ఒకటి కావాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిందే!
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు తెలంగాణపార్టీ పెట్టినప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్న ఏపీని కబ్జాచేస్తే చెల్లి తెలంగాణలో కర్చీఫ్ వేస్తోందని చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలను మీ కుటుంబమే ఏలుకోవాలా అని ప్రశ్నించినవారున్నారు. కానీ తెలంగాణ కోడలినని, తన మెట్టినిల్లు ఇదేనని విమర్శల్ని వైఎస్ షర్మిల ఘాటుగానే తిప్పికొట్టారు. పార్టీ పెట్టానంటే పెట్టానన్నట్లు కాకుండా జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపార్టీ నేతల్ని టార్గెట్ చేసుకుని వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పదిమంది దృష్టిలో పడాలంటే, అందరి నోళ్లలో నానాలంటే ఏం చేయాలో వైఎస్ షర్మిలకు బాగానే ఒంటబట్టింది.
నర్సంపేటలో పాదయాత్రపై అడ్డంకులు, మర్నాడు హైదరాబాద్ హైడ్రామా తర్వాత వైఎస్ షర్మిలమీద మాటల దాడి పెరిగింది. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చివరిదాకా తెలంగాణకు అడ్డుపడ్డారని టీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఏపీ సీఎంగా షర్మిల అన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా గులాబీ నేతలు వివాదాల్లోకి లాగుతున్నారు. ఏదో ఒక బలహీనక్షణంలో షర్మిల తండ్రి వాదాన్ని, అన్న పాలననీ సమర్ధించకపోతుందా అన్నదే వాళ్ల ఆశ. కానీ ఎప్పుడైతే తెలంగాణ బేస్‌గా పార్టీ పెట్టిందో అప్పుడే షర్మిల ఫిక్స్ అయిపోయింది. వైసీపీ గౌరవ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకుని అమ్మ కూడా కూతురి వెంట నిలిచింది.
కుటుంబం కుటుంబమే రాజకీయం రాజకీయమే. ఉత్తరాదిలో అన్నదమ్ములు చెరోపార్టీలో చక్రం తిప్పుతుంటారు. షర్మిల తిట్టినంత మాత్రాన వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్ కూడా శత్రువైపోరు. ఎవరి రాజకీయం వాళ్లదే. అందుకే ఈ విషయంలో షర్మిల ఫుల్ క్లారిటీతో ఉన్నట్లే కనిపిస్తోంది. వైఎస్ జగన్ మీదున్న అవినీతి ఆరోపణలపై మీడియా షర్మిలని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంచేసింది. జగన్ సంగతేమోగానీ తానుమాత్రం సంపాదించుకోలేదని షర్మిల తెలివిగా సమాధానం ఇచ్చింది. తెలంగాణపార్టీ స్థాపించిన రోజే తనతో సంబంధంలేదని వైసీపీ ముఖ్యులు చెప్పిన విషయాన్ని షర్మిల గుర్తుచేస్తోంది. తనపై దాడి జరిగిన రోజు కూడా సంబంధం లేదనే వైసీపీ స్పందించిందని, తనకు సంబంధంలేని విషయాల గురించి మాట్లాడుకోవడం అవసరమా అని మీడియాని ఎదురు ప్రశ్నించింది. రేపు ఏ నదీజలాల వివాదమో తలెత్తినా, రెండురాష్ట్రాల మధ్య పంపకాల ఇష్యూ వచ్చినా షర్మిల వందశాతం తెలంగాణవైపే నిలబడేందుకు సిద్ధమైంది. ఎనీడౌట్స్?