తనో బ్రేకింగ్‌ న్యూస్‌.. చెల్లెమ్మ కష్టం ఫలిస్తోంది

By KTV Telugu On 29 November, 2022
image

వైఎస్‌ కూతురుగా..రాజీ అన్నమాట రక్తంలో లేదు!

ఆమె వెనుక నాయకులు ఎవరున్నారు.. కార్యకర్తలు ఎందరున్నారనేది ఇప్పుడు ప్రశ్నకాదు. తండ్రిలాగే తనలో పట్టుదల ఉంది. అన్నలాగే మొండితనం ఉంది. ఆ రాజీపడని రక్తమే ఆమెను ఇప్పటికి 3500 కిలోమీటర్లు నడిపించింది. తన పార్టీమీద, పాదయాత్రమీద అందరి కళ్లూ పడేలా చేసుకోవడంలో వైఎస్‌ షర్మిల కొంతమేర విజయం సాధించారనే చెప్పుకోవాలి. వైఎస్సార్‌తెలంగాణ పార్టీ ప్రకటించాక మౌనంగా కూర్చోలేదు వైఎస్‌ షర్మిల. జనంలోకెళ్లారు జనంలోనే ఉంటున్నారు. పరామర్శలు, విమర్శలు ఏ విషయంలోనూ తగ్గటం లేదు. పదునైన విమర్శలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేతను కూడా నేరుగా టార్గెట్‌ చేసుకుంటున్నారు. మొదట్లో టీఆర్‌ఎస్‌ షర్మిల యాత్రను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ పార్టీనేతల అసహనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. షర్మిల యాత్రకు అవాంతరాలు కల్పిస్తున్నారు. గోబ్యాక్‌ నినాదాలు చేస్తున్నారు.

నర్సంపేటలో షర్మిల కారవాన్‌కి టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిప్పుపెట్టాయి. రాళ్లురువ్వి అద్దాలు పగలగొట్టాయి. వైఎస్ షర్మిల కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. పరిస్థితి చేజారుతోందని చివరికి పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై ముందురోజు సభలో వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆయన అనుచరులకు కోపమొచ్చింది. షర్మిల పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాష్టీకం మీడియాలో హైలైట్‌ అయింది. దాడికి దిగినవారిని వదిలేసి పాదయాత్ర చేస్తున్న తనను అడ్డుకోవడమేంటని పోలీసులతో షర్మిల వాదనకు దిగారు.
ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుంటున్నారు వైఎస్‌ షర్మిల. వచ్చాను వెళ్లాను అన్నట్లు కాకుండా ఆ ఎమ్మెల్యే లోటుపాట్లు  ఆయనపై ఉన్న అసంతృప్తిని ఎక్స్‌పోజ్‌ చేస్తున్నారు. పాదయాత్ర ఓ మైలురాయి దాటినప్పుడల్లా తల్లి వైఎస్‌ విజయమ్మ తోడుగా నిలుస్తున్నారు. బిడ్డను ఆశీర్వదిస్తున్నారు.

షర్మిల పాదయాత్రపై కాంగ్రెస్‌ అసహనంతో ఉంది. వైఎస్‌ చరిష్మాని షర్మిల హైజాక్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే ఒకరిద్దరు నేతల విమర్శలు తప్ప షర్మిలపై కాంగ్రెస్‌ ప్రత్యక్షదాడికి దిగలేదు. కానీ టీఆర్‌ఎస్‌ని షర్మిల ప్రసంగాలు, విమర్శలు ఇబ్బందిపెడుతున్నాయి. కేసీఆర్‌ కుటుంబంపై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై షర్మిల చేస్తున్న విమర్శలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. దాని ప్రభావమే నర్సంపేట ఘటన. కానీ షర్మిల గొంతు మరింత పదునెక్కుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు. ఏడాదిలోపే ఎన్నికలు. ఆమె కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలతో షర్మిలకు సానుభూతి పెరుగుతుందే తప్ప గులాబీపార్టీకి ఒరిగేదేమీ ఉండదు.