తెలంగాణలో రెండు మూడు వారాలుగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలో దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రులను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఘాటు విమర్శలు చేశారు. అయినా ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మీద ఆమె చేసిన వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు ఆమె కాన్వాయ్‌పై దాడి చేయడం, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టడం, మరుసటి రోజు ప్రగతిభవన్‌కు బయలుదేరిన షర్మిలను పోలీసులు కారుతో సహా లాక్కుపోవడం కలకలం రేపింది. ఆ రోజు నుంచి ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉన్నా ఇప్పటినుంచే నాయకులు కత్తులు నూరుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. షర్మిల కూడా వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని ఆమె అధికారికంగా ప్రకటించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటి నుంచి ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తానని ఈ నెల 16న పాలేరులో కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని షర్మిల ప్రకటించారు. పాలేరులో మొదటి నుంచి వామపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువ. మునుగోడు ఉప ఎన్నికలో కామ్రెడ్లు టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తాను మాత్రం పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పాలేరు నుంచే పోటీ చేయాలని అనుకుంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్ కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నుంచే ఎన్నికల బరిలోకి దిగుతానని షర్మిల ప్రకటించడంతో ఆసక్తి కరంగా మారింది. ఉన్నంతలో పాలేరే తనకు సరైన నియోజకవర్గం అని షర్మిల భావిస్తున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదు.