అటు టీఆర్‌ఎస్‌…ఇటు బీజేపీ…మధ్యలో షర్మిల

By KTV Telugu On 29 November, 2022
image

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
షర్మిల పాదయాత్రలో గొడవ కేసీఆర్‌ వ్యూహమేనా

అటు కారు…ఇటు కమలం…మధ్యలో షర్మిల…! ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్ని ఆసక్తికర పరిణామం. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే హీటెక్కింది. అటు టీఆర్‌ఎస్‌ ఇటు బీజేపీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. డిసెంబర్‌ నెల నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ బైంసా నుంచి ప్రజా మహాసంగ్రామ యాత్ర మొదలెట్టారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు యాత్రను అడ్డుకుంటే హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మరీ పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా గులాబి, కమలం శ్రేణుల మధ్యలో జరుగుతున్న రాజకీయ సమరంలో వైయస్సార్ టీపి అధ్యక్షురాలు షర్మిళ ఎంటరయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే ఆశయంతో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మీద, మంత్రులు, ఎమ్మెల్యేలను ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండని పలుమార్లు పోలీసులకు సవాల్‌ విసిరారు.

విచిత్రం ఏంటేంటే ఇన్నాళ్లుగా షర్మిలను కానీ ఆమె పార్టీని కానీ టీఆర్‌ఎస్‌ సీరియస్‌గా తీసుకోలేదు. అయినా ఆమె రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ అందరూ లైట్‌ తీసుకున్న షర్మిల హఠాత్తుగా వార్తల్లోకి దూసుకొచ్చారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని బైంసా నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న సమయంలోనే ఇటు షర్మిల పాదయాత్ర లో గొడవలు చోటు చేసుకున్నాయి. నర్సంపేటలో పెద్దిసుదర్శన్‌రెడ్డి మీద షర్మిల చేసిన విమర్శలకు నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు వైఎస్‌ఆర్‌టీపీ బ్యానర్లుకు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత పోలీసులు ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఆ పూట అంతా మీడియాలో షర్మిలపై దాడి ఘటనలే ప్రసారమయ్యాయి. మరుసటి రోజు కూడా షర్మిల ఎపిసోడ్‌ కంటిన్యూ అయింది. ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేసిన కారులోనే షర్మిల ప్రగతిభవన్‌కు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల అనుచరులు గొడవకు దిగారు. దాంతో ఆమె కారులో ఉండగానే క్రేన్‌ సహాయంతో కారును స్టేషన్‌కు లాక్కుపోయారు.

ఈ పరిణామాలకు మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అసలు ఆమె నర్సంపేటలో షర్మిల ఏం మాట్లాడారు ? చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్‌లోనే వున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరులోనే పెద్ది.. ఆయనది చిన్న బుద్ధి అని విమర్శించారు షర్మిల. ప్రజలు గెలిపించారన్న సోయి, కృతజ్ఞత కూడా ఎమ్మెల్యేకు లేదన్నారు. దాంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. చెన్నారావుపేటలో ష‌ర్మిల కాన్వాయ్‌పై దాడి చేసి ఆమె వాహనానికి నిప్పు అంటించారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. తనపై జరిగిన దాడికి మరుసటి రోజు హైదరాబాద్‌లో షర్మిల హంగామా చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ రెండు రోజుల్లో ఇంత గొడవ జరిగినా టీఆర్‌ఎస్‌ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ షర్మిలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ పరిణామాలను గమనిస్తుంటే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి అనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సరిగ్గా బండి సంజయ్‌ పాదయాత్ర మొదలయ్యే సమయంలోనే షర్మిల పాయదాత్రలో గొడవ ఎందుకు జరిగింది ? ఇన్నాళ్లుగా ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంతకంటే ఘోరంగా విమర్శించారు షర్మిల. ఆమెపై ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌ కు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఇంతకాలం ఆమెను ఏమాత్రం లెక్కలోకి తీసుకోని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకలా రెచ్చిపోయారు. అటు బండి సంజయ్‌ పాదయాత్ర తలపెట్టిన సమయంలోనే ఇటు షర్మిల పాదయాత్రలో గొడవకు దిగడం వెనకాల ఏమైనా వ్యూహం దాగుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కేసీఆర్‌ వేసిన ఎత్తుగడ అనేది కూడా చర్చకొస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ బలహీనం కాగానే దాని స్థానంలోకి బీజేపీ చొచ్చుకొచ్చేసింది. ఇది కేసీఆర్‌ ఊహించలేదు. కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ముందుకొచ్చిన బీజేపీ ఇప్పుడు కేసీఆర్‌ను మహా చికాకు పెడుతోంది. దాంతో బీజేపీని దెబ్బకొట్టడానికి షర్మిలను పైకి లేపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ వైపు నుంచి షర్మిలపై ఎలాంటి స్పందన లేకపోవడమే దీనికి నిదర్శనం అనంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో జరుగుతున్న ఈ విచిత్ర రాజకీయాలు ముందు ముందు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.