వరుడు ఒక్కడే కానీ వధువులిద్దరు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చూడని పెళ్లి సంబురం ఇది. ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లాడాడో యువకుడు. ఏ విదేశాల్లోనో కాదు మన తెలుగుగడ్డపైనే. రహస్యమేం లేదు. బంధుమిత్ర సపరివారంగా అందరి ముందే. ఒకే వేదికపై ఇద్దరమ్మాయిలతో పెళ్లి సందడి వెనుక పెద్ద కథే ఉంది. ఇందులో మరో విశేషం కూడా ఉంది. పిల్లలు పుట్టిన ఏడాదికి డాడీ చేసుకున్న పెళ్లి ఇది. ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి పేరు సత్తిబాబు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అక్కడితోనే ఆగలేదు వరసకి మరదలైన సునీత అనే మరో యువతిని కూడా ఇష్టపడ్డాడు. ఏడాది కాలంగా ఇద్దరితో సహజీవనం కూడా చేస్తున్నాడు. సత్తిబాబుతో సునీత, స్వప్నకు ఒక్కో సంతానం కూడా కలిగారు.
అంటే పెళ్లిపీటలెక్కిన నవవరుడు ఓ పాప, బాబుకి తండ్రి, ఇద్దరు భార్యలకు మొగుడన్నమాట. ఇద్దరు అమ్మాయిలనీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పేసరికి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ఆ యువతుల తల్లిదండ్రులు పెద్దల ముందు పంచాయతీ పెట్టారు. ముగ్గురి ఇష్టాలను తెలుసుకున్న గ్రామ పెద్దలు ఇద్దరినీ కట్టేసుకోమని రచ్చబండ తీర్పు ఇచ్చేశారు. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి సైలెంట్‌గా ఏ గుళ్లోనో చేసుకోలేదు సత్తిబాబు. శుభలేఖలు వేయించి బంధుమిత్రులందరినీ పిలిపించి వాళ్ల సమక్షంలోనే ఇద్దరు భార్యల మెడలో తాళి (చెరొకటి) కట్టేశాడు. ఏదో సిన్మాల్లో అంటే సరదాగా చూడొచ్చుగానీ రియల్ లైఫ్‌లో అందులోనూ తెలుగురాష్ట్రంలో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదని వచ్చినవారు విస్తుపోయారు. పెళ్లి చేసుకున్నాడు బానే ఉంది. ఇద్దరు భార్యలతో సత్తిబాబు ఎలా నెట్టుకొస్తాడన్నదీ ఇంట్రస్టింగ్ పాయింటే.