచ్చు. అయినా కావచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి…..
హామీల వరద పారించడం, ఒక్క దాన్ని కూడా అమలు చేయకపోవడం రాజకీయ పార్టీలకు అలవాటే. బీజేపీ కూడా అంతే. మాటలు కోటలు దాటి.. చేతలు గుమ్మాలు దాటని తీరు తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నాలుగు ప్రధాన హామీల్లో ఒకటి కూడా పూర్తి చేయని బీజేపీ..ఇప్పుడు తెలంగాణ ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నంలో ఉందని ప్రత్యర్థులంటున్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీలకు ఢిల్లీలో సీన్ ఉండదని కూడా వినిపిస్తున్న మాట. మోదీని కన్విన్స్ చేసి తెచ్చుకోవడం అంత వీజీ కాదు కదా..
బీజేపీ ఇచ్చిన హామీలన్నీపెండింగులోనే ఉన్నాయి. 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పాలమూరు పర్యటనలో రాష్ట్రానికి పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం హామీ ఇచ్చారు. ఇంకేముంది వచ్చేసిందీ.. అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెంటనే పసుపు రైతులను మునగచెట్టు ఎక్కించేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు సంతోషించారు. 2019లో ఎన్నికల్లో పసుపు బోర్డు రాలేదనే కల్వకుంట్ల కవితను ఓడించిన నిజామాబాద్ పసుపు రైతుల ఇప్పుడు నగుమోముతో బీజేపీ నేతలను ఎదురెళ్లిన మాట నిజమే అయినా ఒకటి రెండు నెలల్లోనే వారి ఉత్సాహం ఆవిరైపోయింది. పసుపు బోర్డు అతీ గతీ లేకుండా పోయింది. అసలు పసుపు బోర్డు నిజామాబాద్ లోనే పెడతామన్నారా…లేక గుజరాత్ తరలించుకుపోతున్నారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ దిశగా 2023లో ఇచ్చిన గెజిట్ ఏమైపోయిందని వారు నిలదీస్తున్నారు. ఇక 40 ఏళ్ల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కల కూడా నెరవేరలేదు. ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ తర్వాత దాన్ని గుజరాత్ తరలించుకుపోయారని చెబుతున్నారు. నిజానికి ఓరుగల్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని 1980లోనే ఇందిరాగాంధీ ప్రకటించారు. 2014నాటి విభజన చట్టం షెడ్యూల్ 13లో కూడా దాని ప్రస్తావన ఉంది. ఇటీవల దాన్ని మార్చేసి పీరియాడిక్ వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ అని, ఆ తర్వాత వ్యాగన్ రిపేర్ సెంటర్ అని, వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ అని చెబుతూ అయోమయానికి గురి చేసి వదిలేశారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని స్థానిక బీజేపీ నేతలిచ్చిన హామీ కూడా బుట్టదాఖలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అమిత్ షా పర్యటన సందర్భంగా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి వెలిసిన పోస్టర్లను బీజేపీ వారే వేయించారని చెప్పుకున్నారు. అయితే 1996లో మూతబడిన ఫ్యాక్టరీ పున ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. ఒక హామీని మాత్రం కేంద్రప్రభుత్వం పాక్షికంగా అమలు చేసిందని ఒప్పుకోవచ్చు. ములుగు గిరిజన విశ్వవిద్యాలయాన్ని తాత్కాలిక భవనాల్లో కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. దానికి ఇంతవరకు సరైన ప్యాకల్టీని ఏర్పాటు చేయడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణపై తెగ హడావుడి చేసిన బీజేపీ ఇప్పుడు మాత్రం దాన్ని నత్తనడక నడిపిస్తోంది. మంద కృష్ణ మాదిగ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. నాదీ హామీ అంటూ గట్టిగా భుజం తట్టినప్పటికీ… ఇంతవరకు జరిగిందీ శున్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పోటీ చేసి గెలిచే బీజేపీ ఎంపీలకు మోదీ, అమిత్ షా ఎదుట మాట్లాడే సీన్ లేదని చెబుతున్నారు. వారి దూకుడంతా స్థానిక ప్రత్యర్థుల మీదేనని, ఢిల్లీలో నోరు తెరవరని అంటున్నారు . పైగా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యమిచ్చే బీజేపీ, నిజంగా దక్షిణాదిపై దృష్టి పెడుతుందా అన్నది అనుమానమే…
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ..వచ్చే మే నెలలో నాలుగైదు సార్లు తెలంగాణకు వచ్చిపోయే అవకాశం ఉంది. ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించే వీలుంది. ఎన్నికలైపోయిన తర్వాత హామీలను మరిచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. ఈసారి తెలంగాణ విషయంలో బీజేపీ అదే తీరును ప్రదర్శిస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గత అనుభవాలు అలాంటివి మరి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…