అమ్మా ష‌ర్మిల‌మ్మా ఇదేం ర‌చ్చ త‌ల్లీ

By KTV Telugu On 25 April, 2023
image

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సోద‌రి దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూతురు తెలంగాణ కేంద్రంగా రాజ‌కీయాలు చేయ‌డ‌మే ఓవింత‌. రాజ‌కీయంగా నిల‌బ‌డేందుకు ఆమె అనుస‌రిస్తున్న వ్యూహం మ‌రో వింత‌. టై క‌ట్టుకున్న‌ట్లు రాజ‌కీయాలు జేస్తే లోక్‌స‌త్తా జేపీ పార్టీలాగే అవుతుంది. మ‌ర్యాద‌గా వెళ్లిపోదామ‌నుకుంటే సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ రాజ‌కీయంలాగే ఉంటుంది. కాస్త కామెడీ చేస్తే కేఏ పాల్ ఖాతాలో క‌లిసిపోవ‌డ‌మే. తెలంగాణ కోడ‌లిని అంటూ రాజ‌కీయం మొద‌లుపెట్టిన వైఎస్ ష‌ర్మిల దూకుడుతోనే పేరొస్తుంద‌న్న భ్ర‌మ‌లో ఉన్న‌ట్లున్నారు. సైలెంట్‌గాఉంటే ఎవ‌రూ గుర్తించ‌ర‌న్న అభిప్రాయంతో ఆమె ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. వైఎస్ ష‌ర్మిల‌ను గ‌డ‌ప‌దాట‌నివ్వ‌టం లేద‌ని ఆడ‌పిల్ల‌ని ఆంక్ష‌ల పేరుతో వేధిస్తున్నార‌ని మొన్న‌టిదాకా కొంత‌మందిలోన‌న్నా ఓ అభిప్రాయం ఉండేది. కానీ వైఎస్ ష‌ర్మిల ఆవేశం చూస్తుంటే ఆమె ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న‌ట్లుంది. సంఘీభావానికో దీక్ష‌కో బ‌య‌లుదేర‌డం పోలీసులు అడ్డుకోవడం కామ‌న్‌. కాసేపు ప్ర‌తిఘ‌టించొచ్చు త‌న వాద‌న వినిపించొచ్చు. కానీ పోలీసుల‌పై చేయిచేసుకోవ‌డం వారితో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం ద్వారా కోరి క‌ష్టాలు కొనితెచ్చుకుంటోంది ఎటు వెళ్తోందో తెలీని బాణం. ఇందిరాపార్క్ ద‌గ్గర‌ ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న వైఎస్ ష‌ర్మిల‌ను పోలీసులు గృహ‌నిర్బంధం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. కారుదాకా వెళ్ల‌బోతే అడ్డుకునే ప్ర‌య‌త్నంచేశారు. ఇంటిబ‌య‌ట బైఠాయించ‌టంతో ఆమెను క‌ద‌ల‌కుండా చూశారు. దీంతో ష‌ర్మిల ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది.

ఓ మ‌హిళా పోలీసు చెంప ఛెళ్లుమ‌నిపించారు. మ‌గ పోలీసుల్ని వెన‌క్కి నెట్టేశారు. చివ‌రికి పోలీసుల‌మీద దాడికి దిగినందుకు కేసులో చిక్కుకున్నారు. రాజ‌కీయాల్లో ఆవేశం ఒక్క‌టే స‌రిపోదు వివేచ‌న కావాలి ప్ర‌తి అడుగూ ఆచితూచి వేయాలి. మీకు ఇక్క‌డ ప‌నేంటి ఏ ప‌నీలేక‌పోతే పోయి గాడిద‌లు కాస్కోండ‌ని ఆమె అంటే అదే ప‌ని చేస్తున్నామ‌ని పోలీసుల‌నుంచి తిరుగు స‌మాధానం వ‌చ్చింది. రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు వైఎస్ ష‌ర్మిల‌కు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌ని ఎమోష‌న్ ఇది. పోలీసులు చ‌ట్ట‌ప‌రిధిలో ప‌నిచేస్తారు అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాల ఆదేశాల‌ను అనుస‌రిస్తారు. ఏపీలో ఇదే జ‌రుగుతోంద‌న్న విష‌యం వైఎస్ ష‌ర్మిల మ‌ర్చిపోకూడ‌దు. చంద్ర‌బాబుని వైసీపీ నేత‌లు ప్ర‌తిఘ‌టించ‌డం కరెక్ట్ అయితే వైఎస్ ష‌ర్మిల‌కు పోలీసులు అడ్డంకులు సృష్టించ‌డం కూడా న్యాయ‌బ‌ద్ధ‌మే. మ‌గాడివైతే లాంటి వ్యాఖ్య‌ల‌తో వైఎస్ ష‌ర్మిల ఇప్ప‌టికే అభాసు పాల‌య్యారు. ఎంత రాజ‌కీయాల్లో ఉన్న తాను ఓ మ‌హిళ అనే విష‌యాన్ని ఆమె మర్చిపోకూడ‌దు. సంస్కార‌వంత‌మైన భాష మాట్లాడుతూనే రాజ‌కీయంగా వేడి పుట్టించొచ్చు. కానీ ఆమె ఎందుకో ఈ లాజిక్ మిస్స‌వుతున్నారు. ఆవేశంతోనే పొలిటిక‌ల్ మైలేజ్‌వ‌స్తుంద‌న్న అపోహ‌తో ష‌ర్మిల ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌హిళా నేత‌ల‌నుంచి కూడా ఆమెకు క‌నీస మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. ఖమ్మంలో తానేం చేయకపోయినా పోలీసులు కేసు పెట్టారని ఇపుడు షర్మిల విషయంలో ఏం చేస్తారని రేణుకాచౌద‌రి లాంటి ఫైర్‌బ్రాండ్ ప్ర‌శ్నిస్తున్నారు. షర్మిల మీద కేసు పెట్టే సత్తా పోలీసులకు ఉందా అని రేణుకాచౌద‌రి నిలదీస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల పార్టీ పెట్టిన‌ప్పుడు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచిన‌వారు ఇప్పుడామె వెంట లేరు. చుట్టూ ఉన్న‌వారి న‌మ్మ‌కాన్నే పొంద‌లేని ష‌ర్మిల రాజ‌కీయంగా ఏదో ఉద్ధ‌రిస్తుంద‌నుకోవ‌డం భ్ర‌మే. రాజ‌కీయాల్లో దూకుడు అవ‌స‌ర‌మే కానీ ఇలా మూర్ఖంగా ముందుకెళ్తే పాల్ పార్టీ ఖాతాలో క‌లిసిపోవ‌డ‌మే.