2024 – పొలిటికల్‌ సునామి ఇయర్ !

By KTV Telugu On 1 January, 2024
image

KTV TELUGU :-

2023లో తెలంగాణ రాజకీయాలలో గుణాత్మక మార్పులు వచ్చాయి.  2024లో ఇంకా ఊహకు ఉందని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి అంచనా వేయలేం. జరగబోయే రాజకీయ పరిణామాల్ని బట్టి రాజకీయ నేతల వ్యూహాలను బట్టి మారిపోయే అవకాశం ఉంది. వీటన్నింటికీ లోక్ సభ ఎన్నికలే వేదిక కానున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో  2023 గుణాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ఇలాంటి మార్పులు రావడం అసాధ్యమని అనుకున్న  అనేక మందికి ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించింది. బాహుబలి వంటి నేతల్ని ఢీకొట్టే వారు లేరని చెప్పుకున్న మాటలు తప్పని తేలాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఈ మార్పులు రాత్రికి రాత్రి రాలేదు. అలాగని.. ఏకపక్షంగా ఎన్నికలు జరగలేదు. జనవరిలో ఉన్న వాతావరణం.. ఆగస్టుకు మారిపోయింది. డిసెంబర్‌కు పూర్తిగా ఏకపక్షమైపోయింది. ఈ రాజకీయ చదరంగంలో పావులు సరిగ్గా కదపడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ అడుగుల్ని సమర్థంగా  ఉపయోగించుకుని విజయానికి మెట్లు వేసుకున్న వారు విజయవంతం అయ్యారు. ఖచ్చితంగా గెలుపు ఖాయమనుకున్న వారు చివర్లో పరిస్థితి గమనించి వేసిన అడుగులు కూడా.. మైనస్ అయ్యాయి. తెలంగాణలో ఈ 2023లో పొలిటికల్ విన్నర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి.

2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న స్థితిలో కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. ఇప్పుడు కాదు.. గత పదేళ్ల కాలంలో ఒక్క ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలచిన దాఖలాలు లేవు. అంతేనా.. కనీసం డిపాజిట్లు తెచ్చుకునే  పరిస్థితి  లేకుండా పోయింది. జనవరిలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోరు ఉంది. కానీ తర్వాత నుంచి పార్టీ పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది. ఎలాంటి పరిస్థితులు ఎుదరైనా రేవంత్ రెడ్డి ఆత్మ విశ్వాసం కోల్పోలేదు.  వివిధ పరిణామాలతో క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ పోయింది. చివరికి కౌంటింగ్ వరకూ.. కాంగ్రెస్ గెలుపు సాధ్యమేనా అని చాలా మంది అనుకున్నారు. కానీ.. రేవంత్ రెడ్డి షెడ్యూల్ వచ్చిన రోజునే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి కాంగ్రెస్ నేతలు ఎక్కడా తగ్గలేదు. చివరికి చెప్పిన సమయానికి రెండు రోజుల ముందుగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే అంతటితో విజయం అయిపోలేదు. అసలు టెస్ట్ 2024 లోక్ సభ ఎన్నికల రూపంలో ఉన్నాయి.  కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు లేదా ఏడాది అన్న  నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. ఆ రెండు కలిసి పని చేస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.  పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు కాంగ్రెస్ గెల్చుకుంటే.. రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదు.  బీఆర్ఎస్ పార్టీని ఎంతగా బలహీనం చేయాలనుకుంటారో అంతగా చేస్తారు . ఒక వేల బీజేపీ బలోపేతం కావడం ఇష్టం లేదనుకుంటే.. బీఆర్ఎస్ జోలికి వెళ్లరు  రేవంత్ రెడ్డి. కానీ బీజేపీ మాత్రం తాను బలపడాలంటే ఖచ్చితంగా  బీఆర్ఎస్ బలహీనం కావాలని కోరుకుంటారు. అది పొత్తులు పెట్టుకుని లేదా ఫ్రెండ్లీగా ఉంటూ కూడా చేయవచ్చు. బీజేపీ రాజకీయం కూడా అదే. ఒక వేళ ప్రత్యర్థిగా భావిస్తే మాత్రం.. బీఆర్ఎస్ తట్టుకోవడం సాధ్యం కాదు.

అదే లోక్  సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  పరిమితమైన సీట్లు సాధిస్తే మాత్రం…  బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆపరేషన్ కమల్ చేపట్టడం ఖాయమని అనుకోవచ్చు. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీ చేసిన సైలెంట్ ఆపరేషన్ల గురించి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి అన్ని రాజకీయాలు తెలిసిన వ్యక్తి. తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు  తెలియనిదేం కాదు. కానీ లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించలేకపోతే ఆయన కూడా చేయగలిగిందేమీ ఉండదు. అందుకే  2024 రాజకీయాల్లో వచ్చే పెను మార్పులు పూర్తి స్థాయిలో లోక్ సభలో వచ్చే ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు ఎలా వచ్చినా ఆ తర్వాత పరిణామాలు మాత్రం పొలిటికల్ సునామీని సృష్టించే అవకాశం ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి