అగ్నివీరులకు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రం ప్రకటించినా ఉద్యమం ఎందుకు ఆగడం లేదు. ఉద్యోగాలు పొందడం అంత కష్టమా.. గతానుభవాలు ఏం చెబుతున్నాయి. మాజీ సైనికోద్యోగుల్లో ఎంత మందికి మళ్లీ ఉపాధి అవకాశాలు లభించాయి.. వాస్తవ స్థితిగతులేమిటి…. ఓసారి చూద్దాం.
అగ్నిపథ్ స్కీమ్ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ స్కీమ్ ద్వారా సైనిక దళాల్లో చేరి నాలుగేళ్ల తర్వాత రిటైరైన వారికి అసోం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీసు ఫోర్సెస్ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటనపై యువత నుంచి అనుకూల స్పందన రాకపోవడానికి అనేక కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 26 లక్షల మంది మాజీ సైనికోద్యోగులున్నారు. వారిలో ముసలివాళ్లు పోగా… కనీసం 25 శాతం మంది ఉద్యోగ వయసు వాళ్లు ఉన్నారనకోవాలి. అంటే దాదాపు ఆరున్నర లక్షల మంది మాజీ ఆర్మీ ఉద్యోగార్హులతో పాటు ప్రతీ ఏటా 60 వేల మంది ఆర్మీ నుంచి రిటైరవుతున్నారు. ఉద్యోగాలు వేటలో దిగే వాళ్లంతా 32 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లే. ఉద్యోగ దరఖాస్తు సమయంలో ఆర్మీ పని కాలాన్ని మినహాయింపు ఇస్తారు. అంటే 40 ఏళ్ల వయసు వ్యక్తి కూడా 23 ఏళ్ల వయసు వ్యక్తితో సమానంగా ఉద్యోగాలు పొందే వీలుంది. ఉద్యోగాల్లో వారికి కోటా ఉన్నప్పటికీ చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. 32 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన 22 వేల పైచిలుకు పోస్టుల్లో 550 లోపే భర్తీ జరిగింది. అంటే వారికున్న ఉద్యోగాల్లో అది ఒకటి పాయింట్ ఆరు శాతమే…
మాజీ సైనికోద్యోగులు మళ్లీ ఉద్యోగాలు పొందేందుకు అర్హత సాధించలేకపోతున్నారు. పోటీ పరీక్షల్లో వారి కోసం పెట్టిన కటాఫ్ మార్కులు కూడా రావడం లేదు దానితో కేటాయించిన ఉద్యోగాలు ఖాళీగా పడున్నాయి. 15 సంవత్సరాలకు పైగా ఆర్మీలో పనిచేస్తే డిగ్రీ పాసైనట్లు లెక్కగడుతూ… ఆ విద్యార్హతకు వచ్చే ఉద్యోగాల్లో పోటీ పడే అవకాశం ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆర్మీ ఇచ్చే డిగ్రీకి గుర్తింపు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సీ ఉద్యోగాల్లో పది శాతం, గ్రూప్ డీ ఉద్యోగాల్లో 20 శాతం మాజీ సైనికోద్యోగులకు రిజర్వ్ చేశారు. బ్యాంకులు, పబ్లిక్ రంగ సంస్థల్లోనూ రిజర్వేషన్ ఉంది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. అత్యల్ప శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక కావడంతో మాజీ సైనికోద్యోగుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది..
అతి పెద్ద పబ్లిక్ రంగ సంస్థ కోల్ ఇండియాలో మాజీ సైనికోద్యోగులకు 251 ఉద్యోగాలు కేటాయించగా .. ఒక స్థానం కూడా భర్తీ కాలేదు. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ప్రకటించిన కనీస విద్యార్హత ఉన్నవాళ్లు కనిపించక పోవడమే దానికి కారణంగా చెబుతున్నారు. ఆర్మీ ఇచ్చే సర్టిఫికెట్లను చట్టబద్ధమైన డిగ్రీలతో సమానంగా పరిగణించలేకపోతున్నారు. దీనితో విద్యార్హత, చట్టబద్ధమైన సర్టిఫికెట్ల విషయంలో వారికి అవగాహన కల్పించాల్సిన అనివార్యత ఉందని అధికారులు అంటున్నారు. అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే భారతీయ రైల్వే కూడా మాజీ సైనికోద్యోగుల కోసం 16 వేల ఉద్యోగాలు కేటాయించగా… అందులో1.4 శాతం మాత్రమే భర్తీ చేయగలిగారురక్షణశాఖకు సంబంధించి పది పీఎస్యూల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్తితుల్లో మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అక్కడ గ్రూప్ సీ ఉద్యోగాల్లో 3.45 శాతం మంది, గ్రూపు డీ పోస్టుల్లో 2.71 శాతం మంది మాత్రమే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు….
బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ లాంటి పారా మిలటరీ దళాల్లో కూడా మాజీ సైనికోద్యోగులకు అవకాశాలు లభించడం లేదు. కేంద్ర పారామిలటరీ దళాల్లో మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన ఉద్యోగాల్లో ఒక శాతం కంటే తక్కువే రిక్రూట్మెంట్ జరుగుతోంది. సంస్థాపరమైన సమస్యలు కూడా ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్మీ వాళ్లు యుద్ధానికి పనికి వస్తారని…అయితే కేంద్ర పారామిలటరీ దళాల్లో పనిచేసే వాళ్లు అంతర్గత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని గుర్తుచేస్తున్నారు సర్వీసులో తేడా ఉంటుందని వాదిస్తున్నారు. మాజీ సైనికోద్యోగులను చేర్చుకుంటే… అప్పటికే అక్కడున్న సీనియర్లకు కోపం వస్తుందని కూడా ఆందోళన వ్యక్తమవుతోందట. ఈ పరిస్థితుల్లోనే అగ్నిపథ్ ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి సైన్యం ఇచ్చే సర్టిఫికెట్లు అన్ని విశ్వవిద్యాలయాల్లో చెల్లుతాయని,అన్ని ఉద్యోగాలకు వాళ్లు అర్హులని ప్రకటించాల్సి ఉంది…
ఏదేమైనా విశ్వాసం కలిగించడం ముఖ్యం. రూల్స్ వారికి అనుకూలంగా మార్చడం అనివార్యం. భవిష్యత్తులో ఉద్యోగం ఖాయమని ధైర్యం కలిగించడం అవసరం. ప్రభుత్వం వారికి ఆ వెసులుబాటు కల్పిస్తుందో లేదో చూడాలి..