మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది జలజగడం మరింతగా ముదిరి పాకాన పడుతోంది. పోలవరం రాజకీయ నాయకుల మధ్య గోలవరంగా మారింది. నువ్వు ముంచావ్ అంటే నువ్వు ముంచావ్ అని తిట్ల దండకం అందుకుంటున్నారు.. ఏపీ చేస్తున్న తప్పులకు మేము శిక్ష అనుభవిస్తున్నామని తెలంగాణ గగ్గోలు పెడుతోంది.. ఇంతకీ తప్పెవరిది? పోలవరం పూర్తవుతుందా….
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం ప్రజలు నరకాన్ని చూశారు. సాధారణంగా 45 అడుగుల మేర ఉండే గోదావరి నీరు.. క్రమంలో 72 అడుగులకు చేరింది. రాముల వారి పాదాల చెంత ఉన్న భద్రాచలం పట్టణం నీట మునిగింది. 1986 తర్వాత వచ్చిన భారీ వరదతో చుట్టుపక్కల గ్రామాల ఇంకా నీట మునిగే ఉన్నాయి. వరద కాస్త తగ్గిన తర్వాత రాజకీయ బురద చల్లుకోవడం మొదలైంది. నువ్వొకటంటే నేను రెండు అంటాను అన్నట్లుగా ఏపీ, తెలంగాణ మంత్రుల పరిస్థితి తయారైంది…
గోదావరి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు దాదాపు అమీతుమీకి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. పోలవరం బ్యాక్ వాటర్స్ తో ఇబ్బంది రాకుండా ఉండాలంటే పోలవరం ఎత్తు తగ్గించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. ఆయన మాటలు సహేతుకంగా లేవని ఏపీ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం చెప్పారు. హైదరాబాద్ ను ఏపీలో కలపాలన్న డిమాండ్ వరకు వివాదం వెళ్లిపోయింది. గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో వ్యాఖ్యల వేడి తగ్గినా సమస్యకు శాశ్వత పరిష్కారంపై మాత్రం ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు..
పోలవరం పరిధిలోని ఏడు ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంపై వివాదం ఇంకా సమసిపోలేదు. గోదావరికి వరదలు వచ్చిన నేపథ్యంలో వాటిని ఏకపక్షంగా ఏపీలో విలీనం చేశారని తెలంగాణ అంటోంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెబుతున్నారు. అయితే ఈ వాదనను అంబటి రాంబాబు ఖండించారు. ముంపు మండలాలు కాబట్టే విలీనం చేశారని ఆయన వాదిస్తున్నారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ ఐదు గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు కూడా చేశారు. అయితే ఇలాంటి డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని అంబటి తేల్చేశారు…
పోలవరం విషయంలో రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పీపీఏ నివేదించినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2024 జులై వరకు సమయం అవసరమని తేల్చింది. 2022 ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా సహా పలు కారణాల వల్లే జాప్యం అవుతోందని కేంద్రం వివరించింది. రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థతో సమన్వయ లోపం కూడా దెబ్బతీసిందని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు కేంద్రంతోనూ, ఇటు తెలంగాణతోనే దాగుడు మూతలు ఆడటం వల్లే జాప్యం పెరిగిందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే నిర్మించి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తున్న మాట కూడా వాస్తవమేనట… ఏపీ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు జాప్యం కావడమే కాకుండా.. తెలంగాణలో వరదలకు కారణమవుతోంది…
ప్రతీ మూడు దశాబ్దాలకు భద్రాచలం మునుగుతోంది. 1953….1986… తర్వాత ఇప్పుడు భారీగా వరదలు వచ్చాయి. వరద తగ్గినా.. అనేక గ్రామాలు ఇంకా తేరుకోలేదు. ఎంతో మంది సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తోంది. ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. తాజాగా ఓ కొత్త వాదన.. భద్రాచలం భద్రమేనా అన్న ప్రశ్న లేవనెత్తేలా చేస్తోంది. అందుకే పోలవరం బ్యాక్ వాటర్ నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం సహా.. పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలు వరదలకు గురవుతాయి. అందుకే ముంపు ప్రాంతాల్లో కరకట్ట నిర్మించడం కోసమైనా ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. రెండు రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చి.. కేంద్రం వద్ద ప్రతిపాదన పెట్టాలి. ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రజలకు కలిగే లాభాలు తగ్గకుండా.. తెలంగాణ ప్రజలు ముంపు బారిన పడకుండా పరిష్కార మార్గం చూపాలి. అప్పుడే భద్రాచలం భద్రంగా ఉంటుంది. ముంపు ప్రాంతాల ప్రజలకు వరద తిప్పలు తప్పుతాయి. అందుకే మాటలు చాలించి… చేతలు మొదలు పెట్టాల్సి ఉంది..