పిచ్చిప్రేమే ప్రాణాలమీదికి తెచ్చింది.. పాపం శ్రద్ధా!

By KTV Telugu On 24 November, 2022
image

ప్రాణాలు తీస్తాడని తెలుసు.. అయినా అతనితోనే!

కశ్మీర్‌ టూ కన్యాకుమారి.. ఈ దేశంలో ప్రేమోన్మాదుల చేతుల్లో ఎంతోమంది బలయ్యారు. కొందరు నమ్మి వెంటవెళ్లి ప్రాణాలు కోల్పోతే, మరికొందరు ప్రేమికుల ముసుగులోని కర్కోటకుల కుట్రలకు బలయ్యారు. ప్రతీ ఘటనా ఓ హెచ్చరికే. కానీ ప్రేమ గుడ్డిది. అమాయక అమ్మాయిల ఆ గుడ్డి నమ్మకమే కొందరు మృగాళ్లకు ఆయుధం. ఢిల్లీలో అయినవారికి చివరి చూపుకూడా దక్కకుండా చేసిన శ్రద్ధ వాకర్‌ ఉదంతం ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేని ఓ దారుణం.
నమ్మి వెంటవచ్చి సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా చంపాడు

అఫ్తాబ్ పూనావాలా. తన కిరాతకం బయటి ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు 35ముక్కలు చేశాడు. రోజుకో ముక్కని పారేస్తూ వచ్చాడు. ఆర్నెల్లతర్వాత బయటపడ్డ దారుణంతో పోలీసులకు దొరికింది కొన్ని కుళ్లిపోయిన మాంసంముక్కలు, ఎముకలే! ఆ దుర్మార్గుడు పోలీసులకు చెప్పినట్లు క్షణికావేశంలో జరగలేదు ఆ దారుణం. అంతకుముందే శ్రద్ధాని కడతేర్చాలని ప్రయత్నించాడు. ఆఫ్తాబ్‌ తనను బతకనివ్వడని శ్రద్ధా కూడా అనుమానించింది. సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకోవడమే కాదు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. 2020 నవంబరు 23న మహారాష్ట్ర పోలీసులకు శ్రద్ధా ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రెండేళ్లక్రితం శ్రద్ధా ఫిర్యాదుచేసిన రోజు ఆమెను గొంతునులిమి హత్యచేసేందుకు ఆఫ్తాబ్‌ ప్రయత్నించాడు. చంపేసి ముక్కలు చేస్తానని అంతకుముందునుంచే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. అందుకే కంప్లయింట్‌ చేసే సాహసం చేయలేకపోయానని శ్రద్ధా ఆ ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఆఫ్తాబ్‌ పేరెంట్స్‌ ఎంట్రీతో మళ్లీ మెత్తబడింది. ఇకమీదట తాము పోట్లాడుకోమంటూ రాతపూర్వకంగా లేఖ ఇచ్చింది. దీంతో పోలీసులు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు.
శ్రద్ధాకి ఏదన్నా హానిజరిగితే తానే కారణమని ఆఫ్తాబ్‌తో లేఖ రాయించుకుని ఉన్నా, లేదూ ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఉన్నా ఆ దుర్మార్గుడు ఇంతకి తెగబడి ఉండేవాడు కాదేమో. మరోవైపు అతనితో ఎన్నోసార్లు దెబ్బలు తిన్న శ్రద్ధావాకర్‌ అయినా ఈ జీవితం తనకు వద్దని అనుకుని ఉంటే ప్రాణాలతో ఉండేదేమో! కానీ ఆఫ్తాబ్‌ ఆమెనో ఆటబొమ్మగా చూసినా తనుమాత్రం అతని ప్రేమని కోరుకుంది. అతనితో కలిసి జీవించాలనుకుంది. అదే చివరికి ఆమె ప్రాణం తీసింది. నమ్మి దరిచేరిన ప్రియురాలి ప్రాణాలు తీసి ఆఫ్తాబ్‌ బావుకున్నదేమీ లేదు. కేసు తీవ్రత దృష్ట్యా ఏదోరోజు ఉరితాడుకు వేలాడక తప్పదు. అప్పటిదాకా ఆ మృగానికి ఈ స్వేచ్ఛా ప్రపంచంలో తిరిగే అవకాశం లేదు. కానీ ఈ కేసు అయితే అభినవ ప్రేమికులకు గుణపాఠమే కాదు ఓ పాఠ్యాంశం కూడా.