టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల
ఎదురుదాడికి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు
ఏకు మేకైంది అన్నట్లు ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని వైఎస్ షర్మిల ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులను మహా చికాకు పెడుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించి పాదయాత్ర చేస్తున్నారు.
ఇప్పటివరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలను ఘాటైన పదజాలంతో విమర్శిస్తున్నారు. అయినాసరే నిన్నమొన్నటివరకు టీఆర్ఎస్ వాళ్లు షర్మిలను లైట్ తీసుకున్నారు. మధ్యలో ఆమె ఆరోపణలు శ్రుతిమించడంతో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన ఆరోపణలతో రచ్చ మొదలైంది. షర్మిల కాన్వాయ్ మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం, ఆమెను అరెస్టు చేయడం, మరుసటి రోజు హైదరబాద్‌లో షర్మిల కారులో ఉండగానే కారును క్రేన్‌తో సహా తీసుకుపోవడం సంచలనం సృష్టించింది.
అప్పటినుంచి షర్మిల టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. షర్మిల పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతి లభించింది. అయినా వరంగల్ పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. దీంతో మరోసారి షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, కేసీఆర్ ఓ నియంత అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారన్నారు. తన పాదయాత్రతో కేసీఆర్‌లో వణుకు పుడుతోందన్నారు. అధికారం తలకెక్కితే విపరీత బుద్ధులు పుడుతాయంటే ఇదే అని అన్నారు. తన పాదయాత్రకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని షర్మిల నిలదీశారు. శాంతిభద్రతల పేరుతో పాదయాత్రను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తానంటే కేసీఆర్ భయపడుతున్నారన్నారు.
బండి సంజయ్ పాత్ర సజావుగా సాగుతుంటే తననే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. తనను బెదిరింపు ధోరణిలో టీఆర్ఎస్ నేతలు మాట్లాడారని, టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే అధికార పార్టీకి కనీస బాధ్యత లేకుండా ఎలా పోతుందని ఆమె నిలదీశారు. అక్కడితో ఊరుకోకుండా కవితపై కూడా విమర్శలు సంధించారు. కవిత ఏ మొహం పెట్టుకుని సమాజంలోకి వస్తుందని షర్మిల ప్రశ్నించారు. ఒక మహిళ లిక్కర్ స్కామ్‌లో ఉండడం ఏంటని ఆమె నిలదీశారు. ఆమె తల ఎక్కడ పెట్టుకుంటుందని షర్మిల గట్టిగా ప్రశ్నించారు. వాళ్లకు అసలు సిగ్గేలేదన్నారు. మహిళలు కూడా లిక్కర్ స్కామ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ షర్మిలను చూసీ చూడనట్లు వదిలేసిన టీఆర్ఎస్ శ్రేణులు ఇకనుంచి ఆమెకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆమెపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడి మొదలెట్టారు.