సెంటిమెంట్ పడుతుందా? బూమరాంగేనా?
ఉమ్మడిరాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఓ గుర్తింపు, ఊరూరా ఆయనంటే అభిమానం ఉండేది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని ఖమ్మంజిల్లాలో వైఎస్ మరణానంతరం కూడా ఆ ప్రభావం ఉంది. అందుకే ఎంపీ సీటుతో పాటు నాలుగు ఎమ్మెల్యే సీట్లను వైసీపీ గెలుచుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీలేదు. చెల్లెమ్మ తన పార్టీతో ఆ లోటు తీర్చాలనుకుంటోంది. ప్రజల మద్దతు పొందగలుగుతుందా లేదా అన్నది పక్కనపెడితే జనం చూపు తన వైపు పడేలా చేసుకోవడంలో వైఎస్ షర్మిల ఎంతోకొంత సక్సెస్సవుతోంది.
వరంగల్‌లో టీఆర్‌ఎస్ నిరసనలు, దాడుల తర్వాత హైదరాబాద్ నగరంలో వైఎస్ షర్మిల హైడ్రామా సృష్టించారనే చెప్పాలి. పోలీసులు ముందుకు వెళ్లనివ్వరని తెలిసినా ఆమె చలో ప్రగతిభవన్ అంటూ బయలుదేరారు. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారు దిగకుండా మొండికేసేసరికి ఆమె వాహనంలో ఉండగానే క్రేన్‌తో పీఎస్‌కి తరలించారు. ఓ రెండుమూడు గంటల డ్రామా నడిచింది. ఆమె పోలీసుల నిర్బంధంలో ఉండగానే పాదయాత్రకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇవన్నీ కొత్త పార్టీ మైలేజ్‌కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న షర్మిలకు ఎంతోకొంత కలిసొచ్చే పరిణామాలే.
పోలీసులు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఇంటిదగ్గర సన్నివేశాన్ని మరింత రక్తికట్టించారు. పోలీసులు కూతురిని కలవనీకుండా అడ్డుపడుతున్నారంటూ బైఠాయించారు. కూతురికి తోడుగా ఉండటం తల్లిగా తన బాధ్యతని సెంటిమెంట్ రాజేశారు. వైఎస్ షర్మిల భర్త అనిల్ కూడా ఫ్రేమ్‌లోకొచ్చారు. తన వాయిస్ వినిపించారు. మొత్తానికి ఫ్యామిలీప్యాక్ పొలిటికల్ స్టోరీ కేడర్‌కి జోష్ ఇచ్చింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా ఈ పరిణామాలపై స్పందించడం మరో కీలక పరిణామం. వరంగల్, హైదరాబాద్ పరిణామాలు షర్మిల పాదయాత్రకు టానిక్‌లా పనిచేయబోతున్నా కోర్టు షరతులు ఆమె స్పీడ్‌కి బ్రేకేసేలా ఉన్నాయి.