టీఆర్‌ఎస్‌ వెంటపడిన వైఎస్‌ ష‌ర్మిల

By KTV Telugu On 22 October, 2022
image

తెలంగాణలో ఇటు బీజేపీ…అటు కాంగ్రెస్‌ను జాగ్రత్తగా హ్యాండిల్‌ చేస్తూ చాకచక్యంగా బండి నెట్టుకొస్తున్న కేసీఆర్‌ కు వైఎస్‌ షర్మిల చెవిలోని జోరీగలాగా మారింది. ఇప్పటికే తెలంగాణలో పాదయాత్ర చేస్తూ టీఆర్‌ఎస్‌ సర్కారు తీరుపైనా, సీఎం కేసీఆర్‌ పైనా తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి ఆమె ఢిల్లీకి వెళ్లారు. ఈమధ్య ఆమె ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కార్ అవినీతిపై సీబీఐ, కేంద్ర‌హోంశాఖ‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ స‌ర్కార్ భారీగా అవినీతికి పాల్ప‌డింద‌ని, అందుకు సంబంధించిన ఆధారాల‌తో కాగ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ గిరీష్ ముర్ముకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టులోని అవినీతిని నిగ్గుతేల్చి, సంబంధిత వ్య‌క్తుల చ‌ర్య‌ల‌ను బ‌య‌ట పెట్టాల‌ని ష‌ర్మిల కోరారు. వైఎస్‌ జగన్‌తో సఖ్యతగా మెలిగే కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై ష‌ర్మిల ప‌దేప‌దే అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనకాల ఉన్న కారణాలు ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. టీఆర్‌ఎస్‌ను వైఎస్‌ షర్మిల ఎంత విమర్శించినా అటు వైపు నుంచి ఎవరూ రియాక్ట్‌ కావడంలేదు. ష‌ర్మిల‌ మాటలకు స్పందిస్తే అనవసరంగా ఆమె ఇమేజ్‌ను పెంచిన‌ట్టు అవుతుంద‌నే ఉద్దేశంతో అధికార పార్టీ నేత‌లెవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. తమపై షర్మిల వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఇటీవల స్పీక‌ర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దానిపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. మీకు ద‌మ్ముంటే త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని స‌వాల్ విసిరారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర సంస్థలకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎంత వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.