విలీనం.. సరైన టార్గెట్ – REVANTH REDDY – KCR – BRS- MLAS

By KTV Telugu On 22 March, 2024
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీ  పెద్ద స్కెచ్చే వేసింది . బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తమవైపుకు లాగేసుకునేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు.  దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ లో చేరేందుకు ఏకమొత్తంగా ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. నీవు  చెప్పిన విద్యే నీరజాక్షా అన్నట్లుగా కేసీఆర్ ను దెబ్బకొట్టాలన్నది రేవంత్ ప్లాన్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా లాగేసుకున్నారో..అదే పద్ధతిలో లాగి  పడేయ్యాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం….

బెల్లమున్న చోటే ఈగెలు ముసురుతాయంటారు. అధికారం ఉన్న చోటే నాయకులు, ఎమ్మెల్యేలు పోగవుతారంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది.  గతంలో సీఎల్పీని విలీనం చేసుకుని కాంగ్రెస్‌ను వీక్ చేసిన కేసీఆర్‌ను.. అదే ఫార్ములా ఉపయోగించి దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రేవంత్  రెడ్డికి  బద్ధ విరోధిగా భావించే మాజీ మంత్రి మల్లారెడ్డి  కూడా కాంగ్రెస్ లో చేరిపోయేందుకు రెడీ అయ్యారు. ఎక్కడ రేవంత్ వద్దంటారని అనుకున్నారో… కర్ణాటక వెళ్లి అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో చెప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ ఫోటోలు బయట పడటంతో అబ్బ అలాంటిదేమీ లేదని చెప్పుకోవడం వేరే విషయమనుకోండి…

అందరూ వస్తామంటే ఇక ఇబ్బంది ఏముంది. రేవంత్ చెప్పినట్లుగా గేట్లు తెరిచేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.

మొత్తం 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు  సమాచారం అందింది. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఒకరిద్దరు కాకుండా అందరూ పార్టీ మారబోతున్నారనుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్‌ఎల్పీని సీఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్.. విలీనం‌పై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడింట రెండు వంతుల మంది అంటే 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే  ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్‌కు లేఖ ఇస్తే, ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్‌ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్‌లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే స్కెచ్ వేస్తోంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. వారితో పాటు టీడీపీ నుంచి ఇద్దరిని, మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. దానితో కాంగ్రెస్ ఏమీ  చేయలేకపోయింది.

ఇప్పుడు రాష్ట్రంలో  వినిపిస్తున్నది ఒక్కటే మాట . లోక్ సభ ఎన్నికలకు  ముందే విలీన ప్రక్రియ అయిపోవాలా. లేక లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పని జరగాలా అన్న చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే జరిగిపోతే…కొత్తగా వచ్చిన వారు కూడా ప్రచారంలో  పాల్గొంటారన్న ఆలోచన వస్తోంది.అప్పుడు  కాంగ్రెస్ కు ప్రయోజనం ఉంటుందన్న  విశ్వాసం కలుగుతోంది.. కాకపోతే పార్టీ ఫిరాయింపులను తెలంగాణ  ప్రజలు అంగీకరిస్తారా  లేదా అన్నది మరో  ప్రశ్న. మరో  పక్షం  రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి