బిజెపి గ్యారేజీలో రిపేర్ వర్క్

By KTV Telugu On 1 August, 2023
image

KTV Telugu ;-

తెలంగాణా బిజెపి అధ్యక్షుడిని మార్చడం ద్వారా డ్యామేజ్ అయిన పార్టీ ప్రతిష్ఠకు మరమ్మతులు మొదలు పెట్టారు కమలనాథులు. ఎన్నికల ముందు బండి సంజయ్ ని ఎందుకు తప్పించారంటూ బీసీ నేతలు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇది పార్టీకి మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని భావిస్తోన్న పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.తెలంగాణా బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ ని మొన్నటి దాకా బుజ్జగించినా లాభం లేకపోవడంతో ఇపుడు ఏకంగా తాయిలమే చేతిలో పెట్టేశారు. బండి సంజయ్ కి భారీ ప్రమోషన్ ఇచ్చారు.

తెలంగాణా బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పార్టీ జాతీయ నాయకత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక విధంగా సంజయ్ జాక్ పాట్ కొట్టారనే చెప్పాలి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినందుకు అలిగిన బండి సంజయ్ అనుచరులు సైతం ఎగిరి గంతేసేలా జాతీయ నాయకత్వం బండి సంజయ్ కి కీలక పదవి కట్టబెట్టింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ని నియమించింది. ఈ నిర్ణయంతో పార్టీలోని బండి సంజయ్ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం లోలోన కుత కుత లాడిపోతున్నారు. అంత కీలక పదవి ఆయనకు అవసరమా? అని నిలదీస్తున్నారు.

బండి సంజయ్ నాయకత్వంలోనే తెలంగాణా బిజెపి చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతనే పార్టీలో దూకుడు పెరిగింది. క్యాడర్ లో ఉత్సాహం ఉరకలు వేసింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ సంచలన విజయాలు సాధించి పాలక బి.ఆర్.ఎస్. కు చుక్కలు చూపించింది. సంజయ్ నాయకత్వంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి అర్ధ సెంచరీ మార్క్ కు చేరువలోకి వచ్చింది. నాలుగు స్థానాల నుంచి 44 స్థానాలకు ఎగబాకింది బిజెపి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంజయ్ సారధ్యంలో పార్టీ తిరుగులేని సత్తా చాటుతుందని అనుకుంటోన్న తరుణంలో ఆయన్ను మార్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

బి.ఆర్.ఎస్. కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న సంజయ్ అటు తెలంగాణా కాంగ్రెస్ నూ ముప్పు తిప్పలు పెడుతూ బిజెపి బలమైన ఫోర్స్ గా తీర్చి దిద్దారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే సంజయ్ ను తప్పించడంపై పార్టీలో చర్చ జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ని తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపినట్లయ్యిందని బీసీ నేతలు ఆరోపించారు. దీనిపై పార్టీ నాయకత్వంలోనూ చర్చ జరిగింది.అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో కానీ జాతీయ కార్యవర్గంలో కానీ కీలక పదవి కట్టబెడతారన్న ప్రచారమూ అప్పుడే జరిగింది.

కొద్ది రోజుల నిశ్శబ్ధం తర్వాత బండి సంజయ్ ని పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రమోట్ చేసింది పార్టీ అధిష్ఠానం. బండి సంజయ్ కి పార్టీ జాతీయ నాయకత్వంలో మంచి పేరే ఉంది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ అయితే బండి సంజయ్ పనితీరు భేష్ అని ఏకంగా భుజం తట్టి ప్రశంసించారు కూడా. పార్టీ హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తెలంగాణా అధ్యక్షుడి బండి సంజయ్ చేసిన ఏర్పాట్ల పట్ల పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ సమయంలో అద్భుతమైన ప్రణాళికతో సమావేవాలను విజయవంతం చేశారంటూ సంజయ్ ని ప్రశంసించారు.

అందుకే సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించినా ఆయనకు ఏదో ఒక కీలక పదవి ఖచ్చితంగా వస్తుందన్న ప్రచారం జరుగుతూనే ఉంది. దాన్నే ఇపుడు పార్టీ నాయకత్వం నిజం చేసింది. ఇంతకు ముందే ఈటల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డికి పదవులు కట్టబెట్టిన నాయకత్వం ఇపుడు సంజయ్ కి కూడా న్యాయం చేసింది. ఎన్నికల వరకు ఇక పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ మార్పులు పనికొస్తాయని నాయకత్వం భావిస్తోంది. పార్టీ శ్రేణుల్లోనూ ఈ మార్పులతో కాస్త హుషారు వచ్చింది. ఇక ఎన్నికల వరకు కీలక నేతలను పార్టీలోకి ఆకర్షించి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యూహరచన చేయడం తెలంగాణా బిజెపి నాయకత్వం బాధ్యత అంటున్నారు జాతీయ నాయకులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..