కులం.. మతం.. వైఎస్ ! పాలేరుపై షర్మిల ప్లాన్ ఇదే !

By KTV Telugu On 24 June, 2022
image

తెలంగాలో తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతానని చాలెంజ్ చేసి మరీ చెబుతున్న వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నిజానికి పాలేరు నుంచి షర్మిల పోటీ అనేది చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అన్ని రకాల సర్వేలు.. గ్రౌండ్ వర్క్.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత పాదయాత్ర అక్కడికి చేరుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించారు. పాలేరునే షర్మిల ఎందుకు ఎంచుకున్నారు ? అక్కడ గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు ? అక్కడ వైఎస్ఆర్‌సీపీ కూడా గెలవలేదు కదా షర్మిల ఎలా గెలుస్తుందని అనుకుంటున్నారు ? ఇవన్నీ చాలా మందికి వస్తున్న సందేహాలు. కానీ షర్మిల పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగారు.

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాలేరులో పోటీ చేయడానికి మొదట చూసుకున్న సమీకరణం సామాజికవర్గం. పాలేరు నియోజకవర్గంలో సామాజిక వర్గంగా చూస్తే రిజర్వుడు కేటగిరి నుంచి జనరల్‌కు మార్చినప్పటి నుండి రెడ్లదే ఆధిపత్యం. వైఎస్ హయాంలో రిజర్వుడ్ గా ఉండే పాలేరును జనరల్‌గా మార్చారు. జనరల్ కేటగిరిలోకి మారిన నాటి నుండి అధికారం రెడ్డి వర్గం చేతిలోనే అధికంగా ఉంది. పాలేరు జనరల్ గా మారిన తరువాత రామిరెడ్డి వెంకటరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేలుగా పని చేశారు. రిజర్వుడుగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటనే. కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ మూడుసార్లు అసెంబ్లీలో అడుగు పెట్టి ఏకంగా మంత్రిగా పని చేశారు.

మతం, గిరిజన ఓట్లు అధికం కావడం మరో కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. పాలేరు నియోజకవర్గంలోనూ వారి ఓట్లు గణనీయ సంఖ్యలో ఉంటాయి. గిరిజనుల్లో అత్యధికులు మత మార్పిడి ద్వారా క్రైస్తవంలోకి మారారు. షర్మిల భర్తకు చెందిన సంస్థ ఖమ్మం గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయిందన్న ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అదే సమయంలో వైఎస్‌పై అభిమానం కూడా ఉపయోగపడుతుందని షర్మిల భావిస్తున్నారు. రాజకీయ పరిస్థితుల ప్రభావం తమకు అనుకూలంగా మారవచ్చనే అంచనాలతో ఖమ్మం జిల్లా పాలేరు నుండి అసెంబ్లీ వైపు షర్మిల కన్నేసినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌లో వర్గ పోరుతో లాభం వస్తుందని షర్మిల మరో ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలి వీచినా.. ఖమ్మంలో మాత్రం కారు పార్టీ ఎదురీదాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. 2016లో చనిపోవడంతో వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. తుమ్మల నాగేశ్వరరావును అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ కారణంగా 45వేలకుపైగా మెజార్టీ వచ్చింది. కానీ రెండేళ్లలో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఒటమి పాలయ్యారు. కానీ కందాల టీఆర్ఎస్‌లో చేరారు. ఓ వైపు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గం, మరో వైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు సై అంటే సై అనడంతో అధిష్టానానికి వీరి వ్యవహారం తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ వర్గానిదే అంటూ కొట్టకుంటున్నారు ఈ వర్గ పోరే తమకు ఇక్కడ కలిసి రాబోతోందనే అంచనాకు షర్మిల వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత ఎవరూ లేరు. కమ్యూనిస్టు పార్టీలు, టీడీపీలకూ కూడా పాలేరులో ఓటు బ్యాంక్ ఉంది. ఎలా చూసినా పాలేరు ఏకపక్షం కాదు.  కానీ తనకు అడ్వాంటేజ్ ఉందని షర్మిల గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అక్కడ్నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు వేరు.. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత పరిస్థితులు వేరు. మానసికంగా ఇప్పుడు తెలంగాణ మాత్రమే ప్రజల మనసుల్లో ఉంది. బయట వాళ్లపై ఎప్పుడో పాలన చేశారన్న అభిమానం పెంచుకుని ఓట్లేసే పరిస్థితి లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే షర్మిల మాత్రం ముందుకే వెళ్తున్నారు.