వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ అధినేత్రి వై.ఎస్.షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముహూర్తం ఖరారైపోయినట్లు ఢిల్లీ కోళ్లు తెలంగాణా స్లాంగ్ లో స్కూస్తున్నాయి. తాను ఏం చేసినా తెలంగాణా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేస్తానని షర్మిల నర్మగర్భంగా అన్నారు. ఆమె తెలంగాణా కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంటే.. షర్మిలను తెలంగాణా కాంగ్రెస్ లోకి తీసుకోవద్దంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కావాలంటే ఆమెను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లోకి తీసుకోవచ్చంటూ రేవంత్ రెడ్డి సలహా కూడా ఇచ్చారు. అయితే అటు కాంగ్రెస్ హై కమాండ్ కానీ ఇటు షర్మిల కానీ ఢిల్లీలో ఏం జరిగిందో పెదవి విప్పడం లేదు. అసలేం జరుగుతోందంటూ కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది.
వై.ఎస్.షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ కొద్ది వారాల క్రితం నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు మించి ఎలాంటి క్లూలూ రావడం లేదు. తాజాగా షర్మిల నేరుగా ఢిల్లీ వెళ్లి టెన్ జన్ పథ్ లో పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో పాటు ఆమె తనయుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సోనియా ,రాహుల్ గాంధీలు చాలా బిజీగా ఉన్నా తనకు చాలా సమయం ఇచ్చి తనతో చర్చించారని వై.ఎస్.షర్మిల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. గాంధీల తీరు తనను కట్టి పడేసిందని ఆమె కొనియాడారు కూడా. షర్మిల గాంధీలతో భేటీ కావడంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది.
షర్మిల గాంధీలను కలవడం తెలంగాణా కాంగ్రెస్ లో కొందరికి అస్సలు నచ్చలేదు. ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకోవడం కూడా వారికి ఇష్టం లేదు. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నా అవసరం లేదని దూరం పెట్టేయాలన్నది కొందరు నేతల అభిప్రాయం. కాంగ్రెస్ లో షర్మిల తండ్రి దివంగత వై.ఎస్.ఆర్. ను అభిమానించే వారు ఎంత మంది ఉన్నారో ఆయన్ను ద్వేషించే నేతలూ అంతే మంది ఉన్నారు. ఆయన్ను ఇష్టపడని నేతలే ఇపుడు షర్మిల ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం ఒకరకమైన క్లారిటీ ఉన్నట్లు కనపడుతోంది
ఒక వేళ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తిగా మారింది. దీనిపై ఎవరికి తోచిన కథనాలు వారు అల్లుకుంటున్నారు. ఎవరికి తోచిన ఊహాగానాలు వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అండ్ కో అయితే షర్మిలను ఏపీ కాంగ్రెస్ కోసమే పార్టీలోకి తీసుకుంటున్నారని ప్రచారంలో పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెక్ చెప్పేందుకే షర్మిలను కాంగ్రెస్ చేరదీస్తోందన్నది టిడిపి ప్రచార సారాంశం.
షర్మిల తెలంగాణా కాంగ్రెస్ లో చేరితే అది కాంగ్రెస్ పార్టీకి నష్టమన్నది రేవంత్ రెడ్డి వర్గం వాదన. షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే దాన్ని కేసీయార్ బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటారని వారు అంటున్నారు. సమైక్యాంధ్రకు చెందిన షర్మిలను తెచ్చుకుని తెలంగాణాను నాశనం చేస్తారా? అని కేసీయార్ ఎన్నికల ప్రచారంలో ఠారెత్తించే ప్రమాదం ఉందంటున్నారు వారు. సీమాంధ్రకు చెందిన షర్మిల రాజకీయాలు చేయాలనుకుంటే పోయి ఏపీలో చేసుకోవాలే తప్ప తెలంగాణాలో ఆమెకు ఏం పని? అని తెలంగాణా వాదులు నిలదీస్తున్నారు. అయితే తాను పుట్టింది.. పెరిగింది..పెళ్లి చేసుకున్నదీ తెలంగాణా గడ్డపైనే కాబట్టి తాను తెలంగాణాలోనే రాజకీయాలు చేస్తానని అది తన హక్కు అని షర్మిల చాలా కాలం క్రితమే దీటుగా క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ లో చేరి ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీచేయాలని షర్మిల భావిస్తోన్నట్లు కొంత కాలం క్రితం ప్రచారం జరిగింది. అయితే ఆమెను కర్నాటక కోటాలో రాజ్యసభకు పంపాలన్నది కాంగ్రెస్ ప్లాన్ అని మరో ప్రచారం జరిగింది. ఆమె తెలంగాణా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే.. 2018 ఎన్నికల తరహాలో కాంగ్రెస్ మరోసారి భంగపడాల్సి వస్తుందని కొందరు వాదిస్తున్నారు. అయితే హై కమాండ్ మాత్రం షర్మిల విషయంలో పూర్తి క్లారిటీతోనే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…