తెలంగాణ కేబినెట్లో ఇప్పుడు అంతా సీనియర్లే ఉన్నారు. బయట నుంచి వచ్చిన వారైనా, పాతకాపులైనా అందరూ దాదాపుగా వయసు మళ్లుతున్న వారే. కాంగ్రెస్ పార్టీకి యువరక్తం కావాలంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని, యువతకు పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో వినిపిస్తున్న రెండు మూడు పేర్లలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ కూడా ఉన్నారు. ఆయనకు ఖచితంగా మంత్రి పదవి దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు….
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సంగ్రామం కూడా ముగిసింది. 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై రేవంత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో 17 మంది మంత్రులుండే ఛాన్సుందని తెలిసినప్పటికీ తొలి సారి 11 మందికి అవకాశం వచ్చింది. మిగతా ఆరు స్థానాల భర్తీకి సంబంధించిన కసరత్తు మరికొద్ది రోజుల్లోనే ముగుస్తుందని తెలంగాణ పీసీసీ వర్గాలు అంటున్నాయి. ఎవరికి పదవులు ఇచ్చినా యువతకు సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కనిష్టంగా ఒకరు, గరిష్టంగా ఇద్దరు యువకులకు మంత్రి పదవులు కట్టబెట్టే ఉద్దేశం కనిపిస్తోంది.కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది.దానితో ఓ యువకుడి పేరుపై అన్వేషణ.. మైనంపల్లి రోహిత్ దగ్గర ఆగుతోందని చెబుతున్నారు….
ఎన్నికల ముందే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరికీ పార్టీ టికెట్ దక్కింది. హన్మంతరావు ఓడిపోతే, రోహిత్ విజయం సాధించారు. అలాంటి పరిస్థితి వస్తే తమ కుటుంబాన్ని సముచితంగా గౌరవించారని మైనంపల్లి హన్మంతరావు ముందే ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మంత్రివర్గం విషయంలో రోహిత్ పేరు బలంగా వినిపిస్తోంది…
కాంగ్రెస్ పార్టీ అంటే ముసలి బ్యాచ్ కు సీనియర్లకు మాత్రమే అవకాశాలు ఉంటాయని మొదటి నుంచి ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆ ట్రెండ్ ను మార్చేసి… పార్టీకి యూత్ లుక్ తీసుకురావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యువతను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఇటీవలే బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు యువ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. రోహిత్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజా సేవలో ఉన్నారు. మైనంపల్లి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ పరిసరాల్లో ప్రతీవారం వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తున్నారు. మైనంపల్లి కుటుంబం జనానికి దగ్గరగా ఉంటుందన్న పేరు తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మల్కాజ్ గిరిలో ఓడిపోయిన హన్మంతరావు తన కుమారుడి కోసం ఢిల్లీలో చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. తనకు ఎలాగూ పదవి వచ్చే అవకాశం లేనందున కుమారుడికి ఛాన్సివ్వాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకు రాహుల్ గాంధీ, ఖర్గే కూడా అంగీకరించినట్లుగా చెబుతున్నారు….
జూన్ రెండో వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు మైనంపల్లి రోహిత్, బల్మూరి వెంకట్ ఇద్దరికీ మంత్రిపదవులు ఇస్తారా.. ఒక్కరికే ఇస్తారా అన్నది చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…