వైఎస్ షర్మిల అరెస్ట్

By KTV Telugu On 28 November, 2022
image

మంట పుట్టించిన ష‌ర్మిల మాటలు
బ్యానర్లు, ప్రచార వాహనానికి నిప్పు
షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు

తెలంగాణలో ఇంకో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. అయినా ఇప్పటినుంచే రాజకీయ వాతావరణం హీటెక్కింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వా నేనా అన్న రేంజ్‌లో ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. సొంత పార్టీలో అసమ్మతి నేతలతో కాంగ్రెస్‌ కిందామీదా పడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో వేరే పార్టీలను ప్రజలు ఆదరించే అవకాశం కనిపించడం లేదు. అయినప్పటికీ తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే పంతంతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మీద, మంత్రులు, ఎమ్మెల్యేలను ఘాటుగా విమర్శిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు ఆమెను, ఆమె విమర్శలను సీరియస్‌ గా తీసుకోవడం లేదు. ఆ మధ్యలో కొందరు నేతలు షర్మిల తమ మీద చేస్తున్న విమర్శలపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఆమె తన వ్యాఖ్యల్లో పదును తగ్గించుకోలేదు. తాజాగా ఆమె టీఆర్‌ఎస్‌ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర వ‌రంగ‌ల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 3500 కిలోమీటర్లకు చేరింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్‌లోనే వున్నార‌ని విమ‌ర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరులోనే పెద్ది ఆయనది చిన్న బుద్ధి అని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో రాళ్ల వాన పడి 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఆదుకోలేద‌ని త‌ప్పు ప‌ట్టారు. 15 రోజుల్లో పరిహారం ఇస్తానని చెప్పి సుద‌ర్శ‌న్‌రెడ్డి మోస‌గించార‌ని మండిప‌డ్డారు. ప్రజలు గెలిపించారన్న సోయి, కృతజ్ఞత కూడా ఎమ్మెల్యేకు లేదన్నారు. ఎమ్మెల్యేపై ఆమె చేసిన విమర్శలకు నిర‌స‌న‌గా చెన్నారావుపేటలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు ష‌ర్మిల కాన్వాయ్‌పై రెచ్చిపోయారు. ఆమె కేరవాన్‌కు నిప్పు అంటించారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. తన పాద‌యాత్ర‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కుట్రపూరింతంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దాడికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. పోలీసుల ముందే దాడి చేసినా వాళ్లు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పాద యాత్రను అడ్డుకుని తనను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమ‌ర్శించారు. అయితే ఆమె ఆరోపించినట్లుగానే షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మా పాదయాత్రకు అనుమతి ఉంది అయినా మా బస్సును దగ్ధం చేసినవారిని అరెస్ట్‌ చేయకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు అని షర్మిల మండిపడ్డారు.