మహాలక్ష్మీ..ఎక్కడున్నావమ్మా…?

By KTV Telugu On 28 September, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల జనంలో అసంతృప్తి పెరిగిపోతోంది. హైడ్రా పేరుతో కూల్చివేతలు  మినహా రేవంత్ చేసిందీ శూన్యమని జనం చెప్పుకుంటున్నారు.  ఇచ్చిన హామీలు మరిచి కక్షసాధింపుకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నిరోజులైనా జనం కోసం  చేసిందేమిటని ప్రశ్నించే  వారు రోజురోజుకు పెరుగుతున్నారు.

బీఆర్ఎస్ పట్ల విసుగుచెందిన తెలంగాణ ప్రజలు.. ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అది  నెరవేరలేదన్న అసంతృప్తి పెరిగిపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేమిటి…ఇప్పుడు చేసిందేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చిన ఆరు నెలల్లో హైడ్రా పేరుతో కూల్చివేతలకు కాంగ్రెస్  ప్రభుత్వం తెరతీసింది.ఒక్క అక్కినేని  నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మాత్రమే  కాకుండా చెరువులను ఆక్రమించి కట్టిన  నిర్మాణాలన్నీ కూల్చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ మోస్తరు మధ్య తరగతికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇటీవలే  రిజిస్ట్రేషన్ జరిగిన ఇళ్లు సైతం నేలమట్టం కావడంతో  బాధితులంతా రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. నిండామునిగామన్న ఆవేదన  వారిలో కనిపిస్తోంది. ఇక ఆక్రమణలు తొలగించే మాట ఎలా ఉన్నా… కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమిటన్న ప్రశ్న తలెత్తుతుండగా.. చాలా మందిలో తీవ్ర అసంతృప్తే కనిపిస్తోంది.

ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి  వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నింటిని అమలు చేసిందని ప్రశ్నించుకుంటే శూన్యంలోకి చూడాల్సి వస్తోంది.  మహిళల ఓట్లతోనే పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్, వారికి ఎన్నికల సందర్భంలో ఓ ముఖ్యమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆడబిడ్డల పెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని  చెప్పింది. అధికారానికి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం హామీ అమలు దిశగా అడుగులు వేయలేదు. ఇటీవల డిసెంబర్ 7 తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా. ఏ మూలనో మహిళలకు నమ్మశక్యం కావడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే గడిచిన 9 నెలల కాలంలో వేలాది మంది ఆడబిడ్డల వివాహాలు జరిగాయి. మరి వారందరికీ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తరా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటు నగదు, అటు బంగారం అంటే ఆర్థిక భారంతో కూడుకున్నది అని, అసలే బంగారం రేటు విపరీతంగా పెరుగుతున్నదని, వీటన్నిటిని భరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్నది అనుమానమే అవుతుంది.

మహాలక్ష్మి అనేది ఒక విస్తృత స్థాయి పథకం. అందులో భాగంగా ప్రతీ  మహిళ  ఖాతాలో 2 వేల 500 రూపాయలు వస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

కాకపోతే ఇప్పటి వరకు అతీ గతీ లేని స్కీముగా తయారైంది అసలు ఇస్తారా.. ఇస్తే ఎవరెవరికి ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఈ స్కీమ్ అందరు మహిళలకు వర్తించకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు తీసుకునే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలకు కొత్త పథకం ద్వారా ప్రతి నెల 2,500 అందకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రస్తుతం ఎలాంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందని మహిళలకు మాత్రమే ప్రతి నెలా  2,500 సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని  అంచనా కావచ్చు. మరి అదయినా చేయాలి కదా అంటే అదీ ఇంతవరకు జరగలేదు..

ఉచిత ప్రయాణం మాత్రం అమలువుతోంది. అందులోనూ కొర్రీలు ఉన్నాయని మహిళలు వాపోతున్నారు. బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో కిక్కిరిసిపోతున్నామని, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండడం లేదని అంటున్నారు. అయితే 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ మాత్రం ప్రస్తుతానికి సక్రమంగా అమలవుతోంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి