ఆ 10 సీట్లపై షర్మిల రెడ్డి ఆశలు

By KTV Telugu On 29 January, 2023
image

 

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
షర్మిల పార్టీ వైపు రెడ్డి సమాజిక వర్గం చూపు
వైఎస్సార్టీపీలో చేరేందుకు పొంగులేటి సిద్ధం
షర్మిలతో మంతనాలు జరిపిన శ్రీనివాస రెడ్డి
వైఎస్ తనయతో టచ్ లో దక్షిణ తెలంగాణ నేతలు
ఉమ్మడి ఖమ్మంలో ఆరు నుంచి ఏడు స్ఠానాలపై ఆశలు
ఉమ్మడి నల్లొండలో మూడు స్థానాల వరకు ఛాన్స్.
ఖంగ్ అసెంబ్లీ ఏర్పడితే కీలక భూమిక.

కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటరైనప్పుడు ఒంటరిగా కనిపించిన షర్మిలకు ఇప్పుడు సీన్ అనుకూలంగా మారుతోంది. ఆమె వెంట నడిచేందుకు చాలా మంది నేతలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఉత్తరమైనా, దక్షిణమైనా తెలంగాణలో ఏ ప్రాంతమైనా షర్మిల నామస్మరణ జరుగుతోంది.

కేసీఆర్ పాలనలో భంగపడిన కొందరు నేతలు షర్మిలతో కలిసి రాజకీయాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. నిజానికి రెడ్ల పార్టీగా పేరున్న కాంగ్రెస్ లో వాళ్లు వెళ్లలేకపోతున్నారు. హస్తం పార్టీలోని కొందరు రెడ్డి నాయకుల ఒంతెత్తు పోకడలతో వారు అటు చూడలేకపోతున్నారు. దానితో షర్మిల వారికి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అగ్రగణ్యుడిగా చెప్పుకోవాలి. ఇటీవల బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన పొంగులేటి ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ కోసం వైఎస్సార్టీపిని ఎంచుకున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వైఎస్ విజయమ్మను పరామర్శించేందుకు వెళ్లిన పొంగులేటి పనిలో పనిగా రాజకీయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. షర్మిలతో కాసేపు భేటీలో అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నేత కూడా అప్పుడు వారితో ఉన్నట్లు సమాచారం.

పొంగలేటి వైఎస్ వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 2014 ఎన్నికల్లో ఆయన ఖమ్మం లోక్ సభా స్థానంలో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తర్వాతి పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడాయన్ను దూరం పెట్టారు. దానితో వేరే దారి వెదుక్కుంటున్న పొంగులేటి ఇప్పుడు వైఎస్సార్టీపీ వైపు చూస్తున్నారు. షర్మిలకు కూడా ఒక బలమైన నాయకుడు అవసరం. పార్టీని నిధులు సమకూర్చే వ్యక్తి కావాలి. ఆ రెండు లక్షణాలు పొంగులేటిలో ఉండటంతో ఆయన్ను వైఎస్సార్టీపీలోకి ఆహ్వానించేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.

పొంగులేటిని ఆహ్వానించాలన్న ఉద్దేశం వెనుక మరో కోణం కూడా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోనే పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలనుకుంటున్నారు. సెటిలర్ల ఓట్లు ఏకమొత్తంగా తమకు వస్తే అక్కడ కనీసం ఆరు స్థానాల్లో వైఎస్సార్టీపీ విజయం సాధించడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ను ఆనుకుని ఉన్న నల్గొండ జిల్లా వైపు కూడా షర్మిల దృష్టి పడింది. అది కూడా రెడ్డి డామినేటెడ్ జిల్లానే కావడం విశేషం. నల్లొండ అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు భూవనగిరి, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడలో మూడు గెలిచినా రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాల వరకు తమ ఖాతాలో ఉంటాయని వైఎస్సార్టీపీ అంచనా వేసుకుంటుంది. తమకు పది స్థానాలు వస్తే రాష్ట్రంలో హంగ్ ఏర్పడినట్లేనని ఆ పార్టీ లెక్కలేసుకుంటోంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే ఛాన్స్ వస్తుందని విశ్వసిస్తోంది.