ఒంటరిగా ఎంత తిరిగినా ఉపయోగం లేదనుకున్నారో భావసారూపత్య ఉన్న పార్టీలను కలుపుకుని పోవాలని ఎవరన్నా చెప్పారోగానీ ఎర్రకండువాల గడపతొక్కారు. కమ్యూనిస్టుపార్టీలను కలిసి రావాలన్నారు. అవతలి నుంచి అనుకున్న రియాక్షన్ రాకపోవటంతో అక్కడే నాలుగు మాటలనేసి వచ్చారు. దాంతో కామ్రేడ్లు షాక్ తిన్నారు. ప్రస్తుతానికి చిన్న కౌంటర్‌తో వదిలేశారు. వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల రాజకీయం ఎవరికీ అంతుపట్టటంలేదు. కలిసి రావాలని కోరడంలో తప్పులేదుగానీ అందరినీ ఆడిపోసుకుంటే శత్రువులైపోతారన్న వాస్తవాన్ని ఆమె ఎందుకో గుర్తించలేకపోతున్నట్లుంది.
నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడాలనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల ప్రత్యేక ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. T- SAVE పేరుతో ఓ ఫోరం ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయా పార్టీ నేతలతో కలుస్తున్నారు. ఉమ్మడిగా పోరాడదాం అంటూ స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే సీపీఎం ఆఫీసులో కూడా షర్మిల అడుగుపెట్టారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో సమావేశమయ్యారు. అయితే ఆమె ప్రతిపాదనకు సానుకూల స్పందన రాకపోగా ఆమె వ్యవహారశైలిని కామ్రేడ్లు తప్పుపట్టారు. ఆమె ఎజెండాపైనా ఎర్రజెండా పార్టీలకు కొన్ని డౌట్లు ఉన్నట్లున్నాయ్. అవన్నీ చర్చకొచ్చేసరికి మ్యాటర్ హీటెక్కింది.
తన ప్రయత్నం ఫలించకపోయేసరికి వైఎస్ షర్మిలకు కోపం వచ్చేసింది. కామ్‌గా పక్కకు వచ్చేసి ఏదో ఒక సందర్భంలో తన రియాక్షన్ చెప్పొచ్చు. కానీ తనకు అంత సహనం ఎక్కడిది. సీపీఎం ఆఫీస్‌లో ఆ పార్టీ రాష్ట్రనేత తమ్మినేని సమక్షంలోనే ఘాటు విమర్శలకు దిగారు. బీజేపీకి బీటీమ్ అని తనను నిందిస్తున్న సీపీఎం నేతలు మునుగోడులో చేసిందేమిటని ప్రశ్నించారు. మీరు బీఆర్ఎస్కి Bటీంగా పనిచేయలేదా అని నిలదీశారు. వైఎస్సార్ కూతురిగా షర్మిలపై తమకు గౌరవం ఉందంటూనే ఆమెలా తాము స్పందించలేమని తమకు విజ్ఞత ఉందని తమ్మినేని వీరభద్రం చురక అంటించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేస్తున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్తో పొత్తులో పాలేరునుంచే బరిలోకి దిగాలనుకుంటున్నారు సీపీఎం నేత తమ్మినేని. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడే అవకాశం ఉన్న నేతలమధ్య సయోధ్య ఎలా సాధ్యమవుతుంది.